YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

అక్కడ సీనియర్ల వైపే చూపు

 అక్కడ సీనియర్ల వైపే చూపు

 పశ్చిమగోదావరి జిల్లా జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. ఓ వైపు తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం బీజేపీతో విభేదించి హోదా సాధన కోసం ఉద్యమిస్తూ జనంలోకి వెళుతోంది. ధర్మ పోరాట దీక్ష చేపట్టి.. నియోజకవర్గాల్లో సైకిల్‌ యాత్రలు చేపట్టింది. మరోవైపు వైసీపీ నాయకత్వం.. పార్టీ పటిష్టానికి సామాజిక సమీకరణాలపై దృష్టి పెట్టి పావులు కదుపుతోంది. ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ రాజకీయ సలహా దారు పీకే సలహా మేరకు జిల్లాలు.. నియోజక వర్గాల వారీగా సామాజిక గణాంకాలకు తెర తీస్తున్నారు. జిల్లాలో ఓట్ల సంఖ్యా పరంగా బలమైన ఒక సామాజిక వర్గం వైపు ముందుగా దృష్టి సారించినట్లు సమాచారం. పలువురు సీనియర్‌ నేతలను పార్టీలోకి ఆహ్వానించడానికి వర్తమానాలు పంపిస్తున్నారు. రాజకీయంగా చైతన్యం కలిగిన జిల్లాలో సామాజికవర్గ పరంగా చక్రం తిప్పే రాజకీయ కురువృద్ధులకు గేలం వేస్తున్నారు.

జిల్లాలో మెట్ట, డెల్టాల్లో తమ సామాజిక వర్గంలోనే కాకుండా ఇతర వర్గాల్లోనూ పేరున్న ఇద్దరు సీనియర్‌ నాయకులపై వైసీపీ దృష్టి పెట్టింది. వారి వద్దకు దూతలను పంపి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తోంది. ఈ ప్రక్రియను జిల్లాలో ఆర్థికంగా బలమైన ఒక సామాజిక వర్గానికి అప్పగించినట్లు సమా చారం. మెట్టలో మంచి వ్యక్తిగా పేరొంది, తల పండిన రాజకీయ నేత వద్దకు రాయబారాలు పంపినట్లు సమాచారం. ఉండి ప్రాంతానికి చెం దిన ఒక మాజీ ఎమ్మెల్యే ఆ నాయకునితో సమాలోచనలు జరిపి.. పార్టీలోకి వస్తే మంచి గుర్తింపు ఇస్తామని, పార్టీ అధికారంలోకి వస్తే ఊహించని రీతిలో పదవి కట్టబెడతామని హామీ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నందు న... ఇప్పుడే నిర్ణయం చెప్పలేనని ఆ నాయ కు డు సున్నితంగానే బదులిచ్చినట్లు సమాచారం.

డెల్టాలో రాజకీయంగా పట్టు కలిగిన ఒక కురు వృద్ధుడితో వైసీపీ నాయకత్వం మంతనాలు జరుపుతోంది. రాజకీయంగా తటస్థంగా ఉంటున్న ఆ నాయకుడిని ఏ విధంగానైనా తమ పార్టీ సానుభూతిపరునిగా మార్చడానికి వైసీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. తాను రానున్న రోజుల్లో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చేది లేదని ఆ నాయకుడు చెబుతుండటంతో... మీరు మా వెనుక ఉండండి మీ కుమారుడికి నరసాపురం లేదా ఆచంట నియోజకవర్గాల నుంచి టిక్కెట్టు ఇప్పిస్తామని ఆఫర్‌ ఇచ్చినట్లు తెలిసింది. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది.

అధినేత జగన్‌ రాజకీయ సలహాదారు పీకే సూచనలతో ఇప్పటికే జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో పార్టీ పరిస్థితులపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు వంటి విషయాలపై పీకే దృష్టికి వెళ్లాయి. జగన్‌ పాదయాత్ర మొదలై పూర్తయ్యే నాటికి నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ కేడర్‌ను ఏకతాటిపైకి తేచ్చేందుకు ప్రణాళిక రచించినట్లు తెలిసింది. అధికార టీడీపీ వైఫల్యాలను ఎండగట్టడం, పార్టీ బలోపేతానికి కొన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించడం వంటి చర్యలు చేపట్టనున్నారు. ఇదే సమయంలో వైసీపీ ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు టీడీపీ నాయకత్వం వ్యూహరచన చేస్తోంది.

Related Posts