మహబూబ్ నగర్, ఏప్రిల్ 27,
నకిలీ పత్తి విత్తనాలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దశాబ్దంన్నర కాలంగా కేంద్ర బిందువుగా ఉంది. దశాబ్దాల నుంచి రాష్ట్ర రైతాంగాన్ని అరిగోస తీయిస్తున్నాయి. నకిలీ విత్తనాలతో అన్నదాతలైన రైతుల నోట్లో మట్టి కొడుతూ అక్రమార్కులు తమ జేబుల్లో కాసుల పంట పండించుకుంటున్నారు. దిగుబడి రాక నష్టపోతున్న రైతులు అదేమని నిలదీస్తే విత్తన మాఫియా బెదిరింపులకు పాల్పడుతున్నారు. విత్తన చట్టంలో ఉన్న లొసుగులు, మండలం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొందరు ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో రాష్ట్రంలో నకిలీ విత్తనాల వ్యాపారం ఏళ్ల తరబడి నిరాటంకంగా, మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. నకిలీ విత్తనాలను పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్ ఉన్నా, ఎన్నో కేసులు నమోదవుతూ అరెస్టులు జరుగుతున్నా.. నకిలీ దందాను నిర్వహించే కంపెనీ యజమానుల్లో ఏ ఒక్కరికీ గత 20 ఏళ్లలో జైలు శిక్ష పడలేదని ఒక వ్యవసాయాధికారి వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.నకిలీ విత్తనాలు సరఫరా చేసే మాఫియా ముఠాలో సీడ్ ఆర్గనైజర్లు కీలకం. జిల్లాలో 23 పత్తి జిన్నింగ్ మిల్లులున్నాయి. ప్రముఖ వ్యాపారులు సీడ్ ఆర్గనైజర్ల పేరిట మాఫియాగా ఏర్పడి ఇక్కడి నుంచి ప్రధానంగా తెలంగాణలోని ఇతర ప్రాంతాలు సహా కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు నాసిరకం విత్తనాలు సరఫరా చేస్తున్నారు. వీరే ఎన్నికల్లో పోటీ చేసే పార్టీల నేతలకు రూ.కోట్లలో ఫండింగ్ చేస్తుంటారు. మరోవైపు ఈ ముఠాలో జిల్లాకు చెందిన ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారు. గద్వాల జిల్లాలో ఈ నెల 8వ తేదీన నాసిరకం పత్తి విత్తనాలను పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి టాస్క్‌ఫోర్స్, నిఘా విభాగం అధికారులు స్వయంగా రంగంలోకి దిగి గద్వాల పట్టణంలోని ధరూర్‌మెట్ శివారులో 40 సంచుల నాసి రకం సీడ్ విత్తనాలను పట్టుకున్నారు. పత్తి, సోయా, మిర్చి, వరి, మొక్కజొన్న, పప్పుధాన్యాలు సాగవుతాయి. దీంతో ఈ పంటలకు సంబంధించిన నాసిరకపు విత్తనాలే ఎక్కువగా మార్కెట్‌లోకి వస్తుంటాయి. అయితే నకిలీ విత్తన దందాలో పత్తిదే సింహభాగం కావడం గమనార్హం. కాగా సోయా, మిర్చి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.. ఈ మకిలీ దందాకు ఓ ముఖ్య ప్రజాప్రతినిధి, మరో కీలక అధికారి అండ తోడవడంతో.. సీడ్ ఆర్గనైజర్లు, దళారులు, దుకాణదారులతో కూడిన పటిష్ట నెట్‌వర్క్ నకిలీ విత్తన విక్రయాలు జరిపేందుకు పకడ్బందీ ప్రణాళిక రచించి అమల్లో పెట్టింది. ఈ నేపథ్యంలోనే నకిలీ విత్తనం మళ్లీ రాష్ట్ర మార్కెట్‌ను ముంచెత్తుతోంది. వ్యాపారులు, దళారులు నిరాటంకంగా అమాయక రైతాంగానికి వీటిని అంటగడుతున్నారు.జెనెటిక్ ప్యూరిటీ లేనివన్నీ (మొలకెత్తే శాతం నిర్దేశిత మొత్తానికన్నా తక్కువ ఉండటం) నకిలీ విత్తనాలేనని వ్యవసాయ శాఖ చెబుతోంది. సాధారణంగా రైతులు తాము పండించిన పంటనే విత్తనాలుగా వాడి మళ్లీ పంటలు పండిస్తుంటారు. అయితే మొలకెత్తే శాతం తగ్గడం, తద్వారా దిగుబడి తగ్గుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా విత్తన తయారీ అనేది మొదలయ్యింది. వ్యవసాయ శాఖతో పాటు (ప్రభుత్వ), ప్రైవేటు కంపెనీలు కూడా ఈ విధంగా విత్తనోత్పత్తిని చేస్తున్నాయి. ఇందుకోసం వ్యవసాయ శాఖ, కంపెనీలు ఫౌండేషన్ సీడ్ (మూల విత్తనం) ఎప్పటికప్పుడు రైతులకిస్తాయి. వారు ప్రత్యేకంగా విత్తనోత్పత్తి చేసి తిరిగి ప్రభుత్వానికి, కంపెనీలకు అందజేస్తారు. ఆ విత్తనాలనే వ్యవసాయ శాఖ, ప్రైవేటు కంపెనీలు రైతులకు విక్రయిస్తుంటాయి. రైతులు ఆయా పంటలను వేర్వేరు దూరాల్లో పండించాలి. ఈ దూరం రెండు మీటర్ల నుంచి రెండు కిలోమీటర్ల వరకు ఉంటుంది. వరిలోనైతే రెండు మీటర్ల దూరంలో వేర్వేరు వెరైటీలు పండించాలి. పత్తి విత్తనో త్పత్తిలో వేర్వేరు వెరైటీల మధ్య కనీసం 25 మీటర్లు ఉండాలి. ప్రభుత్వ విత్తనోత్పత్తిలో అయితే ఈ దూరంగా సరిగ్గా ఉందా లేదా అని వ్యవసాయ అధికారి మూడుసార్లు తనిఖీ చేస్తారు. ఈ పంటలను ప్రత్యేకంగా కోసి ప్రాసెసింగ్‌కు తీసుకురావాలి. వీటిని డీఎన్‌ఏ టెస్టులో, లేదా గ్రోఔట్ టెసు ్టల్లో పరీక్షించి నాణ్యతను (జెనెటిక్ ప్యూరిటీ) నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియలో ఎక్కడ లోపం జరిగినా, 98–99 శాతం నాణ్యత లేకపోయినా అది నాసిరకం కిందకు వస్తుంది. విత్తనాల్లో మొలక శాతం 65 నుంచి 90 వరకు ఉండాలి. పత్తిలో మొలకశాతం 75 ఉండాలి. అంతకంటే తక్కువుంటే నాసిరకం లేదా నకిలీ కింద లెక్క. అలాగే పత్తిలో బీటీ ప్రొటీన్ 90 శాతం ఉండాలి. ఈ మేరకు నాణ్యత ఉన్న వాటినే కంపెనీలు రైతులకు విక్రయించాలి.