YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

తీపి వెనుక చేదు నిజం

 తీపి వెనుక చేదు నిజం

వేసవికాలం వచ్చేసింది. దీంతో పాటే అందరికీ ఎంతో ఇష్టమైన మామిడి కూడా మార్కెట్‌లోకి ప్రవేశిస్తోంది. పండ్లలో రాజైన మామిడి అంటే ఇష్టపడని వారు ఉండరు. ఈ ఏడాది అసలే దిగుబడి చాలా తక్కువ ఉంది. దీంతో ధర భారీగా పలుకుతోంది. ఈ పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు వ్యాపారులు. కాయలను సహజంగా మాగనీయకుండానే కార్బైడ్‌తో పండిస్తున్నారు. సీజన్‌ ప్రారంభం నుంచే అప్రమత్తంగా ఉండాల్సిన ఆహార తనిఖీ అధికారులు పత్తా లేకుండా పోయారు. గత ఏడాది కొంత హడావుడి చేసి చేతులు దులుపేసుకున్నారు. ఈ ఏడాది అదీ లేదు. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వ్యాపారులు ఆడిండే ఆటగా మారింది. ప్రమాదకర కార్బైడ్‌తో మామిడిని మాగబెడుతున్నారు. ప్రజారోగ్యానికి పొగబెడుతున్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న ప్యాకెట్లను వినియోగిస్తున్నారు. గతేడాది తీసిన చాలా నమూనాల్లో ప్రమాదకర కార్బైడ్‌ అవశేషాలు ఉన్నట్లు తేలింది. దీని వల్ల ఆరోగ్యపరంగా తీవ్ర సమస్యలు తప్పవు. ఇది ఒక్క మామిడికే పరిమితం కాలేదు. చాలా పండ్లనూ ఇలాగే పండిస్తున్నట్లు బయటపడింది. పోషకాలను అందించే పండ్లను కొనాలంటేనే హడలిపోయే రోజులొచ్చాయి.

రాష్ట్రంలోనే మామిడి ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే ప్రాంతాల్లో కృష్ణా జిల్లా ఒకటి. ఇక్కడ దాదాపు 64,874 హెక్టార్లలో మామిడి సాగవుతోంది. జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఆగిరిపల్లి, మైలవరం, నూజివీడు, రెడ్డిగూడెం, ఛాట్రాయి, విస్సన్నపేట, తిరువూరు, జి.కొండూరు, గంపలగూడెం, తదితర మండలాల్లో విస్తారంగా 

మామిడి తోటలు ఉన్నాయి. జిల్లాలో దాదాపు 80 శాతం విస్తీర్ణం ఈ ప్రాంతాల్లోనే ఉంది. బంగినపల్లి, రసాలు, తోతాపురి రకాలు ప్రధానమైనవి. జిల్లా నుంచి ముంబై, అహ్మదాబాద్‌, దిల్లీ, తదితర ఉత్తరాది ప్రాంతాలకు పెద్దఎత్తున ఎగుమతులు జరుగుతాయి. గుంటూరు జిల్లాలో కొద్ది విస్తీర్ణంలోనే పంట సాగవుతోంది. కేవలం 984 హెక్టార్లలోనే ఉంది. ఈ ఏడాది వాతావరణంలో మార్పుల కారణంగా దిగుబడిపై ఎక్కువ ప్రభావం చూపించింది. మంచు ఎక్కువ రోజులు ఉండటంతో పూత కాయల వరకు వెళ్లలేదు. ఫలితంగా అరకొర దిగుబడి మాత్రమే వచ్చింది. కృష్ణా జిల్లాలో 7,78,488 టన్నులు, గుంటూరులో 11,808 టన్నులు దిగుబడి మాత్రమే రానుందని ఉద్యాన శాఖ అధికారుల అంచనా. దీని వల్ల ధర అమాంతం పెరిగింది. గతేడాది కంటే మూడు రెట్లు పలుకుతోంది.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆహార తనిఖీ అధికారులు పలుచోట్ల మామిడి నమూనాలను సేకరించారు. వాటిని పరీక్షలకు పంపించారు. గుంటూరు జిల్లాలోని తెనాలి, చిలకలూరిపేట, గుంటూరు, నర్సరావుపేట, కృష్ణాలోని గుడివాడ, విస్సన్నపేట, నూజివీడు, విజయవాడ, ఆగిరిపల్లి, తదితర ప్రాంతాల్లో తీసుకున్న బంగినపల్లి, రసాల నమూనాలలో కార్బైడ్‌ అవశేషాలు కనిపించాయి.  కార్బైడ్‌ ఉన్నట్లు బయటపడింది. ఇది ఆరోగ్యానికి హానికరం. పైగా ఆహార రక్షణ, ప్రమాణాల చట్టం - 2006 మేరకు కార్బైడ్‌ వినియోగం సురక్షితం కాదని తేల్చారు. ఇదే చట్టం ప్రకారం దీనిని ఉపయోగించి మాగబెట్టడం నిషేధం. ‌్ర పండ్లపై ఉన్న పురుగుమందు అవశేషాలు పరిమితికి లోబడే ఉన్నట్లు అన్ని నమూనాల్లో తేలింది. దీని పరిమితి 2 పీపీఎం. ఈ పరిమితి దాటినట్లు వెలుగుచూడలేదు. ఎథిఫాన్‌, కార్బన్‌డాజిమ్‌, తదితర పురుగుమందులు అనుమతించిన పరిమితి లోపే ఉన్నట్లు వెల్లడైంది. అన్నింట్లోనూ 0.01 పీపీఎం నుంచి 0.31 పీపీఎంలోపే ఉన్నట్లు నమోదైంది. ‌్ర రెండు జిల్లాల్లో చైనా నుంచి వస్తున్న ప్యాకెట్లను వ్యాపారులు వాడుతున్నారు. వీటిని చట్టం అనుమతించిన ఇథలీన్‌గా పేర్కొంటున్నారు. సాధారణంగా పొడి రూపంలో ఇథలీన్‌ ఎక్కడా వినియోగంలో లేదు. కేవలం వాయువు రూపంలోనే ఉంటుంది. ప్యాకెట్లపై ఎటువంటి వివరాలు లేకపోవడంతో అధికారులు దృష్టి సారించారు. 

