తిరుమల..
తిరుమల శ్రీవారి ఆలయం పై కరోనా ప్రభావం పడింది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో టిటిడి జారీచేసే టికెట్లను కుదించింది. ఇప్పటికే తిరుపతిలో జారీచేసే సర్వ దర్శనం టోకెన్లు ఈనెల 11న రద్దుచేయడం జరిగింది. ఇక శ్రీవారి దర్శనం కోసం ఆన్లైన్లో జారీచేసే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కూడా కుదించే విధంగా టిటిడి అడుగులు వేస్తోంది.
కలియుగ వైకుంఠమైన తిరుమల కొండపై కరోనా ప్రభావం పడింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను, భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు ఆఫ్ లైన్ ద్వారా 20 నుండి 22 వేల జారీచేసే సర్వ దర్శనం టైం స్లాట్ టోకెన్లను ఇప్పటికే పూర్తిగా నిలిపివేసింది టిటిడి ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా 30 వేల 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులు మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తుంది. అలాగే విఐపి బ్రేక్ మరియు సుపథం ఎంట్రన్స్ ద్వారా మరో ఐదు వేల మంది భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తోంది. దీంతో లక్షల సంఖ్యలో భక్తులతో కళకళలాడే తిరుమలగిరులు వెలవెలబోతోంది. ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా 30 వేల ప్రత్యేక ప్రవేశ టికెట్లను కలిగిన భక్తులు కూడా కరోనా దాటికి భయపడి తిరుమల శ్రీవారి దర్శనానికి రావటానికి భయపడుతున్నారు. దీంతో మొన్నటి రోజున కేవలం 16 వేల మంది భక్తులు మాత్రమే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పరిస్థితి వుంది. మరోపక్క రోజురోజుకు కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మే నెల కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కూడా కుదించే విధంగా టిటిడి అడుగులు వేస్తోంది. కేవలం రోజుకు 15 వేల మంది భక్తులు మాత్రమే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శ్రీవారి దర్శనానికి అనుమతించే విధంగా చర్యలు చేపట్టనున్నారు టిటిడి అధికారులు.