YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్*

*ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్*

కోవిడ్  రెండవ వేవ్ తో తీవ్ర  ప్రాణ హాని ఏర్పడిన రోగుల ప్రాణాల సంరక్షణార్దము, రోగుల ప్రాణధార మరియు ప్రస్తుత పరిస్థితులలో అత్యంత విలువైన వనరు గా మారిన ఆక్సిజన్  యొక్క సేకరణ, రవాణా మరియు వినిమయ నిర్వహణకు సంబందించి  స్టేట్  ఆక్సిజన్ వార్ రూమ్  (SOWR)ను  ఏర్పాటు చేసినది,  రాష్ట్ర ప్రభుత్వం.(Covid Instant Order 119) అలాగే ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు, సరఫరాకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.310 కోట్లు కేటాయిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 49 చోట్ల ఆక్సిజన్‌ ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 50 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్ల వాహనాలను కొనుగోలు చేయాలని ఆదేశించింది. 10 వేల అదనపు ఆక్సిజన్‌ పైప్‌లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్లాంట్ల నిర్వహణకు ప్రతి జిల్లాకు వచ్చే ఆరు నెలలకు రూ.60 లక్షలు మంజూరు చేసింది. కోవిడ్ రెండవ వేవ్ విస్తృతంగా వ్యాపించడము వలన కోవిడ్ బారిన పడిన వ్యక్తుల చికిత్సకు సంబందించి  ఆక్సిజన్ అనేది  రోగుల యొక్క  ప్రాణాలు కాపాడే అత్యంత విలువైన వనరుగా మారింది. రాష్ట్రం లో  నెలకొల్పబడిన కోవిడ్ హాస్పిటల్స్ నందు సమయానికి ఆక్సిజన్ అందక మృత్యువాత పడుతున్న  రోగులను దృష్టిలో  పెట్టుకున్న రాష్ట్ర  ప్రభుత్వం, రోగుల యొక్క ప్రాణధార అయిన ఆక్సిజన్ ను సేకరించడం, రవాణా చేయడం,  వినియోగించడం మరియు తిరిగి నింపడం  అనే అంశాలు వ్యక్తుల యొక్క ప్రాణాలు కాపాడడం లో అత్యంత కీలక మైనవి గా  భావించి వాటిని ఒక నిర్దిష్టమైన విధానం లో పకడ్బందీగా  నిర్వహించడం, అమలుపరచడం ద్వారా  రోగుల యొక్క అమూల్యమైన  ప్రాణాలు కాపాడే లక్ష్యం తో  రాష్ట్ర స్థాయి లో స్టేట్ ఆక్సిజన్ వార్ రూమ్ (SOWR)ను  తక్షణమే  ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేసి విధులు కేటాయించడం  జరిగింది. ప్రభుత్వం సూచించిన దిశానిర్దేశం ప్రకారం *స్టేట్ ఆక్సిజన్(SOWR) వార్ రూమ్* నమూనా గా తీసుకుని జిల్లా స్థాయి లో *డిస్టిక్ ఆక్సిజన్ వార్ రూమ్(DOWR)* ను ఏర్పాటు చేస్తారు. ఈ కేంద్రాల  యొక్క ముఖ్య ఉద్దేశ్యం రాష్ట్రం నుండి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుండి జిల్లా లో ఉన్న  ఆసుపత్రులకు, ఆసుపత్రుల నుండి ఆక్సిజన్ రీఫిల్లింగ్ కేంద్రాలకు, రీఫిల్లింగ్ కేంద్రాల నుండి తిరిగి రోజువారీ మరియు  గంటల చొప్పున వినియోగించే  ఆసుపత్రులకు సరఫరా చేసే సమయం లో  ఎటువంటి ఆటంకాలు  లేకుండా  ఆక్సిజన్ యొక్క సరఫరా అనేది నిరంతరాయంగా అందించి నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. *స్టేట్ ఆక్సిజన్ వార్ రూమ్(SOWR) యొక్క నిర్మాణం మరియు దాని భాద్యతలు.