YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

దూరమవుతున్న విష్ణుకుమార్ రాజు

దూరమవుతున్న విష్ణుకుమార్ రాజు

విశాఖపట్టణం, ఏప్రిల్ 29, 
బీజేపీలో చాలా మంది నాయ‌కులు.. రాజ‌కీయాల్లోనే ఉన్నప్పటికీ.. ప్రత్యక్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. అంటే.. ఎన్నిక‌ల వేళ పోటీకి దూరంగా ఉంటున్నారు. తాము రాజ‌కీయాల్లోనే ఉంటామ‌ని.. స‌ల‌హాలు, సూచ‌న‌లు పార్టీకి అందిస్తామ‌ని.. కానీ.. ప్రజాక్షేత్రంలో మాత్రం పోటీ చేయ‌మ‌ని గతంలోనే కామినేని శ్రీనివాస్, కంభంపాటి హ‌రిబాబు.. వంటివారు చెప్పేశారు. దీంతో పోటీ చేసే వారి కోసం.. 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ ఎదురు చూడాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పెద్దగా ప్రజాబ‌లం లేని నాయ‌కులకు సైతం టికెట్‌లు ఇవ్వాల్సి వ‌చ్చింది.వాస్తవానికి ఎంత రాజ‌కీయ నేత అయినా.. ప్రజా బ‌లం ఉంటే.. పోటీ చేయడం రాజ‌కీయాల్లో రివాజు. పైగా ఇత‌ర పార్టీల్లో ఎలాంటి ప్రజా బ‌లం లేని నాయ‌కులు కూడా.. పోటీ చేస్తామ‌ని..ముందుకు వ‌స్తున్నారు. కానీ, బీజేపీలో అంతో ఇంతో ప్రజాబ‌లం ఉన్న నాయ‌కులు రాజ‌కీయాలు చేస్తాం కానీ, పోటీ మాత్రం చేయ‌మ‌ని చెబుతున్నారు. దీనికి కార‌ణాలు ఏంటి? అనే విష‌యంపై పార్టీ ఇప్పటి వ‌ర‌కు దృష్టి పెట్టక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీనిపై అంత‌ర్గతంగా కూడా చ‌ర్చించ‌లేదు. పోయే వారు పోయినా.. కొత్తవారికి అవకాశం ఇస్తా మ‌నే ఆలోచ‌నో.. లేక మ‌రేమిటో తెలియ‌దు కానీ.. బీజేపీలో ఒక విధ‌మైన ప‌రిస్థితి మాత్రం క‌నిపిస్తోంది.స‌రే! ఇప్పుడు కూడా ఇలాంటి ప‌రిస్థితి బీజేపీకి ఎదురైంది. విశాఖ ఉత్తర నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు.. పార్టీలో త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతిప‌క్షాల‌పై విమ‌ర్శ ‌లు చేయ‌డంలోను.. ప్రస్తుతం అధికార ప‌క్షంలో ఉన్న వైసీపీని ఇబ్బంది పెట్టడంలోను.. విమ‌ర్శలు చేయ‌డంలోను ఆయ‌న ముందున్నారు. నాడు ఆయ‌న అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నా చంద్రబాబు, జ‌గ‌న్ ఇద్దరితోనూ స‌త్సంబంధాలు పెట్టుకుని లౌక్యమైన రాజ‌కీయ నేత‌గా పేరు తెచ్చుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన ఆయ‌న ఆ త‌ర్వాత సైలెంట్ అయ్యారు.పార్టీలోనూ ఎందుకో గాని ఆయ‌న‌కు పెద్దగా గుర్తింపు లేకుండా పోయింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు విముఖ‌త వ్యక్తం చేస్తున్నట్టు వెలుగు చూసింది. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లోను, కార్పొరేష‌న్ ఎన్ని క‌ల్లోనూ బీజేపీ ఎక్కడా స‌త్తా చాట‌లేక పోయింది. ఈ క్రమంలో విశాఖ‌లోనూ పార్టీ చ‌తికిల ప‌డింది. ముఖ్యంగా ఉత్తర నియోజక‌వ‌ర్గంలోని ఒక్క డివిజన్ లో కూడా బీజేపీ గెల‌వ‌లేదు.. స‌రిక‌దా విష్ణు ప్రభావం ఏ మాత్రం లేదు. దీనిపై అంత‌ర్గతం గా జ‌రిగిన చ‌ర్చలో విష్ణు ఒకింత వైరాగ్యం ప్రద‌ర్శించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నేను పోటీ చేయ‌కుండా ఉంటే బెట‌ర్ ! అని ఆయ‌న వ్యాఖ్యానించిన‌ట్టు పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే.. దీనిని ఆయ‌న బ‌హిరంగంగా ప్రక‌టించ‌క‌పోయినా.. ప్రస్తుతం జ‌రుగుతున్న తిరుప‌తి ఉప ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ప్రక‌టించ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు ? ఇలా యూట‌ర్న్ తీసుకున్నారు? అనే అంశాలు ఆస‌క్తిగా మారాయి. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Related Posts