వాషింగ్టన్ ఏప్రిల్ 26
కరోనాతో పోరాడుతున్న ఇండియాకు అవసరమైన అన్ని రకాల సహాయం చేస్తామని స్పష్టం చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్. కష్ట సమయాల్లో ఇండియా తమకు అండగా నిలిచిందని, ఇప్పుడు తాము కూడా అదే పని చేస్తామని బైడెన్ ట్వీట్ చేశారు. ఇండియాకు అత్యవసరమైన మందులు, పరికరాలు పంపిస్తున్నట్లు వెల్లడించారు. మహమ్మారి తొలినాళ్లలో మా హాస్పిటల్స్ కొవిడ్ పేషెంట్లతో కిక్కిరిసిపోయి ఒత్తిడిలో ఉన్న సమయంలో ఇండియా మాకు సాయం చేసింది. ఇప్పుడు మేము కూడా ఇండియాకు అవసరమైన సాయం చేస్తాం అని బైడెన్ తన ట్వీట్‌లో స్పష్టం చేశారు.గత వీకెండ్‌లో తన సొంతిళ్లు ఉన్న డెలవేర్‌కు వెళ్లిన బైడెన్.. అక్కడి నుంచే ఇండియాలో ప్రస్తుత పరిణామాలను తెలుసుకున్నారు. అటు ఉపాధ్యక్షురాల కమలా హ్యారిస్ కూడా ఇండియాకు అవసరమైన సాయం చేస్తామని మరో ట్వీట్‌లో తెలిపారు. ఈ కొవిడ్ క్లిష్ట సమయంలో ఇండియాకు అవసరమైన అదనపు మద్దతు, ఇతర వైద్య పరికరాలను పంపించడానికి భారత ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాం. సాయం చేయడంతోపాటు కరోనాతో పోరాడుతున్న అక్కడి హెల్త్‌కేర్ వర్కర్లు, భారత ప్రజల కోసం ప్రార్థిస్తున్నాం అని కమలా ట్వీట్ చేశారు.కరోనా సెకండ్ వేవ్ ఇండియాను సతమతం చేసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలు స్పందించడం ఇదే తొలిసారి. ఈ క్లిష్ట సమయంలో ఇండియాకు అవసరమైన సాయం చేయాలని బైడెన్ ప్రభుత్వంపై వివిధ వర్గాల నుంచి ఒత్తిడి వచ్చింది. మనకు అవసరమైన సమయంలో ఇండియా సాయం చేసిందని, ఇప్పుడు మనం చేయాలని యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్‌తోపాటు పలువురు చట్టసభల ప్రతినిధులు, ఇండియన్ అమెరికన్‌లు డిమాండ్ చేశారు. దీంతో ఆదివారం ఉదయం భారత భద్రత సలహాదారు అజిత్ ధోవల్‌తో యూఎస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సల్లివాన్ మాట్లాడారు. ఇండియాకు అవసరమైన మందులు, పరికరాలను పంపిస్తున్నట్లు చెప్పారు.