* స్టేట్ ఆక్సిజన్ వార్ రూమ్ రాష్ట్ర స్థాయిలో ఉత్పత్తి అయ్యే మెడికల్ ఆక్సిజన్ ను నిలవచేయడం, అవసరాల అనుగుణముగా  జిల్లా కేంద్రాలకు రవాణా మరియు పంపిణీ చేయడం, సరఫరా చేసిన ఆక్సిజన్ యొక్క వినియోగాన్ని  పర్యవేక్షించడం, తిరిగి నింపడం అనే  బాధ్యతలను  స్టేట్ ఆక్సిజన్ వార్ రూమ్ తీసుకుంటుంది. ఈ యొక్క స్టేట్ ఆక్సిజన్ వార్ రూమ్ అనేది రవాణా, రోడ్లు మరియు  భవనాల శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శ్రీ కృష్ణ బాబు మరియు  శ్రీ షాన్ మోహన్.lAS గారి మార్గదర్శకత్వం మరియు పర్యవేక్షణలో పనిచేస్తుంది. ఏర్పాటు చేయబడ్డ స్టేట్ వార్ రూమ్ లో సహాయక సిబ్బంది ద్వారా నిర్వహించబడే రోజువారీ అన్ని కార్యకలాపాల యొక్క పర్యవేక్షణకు గాను రొటేషన్ పద్దతిలో వివిధ విభాగాలకు చెందిన IAS / IPS అధికారులను సైతం నియమించడం జరిగింది. స్టేట్ వార్ రూమ్ లో పరిశ్రమల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, రవాణా శాఖ, రెవెన్యూ మరియు విపత్తుల  నిర్వహణ విభాగం, పోలీస్ మరియు ఐటీ శాఖల నుండి నోడల్ అధికారులు ఉంటారు. రాష్ట్ర స్థాయిలో జరిగే  కార్యకలాపాలు అన్నింటినీ  సమన్వయం చేయడానికి, అవసరపడిన వారికి మరియు ప్రజలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడానికి  24x7 పనిచేసేలా హెల్ప్‌ లైన్ సైతం ఏర్పాటు చేయబడింది. 
* *పరిశ్రమల శాఖ** 
05 మే 2021 న భారత  ప్రభుత్వం జారీ చేసిన ఆక్సిజన్ కేటాయింపు ఉత్తర్వులు అనుసరించి పరిశ్రమల శాఖ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల వద్ద ఉత్పత్తి అయ్యే మొత్తం మెడికల్ ఆక్సిజన్  ఉత్పత్తిని మరియు సరఫరాను సమన్వయం చేస్తుంది. అంతేకాకుండా రాష్ట్రం లో అందుబాటులో ఉన్న మరియు ఉత్పత్తి అయ్యే మొత్తం  ఆక్సిజన్‌ యొక్క పరిమాణం నిర్ధారించడానికి పరిశ్రమల  విభాగం బాధ్యత వహిస్తుంది. ఆక్సిజన్ ఉత్పత్తి చేసే అన్నీ కేంద్రాలను మరియు మూతపడిన పరిశ్రమలను తిరిగి తెరిపించి వాటిలో ఉత్పత్తి ప్రారంభించేలా సహకరించి,  వాటన్నిటినీ ఆక్సిజన్ సరఫరా గొలుసుకు అనుసంధానించడం  ద్వారా రాష్ట్రం లో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్ధ్యంను  పెంచడం, ఉత్పత్తిదారుల దగ్గర నుండి నిల్వ చేసే యూనిట్లకు, అక్కడి నుండి ఆసుపత్రుల పంపిణీకి  బాధ్యత వహిస్తుంది పరిశ్రమల్లో వాడే పారిశ్రామిక రకం సిలిండర్లు అయిన D మరియు B రకం సిలిండర్‌లను మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లు గా మార్చడం, ఫిల్లింగ్ నుండి ఆసుపత్రి వినియోగం వరకూ  జరిగే  ప్రతి దశని పకడ్బందీగా గమనించి నిర్వహిస్తుంది.
