కడప ఏప్రిల్ 27
కొవిడ్ రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి 31 వరకు పదో తరగతి విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులకు సిలబస్ మొత్తం పూర్తి అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈనెల 30కి జూనియర్ కళాశాలలు, పదోతరగతి వారికి చివరి వర్కింగ్ డేగా పేర్కొన్నారు. కొవిడ్ రెండో దశ ప్రబలకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై కడప కలెక్టరేట్‌లో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరోనా వ్యాప్తిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం అన్ని రకాల నివారణ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇందులో భాగంగానే పదో తరగతి వారికి సిలబస్ మొత్తం పూర్తయిన నేపథ్యంలో మే 1 నుంచి 31 వరకు వేసవి సెలవులు ప్రకటించినట్లు పేర్కొన్నారు. జూన్ 1 నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు వచ్చి షెడ్యూల్ మేరకు జూన్ 7 నుంచి జరిగే 10వ తరగతి పరీక్షలకు సిద్ధం కావాలని తెలిపారు. సెలవుల్లో విద్యార్థులు ఇంటి పట్టునే ఉండి పరీక్షలకు బాగా సన్నద్ధం కావాలని మంత్రి సూచించారు.