ఆర్.ఎక్స్.100' సాధించిన సంచలన విజయంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన కార్తికేయ... ఆ చిత్రం కంటే ముందు నటించిన చిత్రం "ఫైనల్ సెటిల్మెంట్". వరంగల్-హైద్రాబాద్ లలో ఉండే రెండు గ్యాంగులు ఓ అనాధాశ్రమాన్ని కబ్జా చేయడం కోసం కొట్టుకు చస్తుంటే... సమాజానికి పట్టిన చీడపురుగులు... ఒకళ్ళనొకళ్లు చంపుకుంటుండడం మంచిదే కదా అనే ఆలోచనతో పోలీసులు... ఈ రెండు రౌడీ గ్రూపుల్ని చూసీ చూడనట్లు వదిలేస్తుంటారు. ఈ నేపథ్యంలో చోటు చేసుకునే ఆసక్తికర పరిణామాలతో సాగే చిత్రమే "ఫైనల్ సెటిల్మెంట్'.
కార్తికేయ నెగటివ్ షేడ్స్ కల హీరోగా నటించిన ఈ చిత్రంలో.. ఛత్రపతి శేఖర్, సతీష్ లంకా, మనస్విని, సలీం, భాస్కర్ రాజు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఓం శ్రీగురురాఘవేంద్ర క్రియేషన్స్ పతాకంపై... యువ ప్రతిభాశాలి జమ్మలమడుగు మోహన్ కాంత్ స్వీయనిర్మాణంలో "ఫైనల్ సెటిల్మెంట్" చిత్రానికి దర్శకత్వం వహించారు. అవకాశాల కోసం తిరుగుతున్న కార్తికేయలోని స్పార్క్ ని గుర్తించి... ఈ సినిమాలో ప్రతి నాయక ఛాయలు కలిగిన హీరోగా ఎంపిక చేసుకున్నానని దర్శకనిర్మాత జమ్మలమడుగు మోహన్ కాంత్ తెలిపారు. ఈయన పోసాని-ఆర్తి అగర్వాల్ ముఖ్య పాత్రలుగా రూపొంది... చెప్పుకోదగ్గ విజయం సాధించిన "ఆపరేషన్ ఐ.పి.ఎస్" చిత్రంతో దర్శకుడిగా మారారు. "ఫైనల్ సెటిల్మెంట్" దర్శకుడిగా మోహన్ కాంత్ కు రెండో చిత్రం. యాక్షన్ కి పెద్ద పీట వేస్తూ రూపొందిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, సంగీతం: ఎస్.బి., కూర్పు: పవన్ మంగాల, ఛాయాగ్రహణం: జయంత్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-నిర్మాణం-దర్శకత్వం: జమ్మలమడుగు మోహన్ కాంత్!!