*రెవెన్యూ మరియు విపత్తుల నిర్వహణ శాఖ.* 
జిల్లా కేంద్రాలలో ఏర్పడే ఆక్సిజన్  అవసరాలు అనుసరించి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ వాహనాల కేటాయింపు కు రెవెన్యూ మరియు విపత్తుల నిర్వహణ శాఖ బాధ్యత వహిస్తుంది. ప్రతి జిల్లాలో ఏర్పడే లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ యొక్క డిమాండ్ ను శాస్త్రీయంగా విశ్లేషించి పరిగణనలోకి తీసుకుని, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(RINL) ద్వారా  ఒరిస్సా, తమిళ నాడు మరియు కర్ణాటక రాష్ట్రాలలో నెలకొల్పబడిన  ఆక్సిజన్  ఉత్పత్తి కేంద్రాలు నుండి భారత ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి  కేటాయించిన ఆక్సిజన్ కేటాయింపులు వ్యవహారాలు ఈ శాఖ నిర్ధారిస్తుంది మరియు నిర్వహిస్తుంది. అస్పష్టతకు మరియు దుర్వినియోగం కు  అవకాశం ఉండదు కాబట్టి ఇది అత్యంత కీలకమైన కార్యాచరణ గా భావించి నిర్వహించవలసి ఉంటుంది.
*రవాణా శాఖ*
రవాణా శాఖ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను అవసరమైన చోటుకి సురక్షితముగా రవాణా చేయుటకు బాధ్యత వహిస్తుంది. రాష్ట్రం లో ఆక్సిజన్ కొరత లేకుండా చూడడానికి ఆక్సిజన్ సరఫరా కు సాధ్యమైనంత వరకూ వినియోగానికి అనుగుణముగా  లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ రవాణా చేసే  క్రయోజనిక్ వాహనాలను సమకూర్చడం, తద్వారా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ప్రొడక్షన్ పాయింట్ల వద్ద వేసి ఉండే సమయము, మరియు తిరిగి నింపే  సమయాన్ని తగ్గించడానికి బాధ్యత తీసుకుంటుంది. అంతే కాకుండా ఖాళీ ట్యాంకర్లను ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల వద్ద తిరిగి నింపడానికి ఉత్పత్తి కేంద్రాల వద్దకు వేగం గా చేర్చడానికి విమానాల ద్వారా ఎయిర్  లిఫ్టింగ్ చేయడం, తిరిగి నింప బడిన ట్యాంకర్లను త్వరగా రాష్ట్రానికి రప్పించడానికి రైల్వే మార్గం ఉపయోగించుకొనుటకు గాను ఎప్పటికప్పుడు సంబంధిత శాఖతో సంప్రదింపులు చేయడం వంటి పనులకు బాధ్యత వహిస్తుంది.
*పోలీసు శాఖ*
పోలీసు శాఖ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్(LMO)  వాహనాలు గమ్యం చేరే వరకూ  పోలీసు కాన్వాయ్‌తో తగిన రక్షణ కల్పిస్తుంది. LMO వాహనాలు రాష్ట్రం లోపల మరియు వెలుపల ప్రయాణించే సందర్భం లో వాటి ప్రయాణం లో ఎట్టి ఆటంకాలు కలగకుండా గ్రీన్ కారిడార్ సైతం ఏర్పాటు చేస్తుంది. ఆక్సిజన్ ను తిరిగి నింపు కోవడానికి వెళ్ళే ఖాళీ LMO వాహనాల కు సైతం  పోలీసు శాఖ ఇదే ప్రోటోకాల్ ను పాటించి నిర్వహిస్తుంది.
*వైద్య మరియు ఆరోగ్య శాఖ*
వైద్య మరియు ఆరోగ్య శాఖ  మౌలిక సదుపాయాలకు సంబంధించి అనగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో  అందుబాటులో ఉన్న మొత్తం ఆక్సిజన్ పడకల సంఖ్య, పడకల యొక్క  రోజువారీ ఆక్యుపెన్సీ, ఆక్సిజన్ పడకల యొక్క రోజువారీ  వినియోగం మరియు ఆక్సిజన్ యొక్క రోజువారీ  అవసరాలు వంటి సమాచారం  మొత్తం సంకలనం చేసి పంచుకుంటుంది.  అంతే కాకుండా ఎప్పటికప్పుడు  ప్రస్తుత ఆక్యుపెన్సీ స్థితి,  ఆక్సిజన్ వినియోగం మరియు ఆక్సిజన్ అవసరం కు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని అంచనా వేసి  నిర్ధారిస్తుంది, వైద్య మరియు ఆరోగ్య శాఖ  లో ఆక్సిజన్ యొక్క సరఫరా గొలుసు నిర్వహణను పర్యవేక్షించడానికి నోడల్ ఏజెన్సీ గా ఔషధ నియంత్రణ విభాగం నుండి ప్రతినిధులు ఉంటారు. 
