చిత్తూరు
చిత్తూరు జిల్లా పలమనేరు డిఎస్పీ గంగయ్య ఆధ్వర్యంలో గంగవరం పోలీసులు ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా వున్నాయి. గంగవరం మండలం, గండ్రాజుపల్లె అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సందర్భంగా బెంగుళూరు నుండి చిత్తూరు వైపు వెళ్తున్న ఓ కారులోని రెండు బ్యాగుల్లో నోట్ల కట్టలు ఉండటంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, వారు పశ్చిమ బెంగాల్ కు చెందిన సుబంకర్ షిల్ మరియు రాజు దేవనాథ్ గా తెలిసిందన్నారు. వారిని లోతుగా విచారించగా వారు తమ స్నేహితుడు సంజు సాహుతో కలిసి ఈ నెల 2వ తేదీన బెంగుళూరు ఎంహెచ్ఆర్ లేవుట్ లో తాళాలు వేసిన ఇంటిని పగులగొట్టి అల్మారాలోని 90 లక్షల నగదు దొంగిలించి,బెంగళూరు నుండి కారు బాడుగకు మాట్లాడుకొని వస్తుండగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో గంగవరం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా వీరి కారులో మూటలు ఉండగా వాటిని విప్పి చూడగా అందులో నోట్లకట్టలు గమనించి వారిని అదుపులోకి తీసుకున్నారు. సదరు ఇంటి యజమానిని సంప్రదించిన పోలీసులు అతని వద్ద నుండి డబ్బుపోయినట్లు నిర్దారించుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని రిమాండ్ కు తరలించనున్నట్లు పలమనేరు డిఎస్పీ గంగయ్య తెలిపారు.