* గత ఏడాది కృష్ణా జిల్లా నున్నలోని మామిడి మార్కెట్‌లో వీటిని ఆహార తనిఖీ అధికారులు స్వాధీనం చేసుకుని పరీక్షలకు పంపించారు. వీటిని పరీక్షలకు పంపడంతో అసలు విషయం వెలుగుచూసింది. దీని నుంచి కార్బైడ్‌ వాయువు విడుదల అవుతున్నట్లు వెల్లడైంది. నిషేధిత కార్బైడ్‌గా ధ్రువీకరించారు. ఈ ఏడాది కూడా ఇటువంటి ప్యాకెట్లతో కాయలను పండిస్తున్నారు.

మామిడిలో సహజంగానే ఇథలీన్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. దీని వల్లనే కాయలో ఉండే పిండిపదార్థం చక్కెరగా మారుతుంది. ఫలితంగా కాయ మాగుతుంది. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. దీనికి విరుద్ధంగా పలువురు వ్యాపారులు కార్బైడ్‌తో కాయలను మాగబెడుతున్నారు. పక్వానికి రాకముందే తమ వ్యాపారం కోసం వాటిని ముందే కోసి నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత రసాయనాలను వినియోగిస్తున్నారు.  దీని వినియోగం ఆరోగ్యానికి హానికరమని భావించిన హైకోర్టు.. 2015 నుంచి పూర్తిగా నిషేధించింది. కేవలం మామిడికే ఇది పరిమితం కాలేదు. అరటి, కమల, సపోటా, బొప్పాయి, వంటి పండ్లకూ కార్బైడ్‌ బెడద తప్పడం లేదు.  కృష్ణా జిల్లాలో ఇటీవల కాలంలో వివిధ రకాల పండల నమూనాలను తీసుకుని పరీక్షలకు పంపించారు. వీటిలోనూ నిషేధిత రసాయనాలు ఉన్నట్లు తేలింది. నిగనిగలాడేందుకు ఆపిల్‌కు పారాఫిన్‌ మైనం పూస్తున్నారు. ఇది పెట్రోలియం ఉపఉత్పత్తి. ఆహారపదార్థాలలో దీని వినియోగాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఇది కొవ్వొత్తుల తయారీలో వాడతారు. కేవలం తేనెటీగల నుంచి తీసిన మైనాన్ని వాడొచ్చు. దీనిని ఆహార సంబంధితమైనదిగా గుర్తించారు. ఇది తక్కువగా దొరుకుతుంది. దీని వల్ల పారాఫిన్‌ మైనాన్ని వినియోగిస్తున్నారు. 

అరటి, దానిమ్మ కాయల నమూనాల్లోనూ కార్బైడ్‌ను వాడుతున్నట్లు వెల్లడైంది. పచ్చిగా ఉన్న అరటిని నిషేధిత రసాయనంతో త్వరగా పండేలా చేస్తున్నారు. దానిమ్మ కాయలోనూ దీన్ని వాడుతున్నట్లు బయటపడటం విస్మయం కలిగిస్తోంది. సపోటా కాయలు కూడా ప్రస్తుతం మార్కెట్‌లో విరివిగా దొరుకుతున్నాయి. వీటిని మాగబెట్టేందుకు కూడా రసాయనాలను వాడుతున్నారు. ఒకటేమిటి దాదాపు అన్నింటికీ వినియోగిస్తున్నారు.

Related Posts