తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కు టైమ్ దగ్గరపడిందా.. అంటే ఔననే సమాధానమే వస్తోంది.కేంద్రప్రభుత్వం కూడా ఇరువురితోనూ సత్సంబంధాలు నెరపాల్సిందిగానే నరసింహన్ కు సూచించింది. ఇటీవలికాలంలో కేంద్ర ఇంటిలిజెన్సు బ్యూరో చీఫ్ కూడా ఏపీ సీఎంతో భేటీ అయ్యారు. రెండింటిలోనూ ఏదో సారూప్యత, సామీప్యత ఉన్నట్లుగానే రాజకీయ వర్గాలు అనుమానించాయి. సీఎం ల కలయిక తర్వాత ఫస్టు హ్యాండ్ సమాచారం కోసం కేంద్రం కబురంపింది. గవర్నర్ సమావేశంలో కేసీఆర్ తనకు కేంద్రంతో ఉన్న కొన్ని సమస్యలపై స్పష్టత ఇచ్చినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎటువంటి అదనపు సహాయసహకారాలు అందడం లేదనేది రాష్ట్రప్రభుత్వ ఫిర్యాదు. అంతేకాకుండా భారీ నీటిపారుదల ప్రాజెక్టులు చేపడుతున్నప్పటికీ ఒక్క ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా కల్పించక పోవడం వంటి అంశాలపై తన పాత ఫిర్యాదులనే ప్రస్తావించినట్లు సమాచారం. అయితే రాజకీయంగా థర్డ్ ఫ్రంట్ రావాల్సిన అవసరాన్ని గవర్నర్ కు కేసీఆర్ నివేదించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మమత, దేవెగౌడల తో తన సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను వివరించారంటున్నారు. ఫెడరల్ ఫ్రంట్ అన్నది జాతీయ అవసరాలను తీర్చేందుకు ఉపకరిస్తుందని తెలంగాణ సీఎం వివరించినట్లు భోగట్టా.తన బాధ్యతగా కేంద్రప్రభుత్వానికి సీఎంల ఆలోచనలను తెలియచేసేందుకు గవర్నర్ ఢిల్లీ కార్యక్రమం పెట్టుకున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉంటారనేది ముందుగా నిర్ణయమైన షెడ్యూల్. కానీ పర్యటన సగంలో ముగియడంతో సవాలక్ష సందేహాలు మొదలయ్యాయి.ఇటీవలి కాలంలో గవర్నర్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరితోనూ విస్తృత స్థాయి మంతనాలు జరిపారు. రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రాజకీయవేడి పుంజుకుంటున్న స్థితిలో కేంద్ర రాష్ట్రప్రభుత్వాల మధ్య సంబంధాల విషయంలో ఘర్షణాత్మక వైఖరి ఏర్పడకుండా సంయమనం పాటింపచేయాలనే ఆలోచనతోనే గవర్నర్ సంభాషణ జరిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో కొంత క్లారిటీ వచ్చినప్పటికీ , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వలేద. బీజేపీ, కాంగ్రెసుల మధ్య బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ గా పని చేస్తుంది. జాతీయ పార్టీలు రాష్ట్రాలను పూర్తిగా అణగదొక్కేయకుండా ఒక బలమైన కూటమిగా నిలబడుతుంది. కేంద్ర,రాష్ట్ర వివాదాలు మంద బలంతో కేంద్రం వైపు ఏకపక్షంగా పరిష్కారం కాకుండా తటస్థ శక్తిగా ప్రాంతీయపార్టీల సమాఖ్య ఉపకరిస్తుంద’ని విశ్లేషణాత్మకంగానే కేసీఆర్ వివరించగలిగారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ‘తీవ్రమైన రాజకీయ పరిస్థితులున్నప్పటికీ కూడా జాతీయ సమగ్రత విషయంలో తామెటువంటి రాజీ పడటం లేదు. లేశమాత్రం అనుమానం కూడా తలెత్తకుండా వ్యవహరిస్తున్నాం. కేరళ ప్రభుత్వం 15 వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలపై దక్షిణాది రాష్ట్రాలతో నిరసన సమావేశం పెట్టింది. జాతి సమైక్యతపై తప్పుడు సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతో ఈ సమావేశంలో తెలంగాణ భాగస్వామి కాలేద‘న్న విషయాన్ని కేసీఆర్ వివరించారు. మొత్తమ్మీద కేంద్ర ప్రభుత్వంపై తాము ఉద్దేశపూర్వకంగా దాడి చేసేందుకు ప్రయత్నించడం లేదన్న అంశాన్ని సుస్పష్టంగానే కేసీఆర్ చెప్పేశారు. అదే సమయంలో బీజేపీని పార్టీగా తాము టార్గెట్ చేయక తప్పదనీ తేల్చేశారు.నిజానికి కేంద్రంతో సీరియస్ గా వెళ్లవద్దని సర్దిచెప్పడానికే చంద్రబాబుతో నరసింహన్ భేటీ అయ్యారు. చాలావరకూ మౌనంగా ఉన్నప్పటికీ ఏ విషయమూ తన సమావేశంలో చంద్రబాబు తేల్చలేదనేది టీడీపీ వర్గాల నుంచి అందిన సమాచారం. తమ ప్రత్యేక హోదా డిమాండ్లలో న్యాయం ఉందని, బీజేపీ వైసీపీని ఉసిగొల్పుతోందని, పవన్ కల్యాణ్ తమకు దూరం కావడానికి బీజేపీ అగ్రనాయకత్వమే కారణమనే అభియోగాలను చంద్రబాబు గవర్నర్ ముందు పెట్టారంటున్నారు. వీటిపై ఇరువురి మధ్య ఏకాభిప్రాయం నెలకొనలేదని తెలుస్తోంది. రాజకీయాల సంగతి ఎలా ఉన్నప్పటికీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో పరిపాలన పరమైన అంశాలపై కేంద్రంతో విభేదాలు తెచ్చుకోవద్దని హితవు చెప్పేసి చక్కా వచ్చేసినట్టుగా విశ్వసనీయవర్గాలు పేర్కొంటున్నాయి. గవర్నర్ భేటీ తర్వాత తెలుగుదేశం,బీజేపీ మధ్య రాజీకి గవర్నర్ ప్రయత్నించారనే వదంతులు పెద్దగా ప్రచారంలోకి వచ్చాయి. దీంతో మొత్తం వ్యవహారం చెడిపోతోందని గ్రహించిన చంద్రబాబు నాయుడు అడ్డుకట్ట వేయాలని యోచించారు. ఒక ప్రధాన మీడియా సంస్థ నుంచి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుంటూ గవర్నర్ పై ధ్వజమెత్తారు. టీడీపీకి వ్యతిరేకంగా అన్ని శక్తులను నరసింహన్ కూడగడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఒక గవర్నర్ పై ముఖ్యమంత్రి ఈ స్థాయి విమర్శలు చేయడం తీవ్రాతితీవ్రమైనది. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న తాను స్పందించడం కూడా సమంజసం కాదనేది గవర్నర్ భావన. రాజ్ భవన్ వర్గాల సమాచారం ప్రకారం నరసింహన్ ఈ విమర్శల పట్ల తీవ్రమైన మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో కేంద్రమంత్రులను, ప్రధానిని కలిస్తే సీఎంతో సంబంధాలు మరింతగా చెడిపోతాయనే ఉద్దేశంతో గవర్నర్ తిరుగుముఖం పట్టినట్లుగా భావిస్తున్నారు. ఒకవేళ రానున్న కాలంలో ఏ విషయంలో అయినా చంద్రబాబు ప్రభుత్వంపై కేంద్రం చర్యలకు దిగితే తానే నూరిపోసినట్లుగా అనుమానించే అవకాశం ఉందనే సందేహంతో గవర్నర్ ముందుజాగ్రత్తగానే వెనుతిరిగి వచ్చారంటున్నారు. ఏదేమైనా ప్రధాని, గవర్నర్ నేరుగా సమావేశం కాకుండా తన ఆరోపణలతో చంద్రబాబు నిరోధించగలిగారనే చెప్పవచ్చు. గవర్నర్ మధ్యవర్తిత్వంలో బీజేపీతో ప్యాచ్ అప్ కు ఇక ప్యాకప్ చెప్పేసినట్లే అంటున్నారు.