న్యూఢిల్లీ మే 6
కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తితో మానసిక, శారీరక ఒత్తిళ్లకు లోనవుతున్న ఉద్యోగులకు ఊరట కలిగించేందుకు కార్పొరేట్ కంపెనీలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఉద్యోగుల్లో ఒత్తిడిని దూరం చేసేందుకు వేతనంతో కూడిన సెలవలు, విశ్రాంతి దినాలను ఆఫర్ చేస్తున్నాయి. డెలాయిట్, హిందుస్ధాన్ యూనిలీవర్, పీడబ్ల్యూసీ, గోద్రెజ్ వంటి పలు కంపెనీలు తమ ఉద్యోగులు మహమ్మారి విలయంతో నైరాశ్యానికి లోనవకుండా వారికి ప్రశాంతత కల్పించేలా అదనంగా వీక్లీ, నెలవారీ ఆఫ్ లు ప్రకటించాయి.డెలాయిట్ తమ సిబ్బందికి ఇప్పటికే ఉన్న లీవ్ లు, సెలవలకు అదనంగా మరన్ని రోజులు విధులకు దూరంగా ఉండే వెసులుబాటు కల్పిస్తూ హాలిడే పూల్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ తమ ఉద్యోగులందరి కోసం వారానికి నాలుగు రోజుల పని విధానాన్ని ప్రకటించింది. పీడబ్ల్యూసీ సైతం తమ ఉద్యోగులకు హాలిడే పూల్ ను ఏర్పాటు చేసి మే నెలలో సిబ్బందికి మూడు రోజులు వేతనంతో కూడిన సెలవలు ఆఫర్ చేసింది.