హైదరాబాద్, ఏప్రిల్ 26,
కరోనా కారణంగా పెండ్లి సందళ్లు అయోమయంలో పడ్డాయి. గతేడాది శుభ ముహూర్తాల కాలాన్ని మింగేసిన కొవిడ్.. కొత్త ఏడాదిలోనూ అదే పనిమీదుంది. కరోనా రెండో దెబ్బతో చాలా పెండ్లి పుస్తకాలు శ్రీకారాలు చుట్టడం అనుమానంగా మారింది. చాలా రోజుల తర్వాత ముహూర్తాలు ముంచుకొచ్చినా, కొవిడ్ కంచె దాటి దేశాన్ని చుట్టేస్తుండటంతో పెండ్లి చేయాలా? వాయిదా వేయాలా? అర్థంకాక పెండ్లి పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఫలితంగా కొంగుముడి వేసుకోవాల్సిన కొత్తజంటల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది.నాలుగు నెలల కిందట బంధుమిత్రుల కోలాహలం మధ్య నటరాజ్ పెండ్లి ఖరారైంది. మే 22 ముహూర్తం దివ్యంగా ఉందన్నారు పెద్దలు. ఫంక్షన్‌హాల్‌కు రూ.25 వేలు, డెకరేషన్‌కు రూ.10 వేలు, క్యాటరింగ్‌కు రూ.20 వేలు, ఫొటోగ్రాఫర్‌కు రూ.12 వేలు అడ్వాన్సులు చెల్లించేశారు. పెండ్లిబట్టల కోసం రెండు లక్షలు వెచ్చించారు. ఇప్పుడు కరోనా విజృంభిస్తుండటంతో నటరాజ్ కుటుంబంలో ఆందోళన మొదలైంది.జనగామ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తన కుమార్తె పెండ్లి కోసం 600 గజాల భూమిని సగం ధరకే అమ్ముకొన్నాడు. ముహూర్తం దగ్గర పడుతున్న వేళ కరోనా వ్యాప్తి పెరగడంతో ఏం చేయాలో అర్థంకావడం లేదు. మార్చిలో మంచి ముహూర్తాల సమయంలో కొవిడ్ విపత్తు మొదలైంది. లాక్‌డౌన్ కారణంగా వందల పెండ్లిళ్లు వాయిదా పడ్డాయి. లాక్‌డౌన్ ఎత్తేశాక ముహూర్తాలు ముసుగుతన్ని పడుకున్నాయి. కార్తీకం, మార్గశిర మాసాల్లో వేల పెండ్లిళ్లు జరిగాయి. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు కరోనా కష్టకాలంలో మూఢాలు ముప్పేటా దాడి చేశాయి. వరుసగా వచ్చిపడిన గురు, శుక్ర మూఢాలు పెండ్లిళ్ల సీజన్‌గా పేరున్న మాఘ, ఫాల్గుణ మాసాలను తుడిచిపెట్టేశాయి. ఫిబ్రవరిలో మొదలైన మూఢాలు మే 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టిందన్న నమ్మకంతో ఇప్పటికే నిశ్చయమైన పెండ్లిళ్లకు వైశాఖ, జ్యేష్ఠ మాసాల్లో ముహూర్తాలు నిర్ణయించుకున్నారు. డిమాండ్ అధికంగా ఉండటంతో కల్యాణమండపాల బుకింగ్, పురోహితులకు అడ్వాన్సులు, బాజాభజంత్రీలకు బయానాలు చకచకా ఇచ్చేశారు పెండ్లిపెద్దలు. తీరా శుభఘడియలు ఆసన్నమవుతున్న తరుణంలో కొవిడ్ సెకండ్ వేవ్ కరాళ నృత్యం మొదలైంది. మొదటి వేవ్‌కన్నా వేగంగా కేసులు పెరుగుతుండటం, రాత్రి పూట కర్ఫ్యూ విధించడం, లాక్‌డౌన్ అనుమానాలు బలపడుతుండటంతో పెండ్లిళ్లు వాయిదా వేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి.