న్యూఢిల్లీ ఏప్రిల్ 27
దేశ రాజధాని ఢిల్లీలో మే చివరి నాటికి 44 ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇందులో ఎనిమిదింటిని కేంద్రం ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో కొవిడ్ పరిస్థితిపై విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. గతవారంలో ఉన్న ఆక్సిజన్ సంక్షోభం నుంచి గణనీయంగా మెరుగుపడినట్లు తెలిపారు. బ్యాంకాక్ నుంచి 18 ట్యాంకర్లను (ఆక్సిజన్) దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. బుధవారం నుంచి దేశ రాజధానికి చేరుకుంటాయని, ఈ మేరకు రవాణా కోసం వైమానిక దళం విమానాలను ఉపయోగించుకునేందుకు కేంద్రాన్ని అనుమతి కోరినట్లు చెప్పారు. చర్చలు జరుగుతున్నాయని, విజయవంతమవుతాయనే ఆశాభావంతో ఉన్నట్లు పేర్కొన్నారు.ఫ్రాన్స్ నుంచి 21 రెడీ టూ ఆక్సిజన్ ప్లాంట్లను దిగుమతి చేసుకుంటున్నామన్నారు. వాటిని వెంటనే వాడుకలోకి తీసుకురావచ్చని, వాటిని వివిధ హాస్పిటళ్లలో ఏర్పాటు చేస్తామని, తద్వారా హాస్పిటళ్లలో ఆక్సిజన్ సంక్షోభం పరిష్కరించడంలో సహాయపడుతుందన్నారు. ఈ సందర్భంగా సహాయం అందించిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. కలిసికట్టుగా పని చేసి కొవిడ్‌పై యుద్ధంలో విజయం సాధిస్తామని పేర్కొన్నారు. అలాగే మే 10 నాటికి 1200 ఐసీయూ పడకలు ఏర్పాటు చేస్తామని, సహాయం అందించాలని నాలుగైదు రోజులుగా పారిశ్రామికవేత్తలకు లేఖలు రాసినట్లు తెలిపారు. ఈ మేరకు వారి నుంచి అద్భుతమైన స్పందన వస్తుందని, ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు.