YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

పండ్ల మార్కెట్ పై కరోనా దెబ్బ

పండ్ల మార్కెట్ పై కరోనా దెబ్బ

ఒంగోలు, మే 6, 
ప్రకాశం జిల్లా ఉలవపాడు సమీపంలో పండే బంగినపల్లి మామిడి, పాల సపోటా దేశవ్యాప్తంగా పేరుగాంచాయి. ఇప్పుడు ఈ పండ్ల సీజన్‌ వచ్చింది. కాయలు కోతకు వచ్చాయి. కరోనా దెబ్బకు అంతర్రాష్ట్ర మార్కెట్లు మూతపడ్డాయి. కొన్ని అరకొరగా నడుస్తున్నాయి. దీంతో, మామిడి, సపోటా ఎగుమతులు, ధరలపై ఈ ఏడాదీ ప్రభావం కనిపిస్తోంది. రైతులు, వ్యాపారులు కలవరపడుతున్నారు. కరోనా ప్రభావంతో వరుసగా రెండో ఏడాదీ పండ్ల మార్కెట్లు సంక్షోభంలో పడుతున్నాయి. ముందుగా తోటలను కొనుగోలు చేసిన వ్యాపారులు కూడా నష్టపోతున్నారు. పరిస్థితులు ఇదే తీరున ఉంటే రైతులకు కూడా ధరలు తగ్గుతాయి.చెన్న‌య్‌లోని కోయంబేడు మార్కెట్‌ రెండు, మూడు రాష్ట్రాలకు కీలకంగా మారింది. ఇక్కడ సుమారు 500కుపైగా హోల్‌సేల్‌ దుకాణాలు ఉన్నాయి. అక్కడకు జిల్లాలోని ఉలవపాడు, కందుకూరు ప్రాంతాల నుంచి రోజుకు పది నుంచి 15 లారీల మామిడి, నాలుగు నుంచి ఐదు లారీల వరకూ సపోటా వెళ్తుంది. అక్కడ వాటిని రిటైల్‌ వ్యాపారులు కొనుగోలు చేసి చెన్నరు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు తీసుకెళ్తారు. అక్కడి నుంచి కొందరు వ్యాపారులు జిల్లాకు నేరుగా వచ్చి కొనుగోలు చేస్తుంటారు. మామిడి టన్ను రూ.40 వేల నుంచి రూ.60 వేలు అమ్ముతుంది. సపోటా బస్తా రూ.450 దాకా ఉంటుంది. ఈ ఏడాది కోయంబేడు మార్కెట్‌ మూతపడడంతో సగం దుకాణాలే ఉన్నాయి దీని ప్రభావం ధరలపైనా ఉంది. ఎగుమతులు ఆగాయి. కోతలు తగ్గాయి. టన్ను మామిడి ప్రస్తుతం రూ.30 వేల నుంచి రూ.40 వేలులోపే ఉంది. బెంగళూరు, అహ్మదాబాదు, ముంబయి, హైదరాబాదు తదితర పట్టణాలకూ మామిడి ఎగుమతులు ఈ ఏడాది నిల్చిపోయాయి. ఆయా ప్రాంతాల్లోని మార్కెట్లు మూతపడమే ఇందుకు కారణం.ఇతర రాష్ట్రాల్లో మార్కెట్లు లేవు. దీంతో, పండ్లను ఏదో రకంగా అమ్ముకునేందుకు రైతులు, వ్యాపారులు ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నారు. ఉలవపాడు నుంచి రాజుపాలెం వరకూ మూడు కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారికి ఇరువైపులా పండ్ల దుకాణాలు పెట్టుకున్నారు. తోటల బయటే దుకాణాలు పెట్టుకుని అమ్ముతున్నారు. సుమారు 200 దుకాణాలకు పోలీసులు అనుమతి ఇచ్చారు. తోటలను కొనుగోలు చేసిన చిరువ్యాపారులు కూడా ఇక్కడే షెడ్లు వేసుకుని పండ్లను అమ్ముతున్నారు. . మేలో ఉలవపాడు మామిడి ఎక్కువగా దిగుబడి రానుంది. అప్పుడు మార్కెట్‌ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. పట్టణాల్లోనూ పాక్షిక లాక్‌డౌన్లు అమలవుతున్నందున తోపుడు బండ్లపై అమ్ముకునే పండ్ల వ్యాపారులు కూడా అవస్థలు పడుతున్నారు.

Related Posts