YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

జోరుగా మట్కా

జోరుగా మట్కా

నిజామాబాద్, ఏప్రిల్ 28, 
ఇదో లక్కీ లాటరీలాగానే అనిపిస్తుంది.. కానీ ప్రతిరోజూ వేలరూపాయలను కోల్పోయేలా చేస్తుంది. అదే మట్కా. దీనికి జనం బానిసలవుతున్నారు.సంపాదించిందంతా దీంట్లోనే తగలేస్తున్నారు. లాటరీ నాకు తగలకపోతుందా అనే ఆశ మనిషికి ఎలా ఉంటుందో..అదే విధంగా మట్కాలో నంబర్‌ తగలకపోతుందా… అనే ఆశే బానిసలను చేస్తుంది. కమ్మర్‌పల్లి, మోర్తాడ్‌ మండలాల్లో మట్కా జోరుగా సాగుతుంది. ప్రతి గ్రామం నుంచి ఈ ఆట ఆడే వారు ఉన్నా పోలీసులు అంతగా దీని గురించి పట్టించుకోని కారణంగా చాపకిందనీరులా విస్తరిస్తోంది.మట్కా ఆటకు మండలానికి ఒక ఏజెంట్‌ ఉం టారు. వీరు మట్కా ఆడే వారి నుంచి డబ్బులు, నంబర్లు తీసుకుని ప్రధాన ఏజెంట్‌కు పంపిస్తుం టారు. నంబర్‌ తగిలితే వచ్చిన డబ్బుల నుంచి ఏజెంట్‌ కమీషన్‌ తీసుకుని మిగతావి నంబర్‌ రాసిన వ్యక్తికి ఇచ్చేస్తారు. అయితే గతంలో చీటీలపై నంబర్లు రాసి ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం అంతా ఆన్‌లైన్‌ అయిపోయింది. ఏజెంట్‌ వాట్సాప్‌కు మట్కా ఆడేవారు నంబర్లను వాట్సాప్‌ ద్వారా పంపిస్తారు. ఇక్కడి నుంచి ప్రధాన ఏజెంట్‌కు కూడా నంబర్లు వాట్సాప్‌ ద్వారానే వెళ్తాయి. మట్కా కోసం కట్టిన డబ్బులు కూడా ఆన్‌లైన్‌ ద్వారానే పంపిస్తుండగా, ప్రధాన ఏజెంట్‌ నుంచి వచ్చే డబ్బులు కూడా ఇక్కడి ఏజెంట్లకు ఆన్‌లైన్‌ ద్వారానే పంపిస్తుంటారు. మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి, మెట్‌పల్లి ప్రాంతాల్లో మాట్కా ఏజెంట్లు ఎక్కువగా ఉన్నారు. ఈప్రాంతంలో మాట్కా ఆడే వారు ఎవరు అందుబాటులో ఉంటే వారికి మట్కా నంబర్లు పంపి ఈఆటను ఆడుతున్నారు.మట్కా ఇదో నంబర్ల గారడీ, దీంట్లో ఓపెన్‌ నంబర్‌, క్లోజ్‌ నంబర్‌, బ్రాకెట్‌, పనాలు ఉంటాయి. సింగిల్‌ నంబర్లను ఓపెన్‌, క్లోజ్‌గా వ్యవహరిస్తారు. అదే విధంగా రెండు నంబర్లను కలిసి బ్రాకెట్‌గా పిలుస్తారు. మూడు నంబర్లను పనాగా పిలుస్తారు. ఇందులో ఓపెన్‌, క్లోజ్‌లకు పది రూపాయలకు వంద, బ్రాకెట్‌కు పది రూపాయలకు వేయి, పనాలో పది రూపాయలకు పదివేలు ఇస్తుంటారు. దీంతో అత్యాశతో మట్కావైపు మళ్లుతున్నారు. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈఆటపై పోలీసుల నిఘా కరువైంది. మట్కా ఆడుతున్న వారిపై నిఘా పెంచి ఈ ఆట ఆడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరంఎంతైనా ఉంది. ఇప్పటికే ఈ ఆటలో చాలా మంది లక్షల రూపాయలు పోగొట్టుకున్నవారు ఉన్నారు. డబ్బులు పోయేకొద్దీ పోయినవి రాబట్టాలనే ఉద్దేశంతో ఈ ఆటకు బానిసవుతున్నారు. మట్కాపై పోలీసులు నిఘా పెంచి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Related Posts