విజయవాడ, ఏప్రిల్ 27,
జయవాడ దుర్గ గుడికి వెళ్లే భక్తులకు అలర్ట్. అమ్మవారి దర్శన వేళల్లో ఆలయ కమిటీ మార్పులు చేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా నేటి నుంచి ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆలయ పాలకమండలి ఛైర్మన్, ఈవో, ఇతర వైదిక కమిటీ సభ్యులు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది దాదాపు 45 మంది ఇప్పటికే కరోనా బారినపడ్డారు.. అర్చకుడు చనిపోయారు.దీంతో దుర్గగుడికి వచ్చే భక్తులు, ఆలయంలో పనిచేస్తున్న సిబ్బంది భద్రతను దృష్టిలో పెట్టుకొని అమ్మవారి దర్శన వేళలను కుదించారు. రోజూ ఉదయం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకే భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించనున్నారు. అంతరాలయ దర్శనాలు పూర్తిగా రద్దు చేశారు. రాత్రి 7 గంటలకు ఘాట్‌రోడ్డు, మహామండపం, మెట్ల మార్గాలను మూసివేయనున్నారు. అమ్మవారికి పంచహారతులు, ఏకాంత సేవ, ఇతర పూజలు ఏకాంతంగానే నిర్వహిస్తారు. రోజువారీ ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించకుండా పరోక్ష పద్ధతిలోనే నిర్వహించనున్నారు. సిబ్బందికి మాస్కులు తప్పనిసరి చేశారు.ప్రధానాలయం, ఉప ఆలయాల్లో విధులు నిర్వహించే అర్చకులు భక్తులు తెచ్చే వస్తువులను చేత్తో తాకరు. ఎవరైనా మాస్కులు ధరించకపోతే రూ.200 జరిమానా విధిస్తారు. క్యూలైన్లలో భక్తులు ఆరడుగుల మేర భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రతి గంటకు క్యూలైన్లను సోడియం హైపోక్లోరైడ్‌తో శానిటైజ్ చేయాలని నిర్ణయించారు. ఆలయంలో మరుగుదొడ్లు, వసతి గృహాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయనున్నారు. సెక్యూరిటీ సిబ్బంది థర్మల్ గన్స్‌తో టెంపరేచర్ పరిశీలిస్తారు.. ఆ తర్వాతే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. దర్శనం తర్వాత భక్తులు గుంపులుగా చేరకుండా భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.