ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ మధ్య తన ఢిల్లీ టూర్ మధ్యలోనే వెనక్కి వచ్చారని ప్రచారం జరిగింది.అయితే నరసింహన్ మాత్రం తన ఢిలీ పర్యటన లక్ష్యం పూర్తి చేసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం ముఖ్యంగా ఆయన తన పర్యటనలో పోలవరం ప్రాజెక్టు కారణంగా నిర్వాతులయ్యే రైతులకు ఇఛ్చే పరిహారంలో జరిగిన అక్రమాలకు సంబంధించి సమగ్ర నివేదికను కేంద్రానికి అందజేశారు. ఈ అక్రమాల్లో కొంత మంది మీడియా అధిపతులతోపాటు..భారీ ఎత్తున మీడియా ప్రతినిధులు కూడా భాగస్వామ్యులు అయిన విషయాన్ని ఆయన నివేదికలో ఇచ్చినట్లు తెలిస్తుంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా పోలవరం ప్రాంతానికి వెళ్ళి అక్కడి అక్రమాల వివరాలు సేకరించి..వార్తలు ప్రసారం చేయకుండా ఉన్న విషయంతోపాటు…అమరావతి కేంద్రంగా సాగిన వ్యవహారాలను కూడా గవర్నర్ తన నివేదికలో పూసగుచ్చినట్లు కేంద్రానికి అందజేశారు.ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో జరిగిన అక్రమాలపై ఆయన ఫోకస్ పెట్టారు. అమాయకులైన గిరిజనులను అడ్డం పెట్టుకుని కొంత మంది రాజకీయ నేతలు, అధికారులు, మీడియా ప్రతినిధులు సాగించిన వ్యవహారాలు గవర్నర్ దృష్టికి వెళ్లాయి. గిరిజన ప్రాంతాల్లో సాగిన ఈ అరాచకాలపై గవర్నర్ దృష్టి పెట్టారు. వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని అధికారులు..రాజకీయ నేతలు ఇష్టారాజ్యంగా దోపిడీ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక్క పోలవరం భూసేకరణ పరిహారం విషయంలోనే వందల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై విచారణ జరిగితే పలు అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.