సిడ్నీమే 1
ఆస్ట్రేలియా ప్రభుత్వం విదేశాల్లో ఉన్న తమ పౌరులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తాము స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్న తేదీకి 14 రోజులలోపు ఇండియాలో ఉన్న వాళ్లపై ఆస్ట్రేలియాలో అడుగుపెట్టడాన్ని నిషేధించింది. కాదని ఎవరైనా వస్తే వారికి ఐదేళ్ల జైలు, జరిమానా విధిస్తామని హెచ్చరించింది. శుక్రవారం అర్ధరాత్రి విడుదల చేసిన ఈ ప్రకటన తీవ్ర దుమారం రేపుతున్నది.అత్యవసరంగా తీసుకున్న ఈ తాత్కాలిక నిర్ణయం.. తమ పౌరులు స్వదేశానికి తిరిగి రావడమే శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తోంది. ఇండియాలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో ఇండియా నుంచి ప్రయాణికులను అనుమతించకూడదని ఆస్ట్రేలియా నిర్ణయించింది. అయితే మే 3 నుంచి తమ ఆదేశాలను కాదని వస్తే జైలు శిక్ష, జరిమానా విధించనున్నట్లు తాజాగా ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి గ్రెగ్ హంట్ ఒక ప్రకటనలో వెల్లడించారు.ఇది అంత సులువుగా తీసుకున్న నిర్ణయం కాదు. కానీ ఆస్ట్రేలియన్ల ఆరోగ్యం మాకు ముఖ్యం. క్వారంటైన్‌లోని కొవిడ్ కేసుల సంఖ్యను తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మే 15 తర్వాత ఈ ఆంక్షలపై మరోసారి సమీక్షించనున్నారు.అయితే ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనినో జాతి వివక్షగా ఇండియన్-ఆస్ట్రేలియన్లు భావిస్తున్‌పట్లు ఆస్ట్రేలియన్ సర్జన్ నీలా జానకీరామన్ అన్నారు. యూఎస్, యూకే, యూరప్‌లోనూ భారీగా కేసులు నమోదవుతున్నా.. వారిపై లేని ఆంక్షలు తమపై ఎందుకని ఆమె ప్రశ్నించారు. ఇండియన్లు లక్ష్యంగా చేసుకోవడం దారుణమని ఆమె అన్నారు.అటు ఆస్ట్రేలియాలోని మానవ హక్కుల సంఘాలు కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. ప్రభుత్వం క్వారంటైన్ వ్యవస్థను బలోపేతం చేయాలి తప్ప శిక్షలను కాదని ఆ సంఘాలు అంటున్నాయి. ఇది చాలా దారుణం. ఆస్ట్రేలియన్లకు వాళ్ల సొంత దేశానికి తిరిగి వచ్చే హక్కు ఉంది. జైలు శిక్షలు, జరిమానాల బదులు ఇండియా నుంచి వాళ్లను సురక్షితంగా తీసుకొచ్చే అంశాలపై దృష్టి సారించాలి అని ఆస్ట్రేలియా మానవ హక్కుల సంఘం డైరెక్టర్ ఎలాయిన్ పియర్సన్ అన్నారు.