ఆత్మ హృదయ గుహలో ఉన్నది. అంటే ఆత్మను హృదయ గుహ కప్పియున్నది. ఆత్మను కప్పిన పొరలు 5. అవే పంచకోశాలు లేదా స్ధూల శరీరం-ఇంద్రియాలు-ప్రాణాలు -మనస్సు-బుద్ధి అనే ఉపాధులు అని కూడా చెప్పవచ్చు. నిజంగా వీటికి వేరుగా ఒక చోట ఉండి పోలేదు ఆత్మ. వీటన్నిటికి శక్తిని-చైతన్యాన్ని ఇస్తూ వీటిని వ్యాపించి యున్నది. ఎందుకంటే ఆత్మ నిరాకారం , సర్వవ్యాపకం గనుక. కరెంటు ఫ్యానులాగా, కరెంటు బల్బులాగా రెండూ కలసియే ఉన్నాయి. వాటిని విచారణ ద్వారా విడదీయాలి. అలా విడదీసేందుకు విచారణ ఒక్కటే మార్గం. అలా వాటిని విడదీసి త్రోసివేయటానికే నేతి-నేతి అనే శాస్త్ర వాక్యాలు. అలా ఈ ఉపాధులు నేను కాదు-నేను కాదు అని వేరు చేసి త్రోసి వేసి-ఆత్మను తెలుసుకోవాలి.
ఎలా విచారణ చేయాలి ?
ఆత్మను కప్పి ఉంచిన ఉపాధులలో మొదటి పొర స్ధూల శరీరం లేదా అన్నమయ కోశం ఈ స్ధూలశరీరం కుండ మొదలైన వస్తువులలాగా ఒక రూపంతో ఉన్నది; వాటిలాగానే ఇది కూడా తయారైనది. పంచభూతాల పంచీకరణంతో తయారైనది. వాటిలాగానే ఎప్పుడో ఒకప్పుడు నశించిపోతుంది. కనుక ఆది అంతాలున్నాయి మరి - ఆత్మ స్ధూలమైనది కాదు; దానికి రూపం లేదు. తయారైనది కాదు. నశించేది కాదు. పుట్టుక చావు లేనిది. వికారాలు లేనిది. కనుక స్ధూల శరీరం ఆత్మ కావటానికి వీలులేదు. కనుక శరీరం నేను అనేందుకు వీలు లేదు. పైగా ఇది నా శరీరం అంటున్నాం. నా కుక్క అన్నప్పుడు నేను కుక్కను కానని, కుక్క కన్నవేరుగా ఉన్నానని, కుక్కకు యజమానినని మన అనుభవంలో ఎలా ఉన్నదో-అలాగే నా దేహం అన్నప్పుడు నేను దేహాన్ని కాదని, దేహం కన్న వేరుగా ఉన్నానని, దేహానికి యజమానినని తెలుస్తుంది. మనం ఒక వస్తువును చూస్తున్నాం అంటే ఆ చూడబడే వస్తువు చూచే నా కన్నా వేరుగా ఉన్నదని తెలుస్తూనే ఉంది. మరి నీ శరీరం నీ చేత చూడబడుతున్నది గనుక నీవు శరీరం కన్న వేరుగ ఉన్నట్లే. ఇలా మన అనుభవరీత్యా, యుక్తి రీత్యా కూడా నేను దేహం కన్న వేరుగా ఉన్నట్లు తెలుస్తున్నది కనుక నేను దేహం కాను. దీనినే మరల మరల విచారణ చేస్తూ ఉండాలి.
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో