న్యూఢిల్లీ, ఏప్రిల్ 27,
భారత్‌లో కోవిడ్ విజృంభణ అసాధారణంగా ఉంది. రోజువారీ కేసులు మూడు లక్షలకుపైగా నమోదవుతుండగా, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. వరుసగా ఆరు రోజుల నుంచి మూడు లక్షలకుపైగా కేసులు నిర్ధారణ అవుతున్నాయి. భారత్‌లో కరోనా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తీవ్ర విచారం వ్యక్తం చేసింది.డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నామ్ ఘ్యాబ్రియోసిస్ మాట్లాడుతూ.. అక్కడ పరిస్థితి మరీ దయనీయంగా ఉందని వ్యాఖ్యానించారు.భారత్‌లో పరిస్థితి కలచివేసే స్థితిని దాటేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితిని తట్టుకుని బయటపడేందుకు ఆ దేశానికి అవసరమైన సహాయం చేయడానికి తాము శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని వివరించారు. ‘‘డబ్ల్యూహెచ్‌వో చేయగలిగినదంతా చేస్తోంది.. వేలసంఖ్యలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, మొబైల్ ఫీల్డ్ హాస్పిటళ్లు, ల్యాబొరేటరీ పరికరాలు.. ఇలా అత్యవసరమైన అన్నింటినీ డబ్ల్యూహెచ్‌వో అందిస్తోంది’’ అని టెడ్రోస్ తెలిపారు.పోలియో, క్షయ సహా వివిధ వ్యాధుల నియంత్రణ కార్యక్రమాలకు చెందిన 2,600 మందికిపైగా నిపుణులు భారత ఆరోగ్య విభాగాలతో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. గత తొమ్మిది వారాలుగా ప్రపంచంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని, మహమ్మారి వ్యాప్తి మొదలైన తొలి ఐదు నెలల మాదిరిగానే గతవారం పాజిటివ్ కేసులు ఉన్నాయని టెడ్రోస్ పేర్కొన్నారు.ప్రపంచంలోనే అత్యధిక కేసులు, మరణాలు నమోదయిన దేశాల్లో అమెరికా తొలిస్థానంలో ఉంది. అక్కడ 32 మిలియన్ల మంది వైరస్ బారినపడగా.. 572 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధిక కోవిడ్ మరణాల్లో అమెరికా తర్వాతి స్థానాల్లో బ్రెజిల్, మెక్సికో ఉన్నాయి. భారత్ నాలుగో స్థానంలో ఉంది.
భారత్‌లోని కేసుల భారీ పెరుగుదల నిజంగా ఆశ్చర్యకరమైంది అని డబ్ల్యూహెచ్ఓ కోవిడ్ టెక్నికల్ విభాగం చీఫ్ మారియా వెన్ కెర్ఖోవే అన్నారు. ఇది భారత్‌కు మాత్రమే ప్రత్యేకం కాదని, పలు దేశాల్లోనూ ఇటువంటి పరిస్థితులే చూశామని వ్యాఖ్యానించారు. ఒకవేళ సంరక్షణ చర్యలను గాలికొదిలేస్తే చాలా దేశాల్లో ఇటువంటి దుస్థితే ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. ప్రస్తుతం మనం తీవ్ర సంక్షోభంలో ఉన్నామని స్పష్టం చేశారు.