వాషింగ్టన్ ఏప్రిల్ 27
కష్టకాలంలో ఇండియాకు అండగా నిలవడానికి ప్రపంచమే తరలి వస్తోంది. తాజాగా అమెరికాకు చెందిన 40 టాప్ కంపెనీల సీఈవో ఏకమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా ఓ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి మరీ ఇండియాకు సాయం చేయడానికి సిద్ధమయ్యారు. యూఎస్ చాంబర్స్ ఆఫ్ కామర్స్‌కు చెందిన యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్, యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్, బిజినెస్ రౌండ్‌టేబుల్ ఈ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించాయి. సోమవారం దీనికోసమే ప్రత్యేకంగా సమావేశమై రానున్న వారాల్లో ఇండియాకు 20 వేల ఆక్సిజన్ కాన్సెన్‌ట్రేటర్‌లను ఇవ్వాలని నిర్ణయించినట్లు డెలాయిట్ సీఈవో పునీత్ రెంజెన్ వెల్లడించారు.ఈ టాస్క్‌ఫోర్స్ ఇండియాకు అత్యవసరమైన వైద్య పరికరాలు, వ్యాక్సిన్లు, ఆక్సిజన్, ఇతర సాయం చేయనుంది. ఈ యూఎస్ పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌లో ఏర్పాటైన దీనికి గ్లోబల్ టాస్క్‌ఫోర్స్ ఆన్ పాండెమిక్ రెస్పాన్స్: మొబిలైజింగ్ ఫర్ ఇండియా అనే పేరు పెట్టారు. మరో దేశంలో నెలకొన్న ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు కావడం ఇదే తొలిసారి అని అమెరికా విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్ ట్వీట్ చేశారు. అమెరికాలోని ప్రైవేట్ సెక్టార్ ఇండియాలో ఏర్పడిన కొవిడ్-19 సంక్షోభానికి ఎలాంటి పరిష్కారం చూపించగలదో ఇది నిరూపిస్తోందని బ్లింకెన్ అభిప్రాయపడ్డారు. ఇండియాకు సాయం చేయడానికి చాలా అమెరికా కంపెనీలు ముందుకు వచ్చాయని డెలాయిట్ సీఈవో రెంజెన్ చెప్పారు. తమకు సాధ్యమైనంత సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇండియాలో ప్రస్తుతం ఆక్సిజన్ కొరత ఉన్న కారణంగా మొదట వాటినే సరఫరా చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.ఈ వారం మధ్యలోనే ఇండియాకు వెయ్యి ఆక్సిజన్ కాన్సెన్‌ట్రేటర్‌లు రానున్నాయని, మే 5 వరకు మరో 11 వేలు పంపిస్తామని రెంజెన్ తెలిపారు. ఇక ఇండియా ప్‌ుధాని, అమెరికా అధ్యక్షుడి మధ్య జరిగిన ఫోన్ సంభాషణను కూడా ఆయన స్వాగతించారు. రెండు దేశాలు సహజ మిత్రులని ఆయన అన్నారు.