కుటుంబ క్షేమం గురించి ఆలోచించి పరిమిత అతిథుల మధ్య పెండ్లిళ్లు నిర్వహించాలనే ఆలోచనకు వస్తున్నారు చాలామంది. మరోవైపు, జీవితాంతం జ్ఞాపకం ఉండే పెండ్లి తంతును తూతూమంత్రంగా జరిపిస్తే ఒప్పుకోమని భీష్మిస్తున్న వాళ్లూ ఉన్నారు. ఇలాంటి వాళ్లు పెండ్లిని కొన్నాళ్లు వాయిదా వేసేందుకైనా సిద్ధపడుతున్నారు. వ్యాక్సినేషన్ ఊపందుకోవటం, మే నెల దాటితే కరోనా అదుపులోకి వస్తుందనే వార్తల నేపథ్యంలో ఇప్పుడు వాయిదా వేసుకొని తర్వాతి ముహూర్తాల్లో ఒక్కటవ్వాలని కొన్ని జంటలు అభిలషిస్తున్నాయి. ఈ దఫా ఆషాఢ మాసంలోనూ పెండ్లి ముహూర్తాలు ఉన్నాయంటున్నారు కొందరు సిద్ధాంతులు. రవి మిథున రాశిలో ఉండగా ఆషాఢమాసం రావడంతో ఈ నెలలో పెండ్లిళ్లు చేసుకోవచ్చని చెప్తున్నారు. ఆషాఢం కాకపోయినా, శ్రావణం, ఆశ్వీయుజం, కార్తీకం, మార్గశిరాల్లో ముహూర్తాలు ఉండటం కొంత ఊరటనిచ్చే అంశంగా కనిపిస్తున్నది. ఈ ఏడాది మాఘ, ఫాల్గుణాల్లోనూ మూఢాలు ఉన్నాయి. దేశంలో ఏడాది కాలంలో పెండ్లిళ్ల మీద జరిగే ఆర్థిక లావాదేవీలు ఒక రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువే! కట్నకానుకలు మొదలు పెట్టుపోతల వరకు ఖర్చు లక్షల్లోనే ఉంటుంది. బంగారం, పట్టుబట్టలు, కల్యాణ మండపం, క్యాటరింగ్ ఇలా చెప్పుకొంటూపోతే మధ్యతరగతి ఇంటి పెండ్లి ఖర్చు రూ.పది లక్షల మార్కును తాకుతున్నది. వేలల్లో అడ్వాన్సులు ముట్టజెప్పి తాళికట్టు శుభవేళ కోసం ఎదురుచూస్తున్న సమయంలో అనుకోని అతిథిలా కరోనా మళ్లీ వచ్చిపడింది. అడ్వాన్సులు తిరిగి రాబట్టుకునే పరిస్థితి లేదు. ధైర్యం చేసి అనుకున్న ముహూర్తానికి సిద్ధమవుదామంటే ఎప్పుడు ఏ ఆంక్షలు వచ్చిపడతాయో తెలియని దుస్థితి. ఈ నేపథ్యంలో పెండ్లి ఖర్చులు తడిసి మోపడయ్యేలా ఉన్నాయని పెండ్లి పెద్దలు వాపోతున్నారు.మే, జూన్‌లో ముహూర్తాలు పెట్టుకున్న చాలామంది ఫంక్షన్ హాళ్లు, డెకరేషన్లు, ఫొటోలు, వీడియోల కోసం రూ.వేలల్లో అడ్వాన్సులు ఇచ్చారు. ఇప్పుడు పెండ్లిళ్లు వాయిదా వేసుకుంటే ఆ ప్రభావం వీరందరిపైనా ఉంటుంది. గతేడాది లాక్‌డౌన్ దెబ్బనుంచి కోలుకోక ముందే మళ్లీ ఈ విపత్తు ఏర్పడటంతో తమ బతుకులు రోడ్డుపాలవుతాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గతేడాది కరోనా కారణంగా వివాహాది ముహూర్తాలతోపాటు వినాయక నవరాత్రులు, దేవీ నవరాత్రులు సైతం ఆశాజనకంగా ఆదాయాన్ని కల్పించలేకపోయాయి. కరోనా తీవ్రత తగ్గాక మూఢా ల వల్ల చేతిలో పనిలేకుండా పోయింది. ముహూర్తాలు మొదలయ్యే వేళకు కొవిడ్ కల్లోలం వారి ఆశలపై నీళ్లు చల్లింది. వివాహాల చుట్టూ అల్లుకున్న అన్ని రంగాల్లోనూ అనిశ్చితి నెలకొన్నది.