'లీడర్', 'కృష్ణంవందే జగద్గురుమ్', 'బాహుబలి', 'ఘాజీ', 'నేనే రాజు నేనే మంత్రి' - కొత్తదనంతో కూడిన వైవిధ్యమైన కథలు, విలక్షణ పాత్రలను ఎంపిక చేసుకొనే కథానాయకుడు రానా దగ్గుబాటి. విశ్వశాంతి పిక్చర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి ఆయన అంగీకరించారు. సీహెచ్ రాంబాబుతో కలిసి విశ్వశాంతి పిక్చర్స్ అధినేత ఆచంట గోపినాథ్ ఈ సినిమా నిర్మించనున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఈ సినిమా ప్రారంభం కానుంది.
నందమూరి బాలకృష్ణ హీరోగా 'టాప్ హీరో', 'దేవుడు', ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 'జంబలకిడి పంబ', రాజేంద్రప్రసాద్ హీరోగా 'ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్' సినిమాలను ఆచంట గోపినాథ్ నిర్మించారు. నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ హిట్ 'ఇమైక్క నొడిగల్'ను తెలుగులో 'అంజలి సిబిఐ'గా విడుదల చేశారు. కొంత విరామం తర్వాత రానా దగ్గుబాటి హీరోగా భారీ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాతలు ఆచంట గోపినాథ్, సీహెచ్ రాంబాబు మాట్లాడుతూ "ప్రస్తుతం రానా చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత మా సినిమా ఉంటుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న చిత్రమిది. ఆల్రెడీ కథ ఓకే అయ్యింది. కథ, కథనం, హీరో పాత్ర చిత్రణ కొత్తగా ఉంటాయి. దర్శకుడు, సాంకేతిక నిపుణులు, ఇతర వివరాలను త్వరలో ప్రకటిస్తాం" అని అన్నారు.