హైదరాబాద్, మే 5,
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో పలు దేశాలు భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా సహా.. ఆస్ట్రేలియా, పలు దేశాలు భారత్ నుంచి వచ్చే విమాన సర్వీసులపై ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలో ముందుజాగ్రత్త చర్యగా అమెరికా విధించిన ట్రావెల్ బ్యాన్ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. గత శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ట్రావల్ బ్యాన్‌ను విధించిన సంగతి తెలిసిందే. అయితే.. కొన్ని విభాగాలకు చెందిన విద్యార్థులు, జర్నలిస్టులు, కొందరు వ్యక్తులకు మాత్రం ఈ నిషేధం నుంచి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకటనను సైతం జారీ చేసింది. వ్యక్తిగత హోదాలో మినహాయింపు పొందిన వారిలో గ్రీన్ కార్డు హోల్డర్లు, భర్త అమెరికాలో ఉండగా.. ఇంకా పౌరసత్వం పొందని భార్యలు, వారి 21 ఏళ్లలోపు సంతానానికి మినహాయింపు ఇచ్చారు. కాగా.. ఈ ట్రావెల్ బ్యాన్ ఎప్పటివరకు అమల్లో ఉంటుందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.విద్యార్థు తరగతులకు సంబంధించి యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ కూడా స్పందించింది. 2021 ఆగస్టు 1 నుంచి యుఎస్‌లో తరగతులు ప్రారంభమయ్యే భారతీయ విద్యార్థులు దేశంలోకి ప్రవేశించవచ్చని వెల్లడించారు. భారతదేశం నుంచి వెళ్లే ప్రయాణికులపై ఆంక్షలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. అధ్యక్ష ప్రకటన ప్రకారం.. విద్యార్థి వీసా హోల్డర్లు 2021 ఆగస్టు 1 న లేదా ఆ తరువాత తరగతులు ప్రారంభిస్తే అమెరికాలోకి ప్రవేశించవచ్చని ప్రకటించింది. అయితే.. ఎఫ్ వీసా హోల్డర్లకు ఈ మినహాయింపు ఉండదని తెలిపింది. తరగతుల ప్రారంభ తేదీ ఆగస్టు 1 కి ముందు ఉంటే.. వీసా తదితర వివరాల కోసం సంబంధిత విద్యాసంస్థలను సంప్రదించమని వెల్లడించింది.