YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

గొంతెండుతోంది..!!

గొంతెండుతోంది..!!

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంచినీటి ఎద్దడి మొదలైంది. భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. సగటున 14.53 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఇరవై మీటర్ల లోతుకు చేరాయి. ఏప్రిల్‌ నెల మూడోవారం మొదలైనా అధికారులు వేసవి ప్రణాళికను అమలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. మిషన్‌ భగీరథ పనుల పేరుతో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ఈ విషయమే మరిచిపోయారు. గ్రామాల్లో బోర్లు, బావులు ఎండిపోతున్నాయి. మిషన్‌ భగీరథ మాటకొస్తే క్షేత్రస్థాయిలో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. వేసవి ముగిసినా పనులు పూర్తిస్థాయిలో జరిగే అవకాశాలు కనిపించడం లేదు.

మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట డివిజనులో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నారాయణపేట, దామరగిద్ద, కోస్గి, మద్దూరు, ఉట్కూరు, కోయిలకొండ, మాగనూరు, నర్వ తదితర ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. మహబూబ్‌నగర్‌ డివిజనులోని హన్వాడ, రాజాపూర్‌, బాలానగర్‌, అడ్డాకుల, భూత్పూరు తదితర ప్రాంతాల్లో నీటిఎద్దడి అధికంగా ఉంది. గతేడాది వేసవిలో ట్యాంకర్లు, అద్దె బోర్లు, ఫ్లషింగ్‌ వంటి 508 పనులకు అధికారులు ప్రణాళిక రూపొందించి రూ.5 కోట్లను కేటాయించారు. ఇందులో రూ.4.50 కోట్లను ఖర్చు చేశారు. గ్రామాలకు నీటిని సరఫరా చేసిన ట్యాంకర్లు, అద్దె బోర్ల గుత్తేదారులకు బిల్లులు నేటికీ అందకపోవడంతో ఈ వేసవిలో నీటి సరఫరాకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ ఏడాది కేవలం రూ.కోటీ 84 లక్షలు మాత్రమే వేసవి ప్రణాళిక పేరుతో కేటాయించారు.

రెండు నదుల మధ్య నడిగడ్డగా ఉన్నా జోగులాంబ గద్వాల జిల్లాలో ఏటా వేసవికి తాగునీటి ఇబ్బందులు తప్పటం లేదు. గద్వాల నియోజకకవర్గంలో నెట్టెంపాడు పథకం ద్వారా సాగునీటి కోసం చెరువులు నింపిన కారణంగా భూగర్భజలాలు కొంతవరకు అందుబాటులో ఉండగా.. అలంపూరు నియోజకకవర్గంలోని ఉండవల్లి, మానవపాడు, అయిజ, రాజోలి మండలాల్లో చాలా గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు మొదలయ్యాయి. 24 గంటల విద్యుత్తు కారణంగా ఆయా గ్రామాల్లో బోరుబావుల నుంచి నిరంతరం నీటిని తోడిపోసి ఉపరితల ట్యాంకులు నింపి వదులుతున్న కారణంగా ఏప్రిల్‌ 15వ తేదీ దాకా తాగునీటికి పెద్దగా ఇబ్బంది లేకపోగా.. క్రమంగా ఎండలు మండుతున్న కారణంగా భూగర్భజలాలు ఇంకిపోయి ఆ ప్రభావం ఇపుడు కనిపిస్తోంది. రెండు నియోజకవర్గాల పరిధిలో దాదాపు 6 లక్షల జనాభా ఉండగా.. సరిపడా తాగునీటి వనరుల్లేవు. మిషన్‌ భగీరథ పథకం ద్వారా మొదటిదశలో గద్వాల, ధరూరు, మల్దకల్‌ మండలాల పరిధిలో 60 గ్రామాలకు తాగునీటిని అందిస్తుండగా.. మిగతా గ్రామాలకు ఇంకా నీరు చేరని పరిస్థితి ఉంది. అలంపూరు నియోజకవర్గంలోని అయిజ మండలంలో కొన్ని గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నారు. అయిజ, గద్వాల పట్టణాల్లోని కొన్ని వార్డుల్లో సమస్య ఉంది. జిల్లా మొత్తం కొత్తగా ఏర్పడినవి కలుపుకొని 261 వరకు గ్రామ పంచాయితీలు ఉండగా.. ప్రతి మండలంలో మూడు నుంచి అయిదు పంచాయితీల్లో తాగునీటి సమస్య ఉందని తాగునీటి సరఫరా శాఖ అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఇప్పటి వరకు సమస్యాత్మకంగా గుర్తించినవాటిలో గట్టు మండలంలోని 5 గ్రామాలు, కేటీ దొడ్డి మండలంలో 4, ఉండవల్లి, మానవపాడు మండలాల్లో 10 వరకు పంచాయితీల్లో తాగునీటి ఇబ్బందులు ఉన్నట్లు చెబుతున్నారు. తాగునీటి సరఫరా శాఖ డీఈ రమేశ్‌కుమార్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ.. గద్వాల నియోజకవర్గంలో గట్టు, కేటీ దొడ్డి మండలాల పరిధిలోని తండాల్లో కొంతవరకు తాగునీటి సమస్య ఉన్నట్లు ఇప్పటికే గుర్తించామన్నారు. అన్ని గ్రామాల్లో తాగునీటి సరఫరా శాఖ సిబ్బంది పర్యటించి సమస్య ఉన్న గ్రామాలను గుర్తిస్తున్నారని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలిచ్చామన్నారు.

