YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

శృంగేరి శారాదాంబా అమ్మవారు

శృంగేరి శారాదాంబా అమ్మవారు

అద్వైతాన్ని దేశ వ్యాప్తం చేయతలపెట్టిన ఆది శంకరాచార్యులు తన సంచారంలో భాగంగా నిర్మించిన నాలుగు మఠాల్లో మొదటిదైన శారద మఠం ఉన్న ప్రదేశమే శృంగేరి. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూర్ జిల్లాలో తుంగ నది ఒడ్డున నిర్మితమైన ఈ చారిత్రక ప్రదేశంలో అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. 
శృంగేరీలో ఉన్న ఈ శంకర మఠాన్ని అక్కడ దక్షిణామ్నాయ మఠం అని పిలుస్తుంటారు. అద్వైత ప్రచారంలో భాగంగా దేశ సంచారం చేస్తున్న సమయంలో తొలి మఠాన్ని ఇక్కడ స్థాపించేలా ఆది శంకరాచార్యను ప్రేరింపించిన ఈ శృంగేరి చారిత్రకంగా ఎంతో ప్రధాన్యం సంతరించుకుంది.
*శృంగేరీ విశేషాలు*
శంకరాచార్యులు ధర్మ ప్రచారంలో భాగంగా పర్యటన జరపుతూ శృంగేరీ చేరుకున్న సమయంలో ఇక్కడ ఆయన కంటపడిన రెండు సంఘటనలు ఆయనకు ఆశ్చర్యాన్ని కల్గించాయట. దాంతో ఆయన ఇక్కడే తొలి మఠాన్ని నిర్మించి దాదాపు 12 ఏళ్లపాటు ఇక్కడే గడిపారని స్థల చరిత్ర చెబుతోంది.
శృంగేరీలో తొలి మఠాన్ని స్థాపించిన తర్వాతే ఆదిశంకురులవారు పూరి, బదరి, కంచి, ద్వారకల్లో మఠాలను నిర్మించారని చరిత్ర చెబుతోంది.
*శృంగేరీలోని వివిధ దర్శనీయ స్థలాలు*
శృంగేరి శారదా పీఠం
ప్రారంభంలో చెప్పినట్టు ఆదిశంకరులు మొదట నిర్మించిన మఠమే ఈ శృంగేరి శారదా పీఠం. కృష్ణ యజుర్వేదం అనేది ఈ మఠానికి ప్రధాన వేదం. ఈ మఠానికి పీఠాధిపతిగా వ్యవహరించేవారిని ఆదిశంకరాచార్యులతో సమానంగా భావించి సేవిస్తారు.
శారదాంబ దేవాలయం
జ్ఞానానికి ప్రతినిధి అయిన సరస్వతీ దేవి ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఇక్కడున్న శారదాదేవి విగ్రహం గురించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. శంకరాచార్యుల వారి ప్రియతమ శిష్యుల్లో ఒకరైన మండన మిశ్రుని భార్య అయిన ఉదయ భారతి శారదాదేవి ఆలయంలోని విగ్రహంగా మారిపోయిందని చెప్పబడుతోంది. ఈ ఆలయాన్ని శారద పీఠాధిపతులు నిర్వహిస్తుంటారు.
పాత దేవాలయం మొత్తం చెక్కతో నిర్మించబడగా అది అగ్ని ప్రమాదంలో నాశనం కాగా ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నూతనంగా నిర్మించారు.
విద్యాశంకర దేవాలయం
ఆదిశంకరులు స్థాపించిన శారదా శృంగేరి మఠానికి పీఠాధిపతిగా వ్యవహరించిన పదవ పీఠాధిపతి అయిన విద్యాశంకరు తీర్థుల స్మారకార్థం ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయ నిర్మాణంలో కన్పించే విభిన్నమైన శైలి చూపరులను ఆకట్టుకుంటుంది. ఈ దేవాలయంలోని స్ధంభాలపై చెక్కబడిన 12 రాశులుపై ఆయా సమయాల్లో సూర్యకిరణాలు పడేలా చెక్కడం అద్భుతం.
అలాగే ఈ ఆలయంలో చెక్కబడిన సింహం ఆకారాలు మనసుని ఆకట్టుకుంటాయి. ఈ శిల్పాల నోటిలో ఉన్న గోళాలలాంటి ఆకారాలు పడిపోతాయేమో అన్న భ్రాంతిని కల్గిస్తాయి.
*తుంగ నది*
నగరానికి కొద్ది దూరంలో ప్రవహించే ఈ నదినుంచే ఆలయానికి అవసరమైన నీటిని సేకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నదిపై విద్యాశంకర సేతువు అనే బ్రిడ్జిని నిర్మించారు. ఈ నదిని సందర్శించే వారు ఇందులో ఉండే చేపలకు ఆహార పదార్ధాలను వేస్తుంటారు.
*వసతి, రవాణా సౌకర్యాలు*
శృంగేరీలో ఉన్న శారదా పీఠంలో పర్యాటకులకు అవసరమైన వసతి సౌకర్యాలు లభిస్తాయి. కర్ణాటక రాష్ట్ర రాజధాని అయిన బెంగుళూరు నుంచి దాదాపు 350 కిలోమీటర్ల దూరంలో శృంగేరీ ఉంది. రైలు, బస్సు మార్గాల ద్వారా శృంగేరి చేరుకోవచ్చు.
*ఓం శ్రీ శారదా దేవ్యై నమః*

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts