YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అమరావతిలో పెరుగుతున్ననేరాలు

 అమరావతిలో పెరుగుతున్ననేరాలు

రాజధానిలో భద్రతా వ్యవస్థ పటిష్టతపై చెబుతున్న మాటలకు... చేస్తున్న పనులకు పొంతన ఉండడం లేదు.అభివృద్ధితోపాటు నేరాల్లోనూ ఆంధ్రప్రదేశ్‌ పురోగతి సాధిస్తోందా? రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లలో నమోదవుతోన్న కేసుల వివరాలు చూస్తే ఈ అనుమానం కలుగక మానదు! హత్యలు, డెకాయిటీలు, రాబరీలు, అత్యాచారాలు, గంజాయి స్మగ్లింగ్‌, మోసాలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకూ తొమ్మిది నెలల్లో 95,447 నేరాలు జరిగాయి. గత ఏడాది ఇదే సమయంలో 77,806గా నమోదయ్యాయి. 5,525 నుంచి 10,501కి కేసులు పెరిగి కడప టాప్‌లో ఉంది. 3,186 నుంచి 7,910కు నేరాల సంఖ్య పెరగడంతో విజయనగరం జిల్లా రెండోస్థానంలో నిలిచింది. విజయవాడ కమిషరేట్‌ను విస్తరించి అమరావతి  కమిషనరేట్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను అటకెక్కించింది. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్లుగా పోలీసు వ్యవస్థను పటిష్టపరచడం లేదు. దీంతో రాజధానిలో శాంతిభద్రతల పరిస్థితి అదుపుతప్పుతోంది. ప్రజలకు రక్షణ కొరవడింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో క్రైం రేటు పెరుగుతోంది. ఈ విషయాన్ని ఇటీవల రాష్ట్ర హోం శాఖ తన వార్షిక నివేదికలో స్పష్టం చేసింది.రాజధాని అవసరాలకు తగినట్లుగా భద్రతా వ్యవస్థను తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడింది. కొత్త పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుపై రెండేళ్లుగా కదలికే లేకుండాపోయింది. అమరావతి జిల్లాల పరిధిలో ప్రస్తుతం 80 పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. కృష్ణా జిల్లా, విజయవాడ కమిషనరేట్, గుంటూరు అర్బన్, గుంటూరు రూరల్‌ పోలీసు జిల్లాల్లో క్రైం రేటు కొన్నేళ్లుగా పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజధానిగా ఎంపిక అనంతరం అమరావతిలో భద్రత వ్యవస్థను మరింతగా పటిష్ట పరచాల్సిన అవసరం ఏర్పడింది. రాజధాని కావడంతో  వ్యాపార, అధికారిక కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. అదే సమయంలో క్రైం రేటు కూడా బాగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అమరావతి పరిధిలో కొత్తగా 20 పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలని రెండేళ్ల కిందట నిర్ణయించారు. వీటిలో విజయవాడలోని పటమట, మాచవరం, టూ టౌన్,  పెనమలూరు పోలీస్‌స్టేషన్లను రెండు చొప్పున విభజించి కొత్తగా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇబ్రహీంపట్నం, గన్నవరం పోలీస్‌స్టేషన్ల పరిధిలో కూడా ఒక్కో కొత్త పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.గుంటూరు అర్బన్‌ జిల్లా పరిధిలో చేబ్రోలు, అరండల్‌పేటలో కొత్త పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  రాజధాని అమరావతి పరిధిలో మొదటి దశలో రెండు, తర్వాత మరో రెండు కొత్త పోలీస్‌స్టేషన్లు నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే గుంటూరులో రెండు కొత్త మోడల్‌ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు. అమరావతి పరిధిలో ప్రతిపాదించిన సాధారణ పోలీస్‌స్టేషన్లలో కొత్తగా ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేదు.విజయవాడ పటమట, మాచవరం పోలీస్‌స్టేషన్ల పరిధిలో నేరాల సంఖ్య ఏడాదికి వెయ్యి దాటుతోంది. అక్రమాలకు ఈ రెండు ప్రాంతాలు అడ్డాగా మారుతున్నాయి. పటమట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వస్తున్న శివారు పంచాయతీల్లో శాంతిభద్రతల సమస్య తీవ్రంగా ఉంది. పటమట, మాచవరం పరిధిలోనే వైట్‌కాలర్‌ నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. పెనమలూరులోనూ శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పుతోంది. రౌడీమూకలు చెలరేగుతున్నాయి. వీధి పోరాటాలు నిత్యకృత్యంగా మారాయి.విజయవాడ టూ టౌన్‌ పరిధిలో బలవంతపు వసూళ్లు, సెటిల్‌మెంట్లతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆందోళనకర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గుంటూరు అర్బన్‌లో అసాంఘిక శక్తులు వ్యవస్థీకృతమవుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. కానీ పనిభారంతో ప్రస్తుత పోలీస్‌ అధికారులు శాంతిభద్రతల పరిరక్షణలో ఉదాసీనంగా వ్యవహరించాల్సి వస్తోంది. సకాలంలో కేసుల పరిష్కారం అన్నది ఎండమావిగానే మారిపోతోంది. దీంతో బాధితులు చట్టపరమైన పరిష్కారం కన్నా ప్రైవేటు సెటిల్‌మెంట్ల వైపే మొగ్గుచూపాల్సిన అగత్యం ఏర్పడుతోంది.

Related Posts