YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కడప వైసీపీలో అలజడి

కడప వైసీపీలో అలజడి

కడప జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలు ‘అంతర్మథనం’లో నడుస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం ఎమ్మెల్యేల చేత సరైన సమయంలో రాజీనామా చేయించాలని అధినేత జగన్‌ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీలో చర్చనీయాంశమవుతోంది. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు కేడర్‌తో వ్యవహరిస్తున్న తీరుపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా పోరాటాలు సన్నగిల్లుతున్నాయని పార్టీ కేడరులోనే బహిరంగంగా చర్చ సాగుతోంది. ప్రతిపక్ష నేత జగన్‌ సొంత జిల్లాలో పార్టీ గాడి తప్పుతోందన్న విమర్శలు లేకపోలేదు. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న నేపధ్యంలో అధికార టీడీపీ సాగిస్తున్న వ్యూహరచనను తిప్పికొట్టి తిరిగి జిల్లాలో వైసీపీ జెండా ఎగురవేస్తారా లేదా అన్నది ఆ పార్టీ నేతల్లో అంతర్గత సమావేశాల్లో చర్చ సాగుతోంది.

కడప జిల్లాలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గాలికి ఎదురే లేకుండా పోయింది. తొమ్మిది అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయగా, అధికారంలోకి వస్తామన్న ధీమా నేతల్లో కనిపించింది. జిల్లాలో వైసీపీకి అనుకూల పవనాలు ఉండడంతో ఈ ఫలితాలు వచ్చినా మిగిలిన జిల్లాల్లో ఆశాజనకంగా సీట్లు రాకపోవడంతో ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ వ్యవహరించాల్సి వచ్చింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా పెత్తనం చెలాయిస్తామన్న భావనలో ఆలోచన చేసిన వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రతిపక్ష హోదా దక్కడంతో తీవ్ర నిరాశ నెలకొంది. టీడీపీ ఆకర్ష్‌లో బద్వేలు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలతో పాటు మరో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సైకిలు ఎక్కుతారని ప్రచారం సాగినా చివరికి ఆదినారాయణరెడ్డి, జయరాములే టీడీపీలో చేరారు. అనంతరం ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి దక్కింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు పలు సమస్యలను ప్రజలు వారి దృష్టికి తెచ్చినా వాటిని పరిష్కరించడంలో వైసీపీ ఎమ్మెల్యేలు విఫలమవుతూ వచ్చారు.

 

విపక్షంలో ఉన్నామని, అధికారులు ఎవరూ కూడా తమ మాట వినడంలేదని, ఈసారి జగన్‌ సీఎం కావడం తధ్యమని, అప్పుడు అన్ని సమస్యలు పరిష్కరిస్తామంటూ కేడరు, నేతలు, ప్రజలకు వైసీపీ ఎమ్మెల్యేలు హామీ ఇస్తూ వచ్చారు. గతంలో నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఎమ్మెల్యేలకు అందించేవారు. ఈసారి ఆ నిధులు కూడా ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కేవలం ఉత్సవ విగ్రహాలుగా మార్చివేశారని ప్రభుత్వాన్ని పలు సందర్భాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు దుమ్మెత్తి పోస్తూ వచ్చారు. ప్రజలతో మమేకమై వారిలో ఒకరిగా ఉంటూ వారి సమస్యలపై ఉద్యమాలు చేస్తూ పరిష్కరించాల్సిన వైసీపీ ఎమ్మెల్యేలు ఆ రీతిలో వ్యవహరించడంలేదని పార్టీ కేడరులో చర్చ సాగుతూ వస్తోంది.

 

ప్రతిపక్ష నేత జగన్‌ సొంత జిల్లాలో వైసీపీకి గట్టి పట్టు ఇవ్వడమే కాకుండా గ్రామస్థాయి నుంచి కూడా పటిష్టమైన ఓటు బ్యాంకు ఉండడంతోనే 2014 ఎన్నికల్లో అత్యధిక స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అధికారంలోకి రాకపోవడంతో కేడరు, ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు డీలా పడ్డారు. గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఆ పార్టీకి ఎంతో నష్టాన్ని తీసుకువచ్చింది. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల వ్యవహర శైలి ఓటమికి కారణమని విమర్శలు లేకపోలేదు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ప్రజలకు దగ్గర కావడంలేదని విమర్శలు ఉన్నాయి. ఇదే నియోజకవర్గంలోని బంగారు రెడ్డి, కల్లూరు నాగేంద్రరెడ్డి, శివచంద్రారెడ్డి, మురళీధర్‌రెడ్డి, డాక్టర్‌ ఎంవీ రమణారెడ్డిలు వైసీపీ నేతలుగా వ్యవహరిస్తున్నారు. డాక్టర్‌ ఎంవీ రమణారెడ్డి, శివచంద్రారెడ్డిల మధ్య ఆధిపత్య పోరు జోరుగా ఉంది. స్థానికంగా తరచూ గొడవలు పడుతూ వస్తున్నారు. పేరుకు ఎమ్మెల్యే అయినా పెత్తనం ముఖ్య నేతలదేనన్నట్లుగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నెలకొంది.

