న్యూఢిల్లీ మే 7
అసలే వ్యాక్సిన్లకు కొరత ఉంది. దీనికితోడు ఎంత ఆలస్యంగా ఇస్తే వ్యాక్సిన్ సామర్థ్యం అంత మెరుగ్గా ఉంటుందని చెబుతున్న అధ్యయనాలు. దీంతో కొవిషీల్డ్ రెండో డోసు తీసుకునే విరామాన్ని మరోసారి పెంచే ఆలోచన చేస్తోంది ఎక్స్‌పర్ట్ కమిటీ. దీనిపై వచ్చే వారం తుది నిర్ణయం తీసుకోనున్నారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తొలిసారి వచ్చినప్పుడు రెండో డోసును 4 నుంచి 6 వారాల మధ్య తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాత గత ఏప్రిల్‌లో ఇది 6-8 వారాల మధ్య అయితే వ్యాక్సిన్ మరింత మెరుగ్గా పని చేస్తుందంటూ కేంద్రం ప్రకటించింది.ఇప్పుడు ఆ సమయాన్ని మరింత పెంచే ఆలోచన చేస్తున్నారు. అదే జరిగితే ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో తయారీదారులపై ఒత్తిడి కాస్తయినా తగ్గే అవకాశం ఉంటుంది. గత మార్చి నెలలో లాన్సెట్‌లో ఓ అధ్యయనాన్ని ప్రచురించారు. దాని ప్రకారం కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను 12 వారాల తర్వాత తీసుకుంటే సామర్థ్యం 81.3 శాతంగా ఉన్నట్లు గుర్తించారు. అదే ఆరు వారాలలోపు తీసుకుంటే మాత్రం సామర్థ్యం 55.1 శాతంగా మాత్రమే ఉందని పరిశోధకులు వెల్లడించారు.ఇక బ్రిటన్, బ్రెజిల్‌లలో జరిగిన చివరి దశ ట్రయల్స్‌లో వ్యాక్సిన్ సామర్థ్యం 90 శాతం దాకా ఉంటున్నట్లు తేలింది. అయితే అది జరగాలంటే ముందు సగం డోసు ఇచ్చి నెల తర్వాత మొత్తం డోసు ఇవ్వాల్సి ఉంటుందని ఈ ట్రయల్స్ తేల్చాయి. ఇక ఇప్పటికే యూకే, కెనడాలాంటి దేశాలు 12 వారాలు, 16 వారాల తర్వాత రెండో డోసు ఇస్తున్నాయి. రెండో డోసుల మధ్య ఎక్కువ సమయం ఉంటే మెరుగైన ఫలితాలు వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.ఇండియాలోనూ ఇదే అమలు చేస్తే వ్యాక్సిన్ల కొరతను కాస్తయినా అధిగమించే వీలుంటుంది. రెండో డోసు తీసుకునే వాళ్లు మరికొంత ఎక్కువ కాలం వేచి ఉండాల్సి రావడంతో ఆ మేరకు మరికొంత మందికి తొలి డోసు వేసే అవకాశం దక్కుతుంది. ఇలా వ్యాక్సిన్ల కొరతకు కాస్త చెక్ పెట్టవచ్చు. ఎక్కువ గ్యాప్ తర్వాత రెండో డోసు తీసుకుంటే ఎక్కువ రక్షణ ఉండటంతోపాటు ఆ లోపు కనీసం ఒక్క డోసు తీసుకున్న వారు కాస్తయినా సురక్షితంగా ఉంటారు. ఇలా రెండు రకాలుగా ఇది ఉపయోగపడనుంది.