కొలంబో ఏప్రిల్ 28
జాతీయ భద్రత దృష్ట్యా శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖా ధరించడంపై నిషేధం విధించింది. అయితే కరోనా తీవ్రత దృష్ట్యా మాస్కులు ధరించొచ్చు కానీ, బుర్ఖాలు మాత్రం ధరించరాదు అని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖా ధరించడంపై నిషేధం విధించిన బిల్లుకు శ్రీలంక కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును శ్రీలంక పార్లమెంట్ ఆమోదించగానే చట్టరూపంలోకి రానుంది.2019లో ఈస్టర్ సందర్భంగా చర్చిలు, హోటళ్లపై ఉగ్రవాదులు బుర్ఖా ధరించి దాడులు చేసిన నేపథ్యంలో, జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేబినెట్ తెలిపింది. శ్రీలంకలో బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖాలు ధరించడంపై నిషేధం విధించడాన్ని పాకిస్తాన్ హై కమిషనర్ తీవ్రంగా తప్పుబట్టింది. ముస్లింల మనోభావాలను దెబ్బతీసేందుకే ఈ నిర్ణయం తీసుకుని, జాతీయ భద్రత దృష్ట్యా విభజన చర్యలు సృష్టిస్తున్నారని పేర్కొంది. శ్రీలంకలో ముస్లింల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని మండిపడింది.2019లో ఈస్టర్ రోజున నేషనల్ తావీద్ జమాత్ ఆత్మాహుతి దళానికి చెందిన 9 మంది ఉగ్రవాదులు బుర్ఖా ధరించి చర్చిలు, హోటళ్లపై పేలుళ్లకు పాల్పడటంతో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 11 మంది భారతీయులు కూడా ఉన్నారు. ఈ దాడుల్లో 500 మందికి పైగా గాయపడ్డారు.