వనపర్తి జిల్లాలోని మొత్తం 14 మండలాలకు సగం మండలాల్లో మంచినీటి కొరత తీవ్రంగా ఉంది. మిషన్‌ భగీరథ పథకం కొన్ని గ్రామాల్లో ఇంకా పూర్తిస్థాయిలో అందకపోవడంతో నీటికొరత ఏర్పడింది. ఖిల్లాగణపురం, పెద్దమందడి, గోపాల్‌పేట మండలాల్లోని కొన్ని గ్రామాల్లో తాగునీటి కొరత ఉంది. ఖిల్లాగణపురం మండలం సల్కలాపూరు, తిర్మలాయపల్లి, వెంకటాంపల్లి, ఉప్పరిపల్లి, అంతాయపల్లి గ్రామాల్లో నీటి కొరత ఉంది. ఇక్కడ మిషన్‌ భగీరథ పథకం ఇంకా ట్రయల్‌రన్‌ దశలోనే ఉంది. పెద్దమందడిలో మండల కేంద్రంతోపాటు దొడగుంటపల్లి తండా, పామిరెడ్డిపల్లి, పామిరెడ్డిపల్లి తండా గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది.  మిషన్‌ భగీరథ పైపులైను ఇంకా అనుసంధానం చేయలేదు. రామన్‌పాడు పథకం పైపులైను వేయగా.. పెద్దమందడిలో పనిచేయడం లేదు. గోపాల్‌పేట మండలం  తిర్మలాపూరు, మున్ననూరులలో తీవ్రత ఎక్కువగా ఉంది. మిగతా గ్రామాల్లో మిషన్‌భగీరథ పథకం ద్వారా సరఫరా అవుతోంది. పాన్‌గల్‌ మండలానికి భూగర్భజలాలే  ఆధారం. మిషన్‌ భగీరథ ట్రయల్‌రన్‌ అవుతుండడంతో భూగర్భజలాలు పెరిగాయి. దావాజిపల్లి, అన్నారం గ్రామాల్లో నీటి వనరుల్లేక తీవ్రత ఎక్కువగా ఉంది. ఆత్మకూరు, అమరచింతల్లº ఆత్మకూరు పట్టణంతోపాటు కర్వెనతండా, అమరచింత తండాల్లో తీవ్రత ఎక్కువగా ఉంది. దాదాపు 18 గ్రామాలకు మిషన్‌ భగీరథ నీరు అందడం లేదు. రామన్‌పాడు పథకం కింద ఇన్‌టేక్‌వెల్‌ వద్ద నీటిలభ్యత లేదు.

నాగర్‌కర్నూలు జిల్లాలో శివారు గ్రామాల ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. జిల్లా సరిహద్దున నల్లమల అడవుల్లోని ఏజెన్సీ గ్రామాల ప్రజలు తాగునీటి కోసం నిత్యం నానా పాట్లు పడుతున్నారు. అచ్చంపేట, అమ్రాబాద్‌, పదర మండలాల్లో తాగునీటి సమస్య ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటిదాకా తాగునీటిని సరఫరా చేసిన బోర్లు ఎండిపోయాయి. కొన్నిచోట్ల బోరు మోటార్లు కాలిపోయాయి. బోరుబావుల ఫ్లషింగ్‌, మోటార్లకు మరమ్మతులు చేయక ఆయా గ్రామాలు, తండాలు, చెంచు కాలనీల్లో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. 

Related Posts