న్యూఢిల్లీ మే 5
దేశ రాజధానిలో ఆక్సిజన్ కొరత, ఢిల్లీ హైకోర్టు ధిక్కరణ హెచ్చరికలపై బుధవారం సుప్రీంకోర్టుకు వెళ్లింది కేంద్ర ప్రభుత్వం. విచారణ సందర్భంగా కోర్టు, ప్రభుత్వం మధ్య ఆసక్తికర సంభాషణ నడిచింది. ఢిల్లీ ఆక్సిజన్ డిమాండ్ తీర్చడానికి కేంద్రం ఏం చర్యలు చేపట్టిందో చెప్పాలని సుప్రీం అడిగింది. బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఈ విషయంలో చాలా బాగా పని చేస్తోందని, ఢిల్లీ అధికారులు కూడా వాళ్లను చూసి నేర్చుకోవచ్చని జస్టిస్ చంద్రచూడ్, ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది.కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఢిల్లీతో మాకు విరోధం లేదు. రెండు ప్రభుత్వాలు కలిసి పని చేస్తున్నాయి. అధికారులను జైల్లో వేసినంత మాత్రాన ఆక్సిజన్ రాదు. వివిధ రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరాపై కేంద్రం ఓ ప్రణాళిక తయారు చేస్తోంది అని తుషార్ కోర్టుకు చెప్పారు. ఈ సందర్భంగా దేశమంతా ఒకే ఫార్ములా పనికి రాదని, డిమాండ్ అంతటా ఒకేలా లేదని కోర్టు చెప్పింది. రానున్న రోజుల్లో ఢిల్లీలో డిమాండ్‌ను ఎలా నెరవేరుస్తారు అని ప్రశ్నించింది. బీఎంసీ చాలా బాగా పని చేస్తోందని కోర్టు చెప్పగా.. అవును వాళ్లు బాగా చేస్తున్నారు అని కేంద్రం అంగీకరించింది.ఢిల్లీలో ఆక్సిజన్‌కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయిందని, ప్రస్తుతం అన్ని వనరుల నుంచి ఆక్సిజన్ అందించడానికి ప్రయత్నిస్తున్నామని తుషార్ చెప్పారు. ఆక్సిజన్ సరఫరాపై తన ఆదేశాలను పాటించనందుకు ఎందుకు ధిక్కరణగా పరిగణించకూడదో చెప్పాలంటూ కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ కేంద్రం సుప్రీంకు వెళ్లింది.