కొవిడ్ మహమ్మారిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాకే కేంద్రాన్ని కోరినట్లు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొవిడ్-19 నిర్వహణ 'మహారాష్ట్ర మోడల్'ను దేశంలోని ఇతర ప్రాంతాల్లో అమలు చేయాలని సూచించారు. అయితే, మోడల్ ఏంటో పూర్తిగా వివరించలేదు. ప్రధానమంత్రి మోదీ ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశాలు, కేంద్రానికి రాసిన లేఖల్లో కొవిడ్ సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఠాక్రే కోరినట్లు రౌత్ తెలిపారు. గత నెల నుంచి విషయాన్ని చెబుతూ వస్తున్నామని, సుప్రీం కోర్టు దీన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.సుప్రీం కోర్టు, హైకోర్టులు ఆందోళన చెందుతున్నాయని, ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాయన్నారు. మహారాష్ట్రను 'దుర్భాషలాడేందుకు' అన్ని ప్రయత్నాలు చేసినా.. సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. బుధవారం మహారాష్ట్రలో కొత్తగా 63,309 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44,73,394కు చేరాయి. రికార్డు స్థాయిలో 985 మరణాలు ఇప్పటి వరకు 67,214 మంది మృతి చెందారని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.