YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కమ్యూనిస్టుల ఫ్యూచర్ ఏంటీ

కమ్యూనిస్టుల ఫ్యూచర్ ఏంటీ

కోల్ కత్తా, ఏప్రిల్ 29, 
ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో సీపీఎం పరిస్థితి చూసిన తరవాత ఎవరికైనా పూలమ్మిన చోట కట్టెలమ్మడమన్న … పాత తెలుగు సామెత గుర్తుకు రాక మానదు. మూడు దశాబ్దాలకు పైగా రాష్ర్ట రాజకీయాలను కనుసైగలతో శాసించిన ఈ వామపక్ష పార్టీ ఇప్పుడు దయనీయస్థితిలో ఉంది. పదేళ్లకుపైగా పాతుకుపోయిన ముఖ్యమంత్రి మమత బెనర్జీని గట్టిగా ఢీకొనలేక, మరోపక్క దూసుకువస్తున్న భారతీయ జనతా పార్టీని నిలువరించలేక బేల చూపులు చూస్తోంది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోరాడుతున్న సీపీఎం మనుగడ కోసం పరితపిస్తోంది. అధికారాన్ని సాధించడం అసాధ్యమని తెలిసి నప్పటికీ కనీసం గౌరవప్రదమైన స్థానాలు తెచ్చుకునేందుకు పోరాడుతోంది. ఇందులో భాగంగా తమకు కంచుకోటలైన కొన్ని స్థానాలను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతోంది.ఇలాంటి సీట్లలో జాదవ్ పూర్ ఒకటి. రాజకీయ వర్గాల్లో జాదవ్ పూర్ గురించి తెలియని వారుండరు. సీపీఎం దిగ్గజం సోమనాథ్ ఛటర్జీని 1984లో ఈ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన మమతా బెనర్జీ ఓడించారు. అప్పట్లో ఈ గెలుపు జాతీయ రాజకీయాల్లో సంచలనం కలిగించింది. ప్రస్తుతం ఈ జాదవపూర్ అసెంబ్లీ సీటును కాపాడుకునేందుకు సీపీఎం సర్వశక్తులూ ఒడ్డింది. 1967 నుంచి ఈ సీటు సీపీఎంకు కంచుకోటగా నిలుస్తూ వచ్చింది. 1987 నుంచి పార్టీ అగ్రనేత, ముఖ్యమంత్రిగా పనిచేసిన బుద్ధదేవ్ భట్టాచార్య ఇక్కడ అయిదుసార్లు విజయ దుందుభి మోగించారు. 2011లో మాత్రం టీఎంసీ అభ్యర్థి మనీష్ గుప్తా చేతిలో 16వేలకుపైగా ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. 2016లో ఈ సీటు మళ్లీ సీపీఎం వశమైంది. అప్పట్లో కోల్ కత్తా నగర పరిధిలో సీపీఎంకు దక్కిన ఏకైక సీటు జాదవ్ పూరే. అందుకే దీనిని ‘కోల్ కతా లెనిన్ గ్రాడ్’ గా పార్టీ వర్గాలు చెప్పుకుంటాయి. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఈ అసెంబ్లీ స్థానం పరిధిలో టీఎంసీ అభ్యర్థికి 12వేలకు పైగా ఓట్ల ఆధిక్యం లభించింది. ఈ పరిణామం సీపీఎంకు మింగుడు పడలేదు.పూర్తిగా నగర ప్రాంతంలో విస్తరించిన జాదవ్ పూర్ లో 2,99,710 మంది ఓటర్లున్నారు. వారిలో మహిళలు 1,54,785 కాగా, పురుషులు 1,44,921 మంది. సీపీఎం తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే సుజన్ చక్రవర్తి బరిలోకి దిగారు. టీఎంసీ తరఫున పోటీచేసిన దేవవ్రత మజుందార్ గతంలో రెండు దశాబ్దాల పాటు పురపాలక కౌన్సిలర్ గా పనిచేశారు. సీపీఎం నుంచి వలస వచ్చిన రింకూ నస్కర్ ను కాషాయపార్టీ పోటీలోకి దింపింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, గ్యాస్, పెట్రో ధరలు, పౌరసత్వ సవరణ చట్టం వంటి అంశాలను సీపీఎం, టీఎంసీ ప్రస్తావించాయి. వామపక్షాల పాలనలో బెంగాల్ వెనకబాటు, టీఎంసీ పాలనలో అవినీతి తదితర అంశాల గురించి కమలం పార్టీ అదేపనిగా ప్రచారం చేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గ పరిధిలో మా పార్టీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అందువల్ల ఈ సారి విజయం తమదేనని కమలం పార్టీ అభ్యర్థి ధీమా వ్యక్తం చేస్తున్నారు. దేశ విభజన సమయంలో తూర్పు బెంగాల్, పశ్చిమ పాకిస్థాన్ నుంచి వచ్చిస్థిరపడిన వారి వారసులు అధికసంఖ్యలో జాదవ్ పూర్ లో ఉన్నారు. వారికి భారతీయ పౌరసత్వం ఇచ్చేందుకు పార్టీ సుముఖంగా ఉన్నందున గెలుపుపై పార్టీ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. భాజపా నాటకాలను ప్రజలు నమ్మరని, విజయం తమదేనని సీపీఎం, టీఎంసీ చెబుతున్నాయి. ఎవరి ధీమా నిజమవుతుందో తెలియాలంటే మే 2వరకు ఆగక తప్పదు.

Related Posts