*ఐటీ శాఖ*
ఇది స్టేట్ ఆక్సిజన్ వార్ రూమ్  కు మరియు డిస్టిక్ ఆక్సిజన్ వార్ రూమ్ కు మధ్య జరిగే ఆక్సిజన్ మేనేజ్‌మెంట్ మాడ్యూల్  అనగా ఉత్పత్తి కేంద్రం నుండి  వినియోగ ప్రదేశం వరకూ  చేపట్టే కార్యక్రమాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయముగా నిర్వహించేందుకు  తగిన సాంకేతిక సహాయ సహకారం అందిస్తుంది. ఈ విభాగం అన్ని ఉత్పత్తి పాయింట్ల నుండి ఆక్సిజన్ ను నింపుకుని రవాణా చేసే వాహనాలను వాటి మార్గం లో GPS / GIS మ్యాపింగ్‌ ద్వారా ప్రతిక్షణం కనిపెట్టి  నిర్ధారించడానికి తగిన సాంకేతిక సహకారం తో పాటు కోవిడ్ విపత్కాల సమయంలో ఆక్సిజన్ నిర్వహణకు సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించడం, విశ్లేషించడం మరియు దానికి అనుగుణముగా  ఆరోగ్య సదుపాయాలకు మెడికల్ ఆక్సిజన్ నిరంతరాయంగా సరఫరా పర్యవేక్షణ కు తగిన సాంకేతిక సహకారం అందిస్తుంది. 
*డిస్ట్రిక్ట్ ఆక్సిజన్ వార్ రూమ్(DOWR) యొక్క నిర్మాణం మరియు దాని భాద్యతలు.*
ప్రభుత్వం సూచించిన దిశానిర్దేశం ప్రకారం స్టేట్ ఆక్సిజన్(SOWR) వార్ రూమ్ నమూనా గా తీసుకుని జిల్లా స్థాయి లో డిస్టిక్ ఆక్సిజన్ వార్ రూమ్(DOWR) ను ఏర్పాటు చేస్తారు. డిస్ట్రిక్ట్ వార్ రూమ్ లో పరిశ్రమల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, రవాణా శాఖ, రెవెన్యూ మరియు విపత్తుల  నిర్వహణ విభాగం, పోలీస్ మరియు జిల్లా సమాచార శాఖల నుండి నోడల్ అధికారులు ఉంటారు. 
*జిల్లా పరిశ్రమల శాఖ*
జిల్లా పరిశ్రమల శాఖ విభాగం జిల్లాలో పూర్తి సామర్థ్యాలతో పనిచేసే ఎయిర్ సెపరేషన్ యూనిట్స్ ను మరియు  ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే లేదా సరఫరా చేసే  ఇతర అనుబంధ పరిశ్రమలను అన్నింటినీ గుర్తించాలి. అలా గుర్తించబడిన ప్రతి యూనిట్‌కు ఒక నోడల్ అధికారిని  నియమించి ఆ వివరాలను ది 10.05.2021 లోపు  స్టేట్ ఆక్సిజన్ వార్ రూమ్(SOWR)కు తెలియచేయాలి.
