కర్నూలు, మే 8,
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కర్నూలు నుంచి కరోనా N 440 K వైరస్ ప్రబలిందని చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు అందిందని, దీనిపై కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఫకీరప్ప మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యవహారంలో చంద్రబాబుకు నోటీసులు ఇస్తామని వెల్లడించారు. ఆదివారం చంద్రబాబుకు నోటీసు ఇచ్చి 7 రోజుల్లోపు హాజరు కావాలని కోరుతామని స్పష్టం చేశారు. అలాగే ఈ వ్యవహారంపై శాస్త్రీయంగా దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చంద్రబాబు అరెస్టుపై దర్యాప్తు అధికారి తగిన నిర్ణయం తీసుకుంటారని ఎస్పీ డా.ఫక్కీరప్ప పేర్కొన్నారు.కాగా, చంద్రబాబు నాయుడుపై కర్నూలులో క్రిమినల్ కేసు నమోదైన విషయం తెలిసిందే. కర్నూలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ న్యాయవాది సుబ్బయ్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కర్నూలు జిల్లా పోలీసులు వెల్లడించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబునాయుడు కరోనాపై చేస్తున్న దుష్ప్రచారం వల్లే కర్నూలులో సామాన్య జనం భయాందోళనకు గురవుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.కర్నూలు నుంచే కరోనా N 440 K వైరస్ ప్రబలిందన్న చంద్రబాబు వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని సుబ్బయ్య ఆరోపించారు. న్యాయవాది సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చంద్రబాబు నాయుడుపై Cr.No. 80/2021 ప్రకారం.. ఐపీసీ 155, 505(1)(బి)(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చంద్రబాబుపై 2005 ప్రకృతి వైఫరీత్యాల చట్టంలోని సెక్షన్ 4 కింద నాన్‌బెయిల్ కేసు నమోదు చేశామని కర్నూలు పోలీసులు తెలిపారు.