విజయవాడ
విజయవాడ జీజీహెచ్ లో ఆక్సిజన్ తో చికిత్సపొందుతున్న సుమారు నాలుగు వందలకు మంది కోవిడ్ భాదితులను పెను ప్రమాదం తప్పింది. పోలీసులు వారికి ఆక్సిజన్ అందించి వారి ప్రాణాలను కాపాడారు. వివరాలు ఇలా వున్నాయి. విజయవాడ జీజీహెచ్ కు 18టన్నుల తో వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రాకింగ్ వ్యవస్థ తో సంబంధాలు తెగిపోయాయి. దాంతో కంగారు పడిన సంబంధిత అధికారులు విజయవాడ సిటీ కమిషనర్ కి సమాచారాన్ని చేరవేసారు. అత్యవసర పరిస్థితి వుండడంతో అయన హుటాహుటిన రంగంలోకి దిగి ఒరిస్సా నుండి విజయవాడ వరకు ఉన్న అన్ని మార్గ మధ్యలో ఉన్న జిల్లా ఎస్పీలను అప్రమత్తం చేసారు. దాంతో ఆయా జిల్లాల పోలీసులు హుఠాహుటిన జాతీయ రహాదారిపై వచ్చి సదరు ట్యాంకర్ కోసం గాలింపులు జరిపారు. చివరకు తూర్పు గోదావరి జిల్లా, ధర్మవరం వద్ద ప్రత్తిపాడు పోలీసులు ఓ డాబా లో ఆక్సిజన్ ట్యాంకర్ ని గుర్తించారు. డ్రైవర్ ను ప్రశ్నించారు. నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా లో నిమగ్నం అవడంతో అలసిపోయి వాహనాన్ని నిలిపి వేసినట్టుగా పత్తిపాడు సిఐ కి డ్రైవర్ వివరించాడు. డ్రైవర్ సమస్యను ప్రత్తిపాడు సిఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఉన్నతాధికారులు ఆక్సిజన్ ట్యాంకర్ కు గ్రీన్ చానల్ ఏర్పాటు చేసారు. డ్రైవర్కి తోడుగా అనుభవం కలిగిన హోంగార్డుతో ఆక్సిజన్ ట్యాంకర్ ను గ్రాన్ ఛానల్ ద్వారా సురక్షితంగా విజయవాడ జి.జి.హెచ్ కి చేర్చారు. ట్యాంకర్ జీజీహెచ్ కు చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.