మైదుకూరు నియోజకవర్గంలోని శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ వైసీపీలో మరో ప్రధాన నేతగా ఉన్న ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డిని డీసీసీబీ పదవి నుంచి తప్పించడంలో ఎమ్మెల్యే శెట్టిపల్లె పాత్ర ఉందని ఆయన భావిస్తూ అంతర్గతంగా ఇద్దరి మధ్య పోరు నడుస్తోంది.

జమ్మలమడుగులో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరి మంత్రి పదవి చేపట్టారు. ప్రస్తుతం వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా సుధీర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇదే బాధ్యతల కోసం ప్రభావతి పోటీ పడినా జగన్‌ సుధీర్‌రెడ్డికే బాధ్యతలు అప్పజెప్పడం, ఆమె క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. బద్వేలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే జయరాములు టీడీపీలో చేరడంతో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తూ పార్టీకి దిక్కుగా ఉన్నారు. అధికారం లేకపోవడంతో అంతా ఒకటిగానే నడుస్తున్నారు. జగన్‌ సొంత నియోజకవర్గమైన పులివెందుల బాధ్యతలను ఎంపీ అవినాష్‌రెడ్డి చూస్తుండగా గతంలో వైఎస్‌ వివేకానందరెడ్డి గ్రూపు ప్రభావం కొంత ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత నుంచి ఆయన మౌనం పాటిస్తున్నారు.

రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మూడవ సారి హ్యాట్రిక్‌ కొట్టినా ప్రజలకు అందుబాటులో ఉండడంలేదని విమర్శలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలోని ముఖ్య నేతలు జగన్‌ను కలిసి ఎమ్మెల్యే శ్రీనివాసులుపై ఫిర్యాదు చేశారు. డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ కొల్లం బ్రహ్మానందరెడ్డి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తూనే అనారోగ్యంతో మృతి చెందారు. ప్రస్తుతం రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి రైల్వేకోడూరు ఇన్‌ఛార్జ్ బాధ్యతలను చూస్తున్నారు. ఇక్కడ అభ్యర్ధిని మార్చాలన్న డిమాండ్‌ నేతల నుంచి వినిపిస్తోంది. రాజంపేట నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌ ఆకేపాటి అమర్‌నాధరెడ్డి ఉన్నా టీడీపీ ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జునరెడ్డిని ధీటుగా ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా నేతల్లో అసమ్మతి నెలకొనడం కూడా కొంత ఇబ్బందులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి.

రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డిపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. కేడర్‌కు చేసింది ఏమీలేదని బహిరంగంగానే చర్చిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ద్వారకనాధరెడ్డి, మరో మాజీ ఎమ్మెల్యే తనయుడు మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డిలు కీలక వ్యక్తులుగా ఈ నియోజకవర్గంలో ఉంటూ పార్టీ కార్యక్రమాలు వేర్వేరుగానే సాగిస్తున్నారు. కమలాపురంలో ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి ఉన్నా కేడర్‌లో అసంతృప్తి నెలకొంది. ఈ నియోజకవర్గంలో ఉన్న నేతలు జగన్‌తో నేరుగా మాట్లాడే పరిస్థితి ఉండడంతో వారంతా ఆయనతోనే అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు.

కడపలో ఎమ్మెల్యే అంజద్‌బాషా, మేయర్‌ సురేష్‌బాబు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి కీలక వ్యక్తులుగా వ్యవహరిస్తుంటారు. పేరుకు ఎమ్మెల్యే.... పెత్తనం రవీంద్రనాధరెడ్డిదిగా ఉంటుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇలా పది నియోజకవర్గాల్లో వైసీపీలో అంతర్గత వర్గ పోరు కొనసాగుతూనే ఉంది. ప్రత్యేక హోదా సాధన పేరుతో రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఓటుబ్యాంకు కొల్లగొట్టాలని జగన్‌, ఆ పార్టీ నేతలు ఆచి తూచి అడుగులు వేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఎంపీల చేత జగన్‌ రాజీనామా చేయించారు. జిల్లాలోని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డిలు స్పీకరు ఫార్మేట్‌లో రాజీనామాలు సమర్పించారు. రెండు రోజుల క్రితం జగన్‌ పాదయాత్రలో ముఖ్య నేతలతో సమావేశమై సరైన సమయంలో ఎప్పుడైనా ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఢిల్లీ స్థాయిలో హోదా పోరు ఉధృతం చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇది తెలుసుకున్న వైసీపీ ఎమ్మెల్యేల్లో అంతర్గత చర్చ మొదలైంది. మరో ఏడాదిలో ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉన్న నేపధ్యంలో ఉన్న ఎమ్మెల్యే పదవిని వదులుకుంటే అప్పటి వరకు ప్రజలు గుర్తు పెట్టుకుని వ్యవహరిస్తారా అన్న సందేహాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ప్రజల సమస్యలు పరిష్కరించలేక పోతున్నామని, కనీసం అసెంబ్లీకి పోయి తమ గళం విప్పే పరిస్థితి కూడా లేకపోవడంపై అంతర్మధనంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు న డుస్తున్నారు.

Related Posts