న్యూఢిల్లీ ఏప్రిల్ 29
కరోనాపై పోరాటంలో భాగంగా ఐక్యరాజ సమితి చేస్తామన్న సాయాన్ని భారత్ నిరాకరించింది. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి తమ దగ్గరే బలమైన వ్యవస్థ ఉన్నదని భారత్ చెప్పినట్లు యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ వెల్లడించారు. అవసరమైతే మా ఇంటిగ్రేటెడ్ సరఫరా చెయిన్ ద్వారా సాయం అందిస్తామని భారత్‌కు చెప్పాం. అయితే ప్రస్తుతానికి ఆ అవసరం లేదని, ఇండియాలోనే దీనికి తగిన వ్యవస్థ ఉన్నదన్న సమాధానం వచ్చింది. కానీ ఇప్పటికీ మా ఆఫర్ అలాగే ఉంది. మాకు సాధ్యమైన మేర సాయం చేస్తాం అని ఫర్హాన్ హక్ చెప్పారు.ఏవైనా అత్యవసరాలు యూఎన్ నుంచి ఇండియాకు వస్తున్నాయా అని ప్రశ్నించగా.. ఇప్పటివరకూ వాళ్లు ఏమీ అడగలేదు. కానీ మా వాళ్లు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇండియాతో మేము సంప్రదిస్తూనే ఉన్నామని హక్ తెలిపారు. ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారత ఆరోగ్య వ్యవస్థపై మరింత భారం వేయకుండా చూస్తున్నామని చెప్పారు.ఇండియాలో జరుగుతున్న ఎన్నికలు, మత సంబంధమైన ఉత్సవాల కారణంగానే కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయిందా అని ప్రశ్నించగా.. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ చూసుకుంటుందని అన్నారు. ప్రతి దేశంలో తీసుకోవాల్సిన చర్యలపై తాము ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నామని ఆయన చెప్పారు. ప్రపంచం మొత్తం కొవిడ్‌ను జయిస్తేనే ఏ దేశమైనా హాయిగా ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుందని హక్ స్పష్టం చేశారు.