YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆ విషయంలో మాత్రం బాబు బాటలోనే జగన్

ఆ విషయంలో మాత్రం బాబు బాటలోనే జగన్

విజయవాడ, మే 3, 
రాజకీయం అంటేనే కఠినాతికఠినం. అక్కడ చాణక్య నీతి అమలు అవుతుంది. తరతమ భేదాలు అసలు పాటించరు. తమ ఎదుగుదలకు అడ్డు అనుకుంటే ఎవరి మీదనైనా కచ్చితంగా వేటు వేస్తారు. తొక్కేసి మరీ ముందుకు సాగుతారు. సరిగ్గా పాతికేళ్ల క్రితం చంద్రబాబు ఇదే అమలు చేశారు. ముందు పిల్లను ఇచ్చిన మామ ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడిచారు. ఆ తరువాత తనను నమ్మి వెంట వచ్చిన బావమరుదులు, తోడల్లుడు, ఇతర బంధువులకు కూడా పొలిటికల్ పంజా విసిరి దెబ్బ రుచి చూపించారు. ఇపుడు తానూ లోకేష్ తప్ప ఎవరూ టీడీపీకి సిసలైన బంధువులూ కాదు, ఎవరికీ పేటెంటు హక్కులూ అసలు లేవు.మరి జగన్ ఇపుడు చేస్తున్నది ఏంటి అన్న చర్చ కూడా సుదీర్ఘ కాలంగా తెలుగు రాజకీయాలను చూస్తున్న వారికి వస్తోంది. తాను జైలులో ఉన్నపుడు తన కోసం మూడు వేల పై చిలుకు కిలోమీటర్లను ఉమ్మడి ఏపీలో నడచిన ఆడకూతురు ఇంటి ఆడపడుచు షర్మిలకు ఏ చిన్న పదవీ ఇవ్వకుండా జగన్ దూరం పెట్టడం చూస్తే చంద్రబాబు ఫార్ములానే వాడారా అన్న అనుమానం అయితే రాక మానదు. లేకపోతే షర్మిల పార్టీకి చేసిన సేవలకు గాను రాజ్యసభ సీటు ఇచ్చి ఢిల్లీలో ఆమెను పార్టీ తరఫున నమ్మకమైన నేతగా పెట్టుకుంటే తప్పేముంది అన్న వారూ వైసీపీలో ఉన్నారు. నిజానికి జగన్ జైలులో ఉన్న వేళ షర్మిల అనే ఆమె పార్టీని భుజానికెత్తుకోకపోతే ఈ రోజున జగన్ సీఎం సీటును అందుకునే వారు కాదు అన్న చర్చ కూడా ఉంది.అచ్చం చంద్రబాబు మదిరిగానే ఇక్కడ జగన్ ఆలోచిస్తున్నారు అన్నదే అందరి మాటగా ఉంది. తన కుమారుడు లోకేష్ ని తప్ప ఎవరినీ చంద్రబాబు నమ్మకపోతే జగన్ తన సతీమణి భారతిని తన వారసురాలిగా చూస్తున్నారు అంటున్నారు. భారతికి రాజకీయంగా అవకాశాలు కల్పించినా పదవి తమ ఇంట్లోనే ఉంటుంది అన్న దూరాలోచనతోనే జగన్ ఇలా చేస్తున్నారు అన్న విశ్లేషణ కూడా ఉంది. జగన్ ఇప్పటికైతే యువకుడు, పైగా మూడు దశాబ్దాల పాటు సీఎం గా రాజ్యం చేయాలన్న ఆశ కూడా ఉంది. అయితే అనుకోని సమస్యలు వచ్చిపడితే బీహార్ లో లాలూ ప్రసాద్ చేసిన మాదిరిగా జగన్ సతీమణికే ఓటు వేస్తారు అంటున్నారు. అందుకే కావాలనే షర్మిలను దూరం పెట్టారు అని అంటున్నారు.టీడీపీలో నందమూరి ఫ్యామిలీ కరివేపాకు మాదిరిగా చంద్రబాబు వాడుకుని వదిలేశారు అన్నది ఇప్పటికీ విమర్శ. దాన్ని తిరగరాసేలా జగన్ సైతం షర్మిల విషయంలో వ్యవహరిస్తున్నారు అంటున్నారు. వైఎస్సార్ కి తానే ఏకైక‌ వారసుడిని అన్న భావనతోనే ఆయన ముందుకు సాగుతున్నారు అని చెబుతున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే షర్మిలకు మంచి వాగ్దాటి ఉంది. జనాకర్షణ కలిగిన నాయకురాలు అని కూడా చెప్పాల్సిందే. వేలాది మంది జనాలను కదలకుండా ప్రసంగాలు చేయడంలో ఆమె నేర్పు సాధించారు. వైఎస్సార్ హావభావాలు పుణికి పుచ్చుకోవడం కూడా ఆమెకు అదనపు ఆకర్షణ. మరి ఈ రకమైన నాయకత్వ లక్షణాలే వైసీపీలో ఆమెకు ఉన్నత స్థానం దక్కకుండా చేశాయా అన్న చర్చ అయితే ఉంది. ఏది ఏమైనా ఇక్కడ చంద్రబాబా? జగనా? అన్నది ముఖ్యం కాదు, ఇది ఫక్త్ రాజకీయం, చాణక్యుడు చెప్పినట్లుగా విజయమే ప్రధానం. అందువల్ల ఎవరినైనా తొక్కుకుని పోవాల్సిందే. ఆ విధంగా చూస్తే చంద్రబాబు చేసింది కూడా తప్పు కాదేమోనని అంతా అంటున్న మాట.

Related Posts