YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నరేంద్రకు కరోనా పాజిటివ్

నరేంద్రకు కరోనా పాజిటివ్

విజయవాడ, మే 6, 
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌కు కొవిడ్‌ పాజిటివ్‌ తేలింది. ఆయనతోపాటు సహకార శాఖ మాజీ అధికారి గురునాథానికి హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం రాత్రి సి.టి.స్కాన్‌ తీయించగా ఇద్దరికీ కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ఇద్దరి కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఇద్దరినీ విజయవాడ ఆయు ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేస్తున్నారు. వీరిద్దరికీ ఆర్‌టీపీసీఆర్‌ వైద్య పరీక్షల్లో బుధవారం ఉదయం నెగిటివ్‌ వచ్చింది. దీంతో నరేంద్రకుమార్‌ను విచారణ నిమిత్తం అధికారులు ఉదయం రాజమండ్రిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఆరు గంటలపాటు ప్రశ్నించారు.. సాయంత్రం జైలు అధికారులకు అప్పగించారు.మరోవైపు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌, సహకారశాఖ మాజీ అధికారి గురునాథంలను ప్రైవేటు ఆస్పత్రికి తరలించి కొవిడ్‌ పరీక్షలు చేయించాలని ఏసీబీ దర్యాప్తు అధికారిని, రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ను హైకోర్టు ఆదేశించింది. పరీక్షల్లో వారికి కొవిడ్‌ సోకిందని తేలితే ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించాలని చెప్పింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. పిటిషనర్ల బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ జరపడానికి హైకోర్టులో ఉన్న క్వాష్‌ పిటిషన్‌ అడ్డంకి కాదని తెలిపింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.ఏప్రిల్‌ 22న ఏసీబీ అధికారులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ నరేంద్ర, ఎండీ గోపాలకృష్ణ వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేసులో దర్యాప్తును కొనసాగించేందుకు అనుమతిస్తూ.. పిటిషనర్లు వ్యక్తిగతంగా ఏ విధంగా లబ్ధి పొందారో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఇటీవల ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. దీనిపై బుధవారం విచారణకు వచ్చింది. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.. కౌంటర్‌ దాఖలుకు మరింత సమయం కావాలని ఏసీబీ న్యాయవాది వాదనలు వినిపించారు. విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేయాలన్నారు. జైలులో ఉన్న గోపాలకృష్ణ ఇప్పటికే కరోనా బారినపడ్డారని పిటిషనర్ల తరపు లాయర్ అన్నారు. జైలులో ప్రైమరీ కాంటాక్టుగా ఉన్న నరేంద్ర, గురునాథం కరోనా బారినపడొచ్చన్నారు. ప్రైవేటు ఆస్పత్రిలో కొవిడ్‌ పరీక్షలకు అనుమతివ్వాలన్న వారి అభ్యర్థనపై నిర్ణయాన్ని ఏసీబీ కోర్టు గురువారానికి వాయిదా వేసింది.

Related Posts