ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉల్లంఘనపై ఇ.సి.కి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల తరహాలోనే తెలంగాణా రాష్ట్రంలోనూ పార్లమెంటు సెక్రటరీలుగా కొనసాగిన ఆరు మంది టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై కూడా ఆప్ తరహాలోనే అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ నేత ఎ.రేవంత్ రెడ్డి కోరారు. పార్లమెంటు సెక్రటరీలుగా కొనసాగిన ఆరు మంది ఎమ్మెల్యేలే కాకుండా లాభదాయకమైన అదనపు పదవులలో నియమితులైన మరో ముగ్గురు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై కూడా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద అనర్హత వేటు వేయాలని కూడా డిమాండ్ చేసారు. ఈ మేరకు రాష్ట్రపతికి, చీఫ్ ఎలక్షన్ కమీషనర్‌కు ఫిర్యాదు చేసారు. ఆప్ కు చెందిన 21 మంది ఎమ్మెల్యేలు గతంలో పార్లమెంటు కార్యదర్శులుగా కొనసాగడం, వారిపై చట్టప్రకారంగా అనర్హత వేటు వేయాలని సిఫార్సు చేస్తూ ఎన్నికల రాష్ట్రపతికి నివేదించడం, రాష్ట్రపతి ఆ ఎమ్మెల్యేలపై తక్షణం అనర్హత వేటును వేయడం జరిగిన నేపథ్యంలో ఆప్ ప్రభుత్వ తరహాలోనే తెలంగాణా రాష్ట్రంలోనూ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉల్లంఘనకు సంబంధించిన అంశాన్ని రేవంత్ తెరమీదకు తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు ఈ ఫిర్యాదును చేసారు. తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన 6 మంది ఎమ్మెల్యేలను గతంలో పార్లమెంటు కార్యదర్శులుగా నియమించడం జరిగిందని ,వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే డి.వినయ్ భాస్కర్, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు సిఎం కార్యాలయంలోనూ,మహబూబ్ నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్, తుంగతుర్తి ఎమ్మెల్యే జి.కిశోర్ కుమార్ డెప్యుటీ సిఎం కార్యాలయంలోనూహుస్నాబాద్ ఎమ్మెల్యే వి.సతీష్ కుమార్ విద్యాశాఖామంత్రి కార్యాలయంలోనూ,ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి రాష్ట్రవ్యవవసాయ శాఖ మంత్రి కార్యాలయంలోనూ పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2014, డిసెంబర్ 29న జిఓ ఎంఎస్ నెంబర్ 173ని జారీ చేసిందని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే రాజ్యాంగ విరుద్ధమైన ఈ చర్యను రాష్ట్ర హైకోర్టులో సవాల్ చేయగా 2015 మేనెల 1న హైకోర్టు ఈ నియామకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసిందని వివరించారు.
2014 డిసెంబర్ నుంచి కోర్టు ఉత్తర్వులు జారీ చేసే దాకా కూడా వారు ఆ పదవుల్లో కొనసాగారని చెప్పారు. ఈ వ్యవహారంలో తీర్పు ఇచ్చినప్పుడే ఇకపై తమకు తెలియకుండా ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన నియామకాలను చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందన్నారు. అయితే ఈ వ్యవహారం తర్వాత కూడా తెలంగాణా ప్రభుత్వం కొత్త విధానంలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలను కేబినెట్ హోదా ఇచ్చి, కొత్త పదవుల్లో నియమించిందని వెల్లడించారు.జీవో ఆర్‌టి నెంబర్ .613, ద్వారా మానకొండూరు ఎమ్మెల్యే ఈర్పుల బాలకిషన్ అలియాస్ రసమయి బాలకిషన్‌ను తెలంగాణా సాంసృ్కతిక సారథి ( కల్చరల్ హెడ్ ) గానూ, జీవో ఎంఎస్ నెంబర్ 32 తేదీ 27.04.2016 ద్వారా రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కుఆర్టి సి ఛైర్మెన్ గానూ, జీవో ఎంఎస్ నెంబర్ 32, తేదీ 26.04.2016 ద్వారా బాల్కొండ ఎమ్మెల్యే వి.ప్రశాంత్ రెడ్డిని ఛేర్మెన్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్ మెంట్ గానూ నియమించారని రేవంత్ ఫిర్యాదు చేసారు.ఈ పదవులను కేబినెట్ హోదాతో ఇవ్వడంతో వారు ఆ హోదాకు సంబంధించిన అన్ని సౌకర్యాలను, లాభాలను పొందుతున్నారని ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యే పదవుల్లో కొనసాగేవీల్లేదని వివరించారు. ఈ విషయాలను పరిశీలించి ఆప్ ఎమ్మెల్యేల తరహాలోనే టీఆర్ ఎస్ కు చెందిన ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై కూడా తక్షణం అనర్హత వేటును వేయాలని రేవంత్ రెడ్డి రాష్ట్రపతి, ఎన్నికల కమీషన్‌ను కోరారు. తన ఫిర్యాదును ఆన్‌లైన్ ద్వారా రాష్ట్రపతి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌కు పంపామని రేవంత్ ఈ సందర్భంగా వెల్లడించారు.