YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

తొలి ఏడాదిలో రూ.7.41లక్షల కోట్లు జీఎస్టీ వసూలు

తొలి ఏడాదిలో రూ.7.41లక్షల కోట్లు జీఎస్టీ వసూలు

జీఎస్టీని ప్రవేశపెట్టిన తొలి ఏడాదిలో మొత్తం రూ.7.41లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం మధ్యలో జీఎస్టీ ప్రవేశపెట్టడంతో ఎనిమిది నెలల కాలానికిగాను ఈ మొత్తం వసూలైంది. దేశవ్యాప్తంగా 17రకాల పన్నుల స్థానంలో గతేడాది జులైలో జీఎస్టీని ప్రవేశపెట్టారు. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి జీఎస్టీ వసూళ్లు రూ.7.41 లక్షల కోట్లుగా ఉన్నట్లు ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మార్చి నెలలో కేవలం రూ.24 వేల కోట్లు మాత్రమే వసూలైనట్లు ఈ గణాంకాలు చెబుతున్నారు. సాధారణంగా నెలవారీ సగటు రూ.89వేల కోట్లుగా ఉంది. తర్వాతి నెల మూడోవారంలోపు వచ్చిన జీఎస్టీ రిటర్న్స్‌ను బట్టి ఈ వసూళ్లను లెక్కేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నగదు ఆధారంగా జీఎస్టీ ఆదాయాన్ని లెక్కిస్తున్నారు.ఆ లెక్కన ఏప్రిల్ నెల వసూళ్లను మే 1నే విడుదల చేస్తారు. గతేడాది ఆగస్ట్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు మొత్తం రూ.7.19లక్షల కోట్లు వచ్చాయి. అందులో రూ.1.19లక్షల కోట్లు సీజీఎస్టీ, రూ.1.72లక్షల కోట్లు ఎస్‌జీఎస్టీ, రూ.3.66లక్షల కోట్ల ఐజీఎస్టీ, రూ.62,021 కోట్ల సెస్ ఉన్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. జీఎస్టీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం ఆదాయాన్ని పంచుకుంటున్నాయి. ఇవే సెంటర్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ. ఇక రాష్ర్టాల మధ్య వస్తువుల రవాణా, దిగుమతులపై విధించే ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ మొత్తం కేంద్రానికే వెళ్తుంది. వీటికి తోడు లగ్జరీ గూడ్స్‌పై సెస్ విధిస్తున్నారు. ఈ సెస్‌ను రాష్ర్టాల నష్టాలు పూడ్చడానికి వాడుతున్నారు.

Related Posts