*వైద్య మరియు ఆరోగ్య శాఖ*
ఆరోగ్య శాఖ జిల్లాలో ఉన్న ప్రతి ఆసుపత్రిలో గల  ఆక్సిజన్ పడకల  యొక్క ఆక్యుపెన్సీ,ఐసియు పడకలు మరియు వెంటిలేటర్ ల యొక్క ప్రస్తుత పరిస్థితి  మరియు వాటియొక్క యొక్క రోజువారీ ఆక్సిజన్ అవసరాల వివరాలు సేకరించి లెక్కించాలి. ఆక్సిజన్ వినియోగ అంచనా అనేది కోవిడ్ మునుపటి పోకడలలో మరియు రాబోయే రెండు వారాలలో నమోదు అయ్యే కేసుల సంఖ్య ఆధారం చేసుకుని వేయాలి. ప్రస్తుత ఆక్సిజన్ వినియోగ రేటు మరియు ప్రస్తుత వినియోగ అంచనా సమాచారం  స్టేట్ వార్ రూమ్ మరియు ఇతర వాటాదారులతో పంచుకోవాలి. పడకల సంఖ్య పెంచాల్సిన సందర్భం ఏర్పడినపుడు  ఆక్సిజన్ యొక్క అందుబాటు మరియు  సరఫరా యొక్క అంచనా వేసిన తరువాత మాత్రమే పెంచవలసి ఉంటుంది, మరియు సదరు విషయం స్టేట్ ఆక్సిజన్ వార్ రూమ్ (SOWR) కు అత్యవసరముగా తెలియచేయాలి. ప్రతి కోవిడ్ కేంద్రములో  "ఆక్సిజన్ సేవర్స్" అనే శిక్షణ పొందిన బృందాన్ని ఏర్పాటు  చేయాలి. వీరు ఆసుపత్రి, వార్డ్ మరియు రోగి స్థాయిలో ఆక్సిజన్ యొక్క వినియోగ పర్యవేక్షణను నిర్వహించవలసి ఉంటుంది. ఈ కార్యక్రమం నిర్వహణకు ఇతర నర్సు లేదా సాంకేతిక నిపుణుడు ను ఉపయోగించకూడదు. ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యతను అనుసరించి దాని యొక్క సరియైన వినియోగము పరిరక్షణ కార్యాచరణ నిర్వహణ  కోసం ఈ ప్రత్యేక బృందం తప్పనిసరిగా ప్రతి కోవిడ్ కేంద్రము లో ఏర్పాటు చేయాలి.  ప్రతి కోవిడ్ సెంటర్‌ లో ఇటువంటి "ఆక్సిజన్ సేవర్స్" బృందాలను  నియమించి సంబంధిత వివరాలు స్టేట్ ఆక్సిజన్ వార్ రూమ్  SOWR కి ది10.05.2021 లోపు తెలియజేయాలి. నియమించబడిన ఆక్సిజన్ సేవర్స్ ఏదైనా ఆసుపత్రి లో ఉన్న ఆక్సిజన్‌ బెడ్  నిమిషానికి సగటున 20 లీటర్ల గరిష్ట పరిధిలో వినియోగం ఉండేలా చూడాలి. ఏదైనా ఆసుపత్రి లో ఉన్న ఆక్సిజన్‌ బెడ్  నిమిషానికి సగటున 20 లీటర్ల కంటే అదనముగా వినియోగిస్తున్నట్లు  గమనించిన చో అక్కడ ఆక్సిజన్ దుర్వినియోగం అవుతుందని గ్రహించాలి. ఆసుపత్రుల యందు ఉన్న స్టోరేజ్ ట్యాంకు లలో ఉన్న LMO స్థాయిలను, సిలిండర్ల లభ్యత, సిలిండర్ల తిరిగి నింపడం వంటి కార్యక్రమాలు  తనిఖీ చేయడానికి, DOWR ద్వారా  నిరంతర పర్యవేక్షణలో ఉంచడానికి  ఒక నోడల్ అధికారి ని నియమించి సంబంధిత వివరాలు SOWR కు ది. 10.05.2021 లోపు పంపించవలసి ఉంటుంది.
*రవాణా శాఖ*
LMO వాహనము ఆక్సిజన్ ఉత్పత్తి పాయింట్ల నుండి సంబంధిత జిల్లాలకు చేరేవరకు ఆ వాహనాలను SOWR చే అభివృద్ధి చేయబడిన GPS ట్రాకింగ్ వ్యవస్థ ఉపయోగించుకుని ట్రాక్ చేయడం, క్షేమంగా చేర్చడం కోసం రవాణా శాఖ బాధ్యత తీసుకుంటుంది. LMO వాహనము నకు డ్రైవర్ అవసరపడే సందర్భాలలో DOWR రవాణా శాఖ లో పనిచేసే వ్యక్తి ని డ్రైవర్ గా నియమిస్తుంది. SOWR నుండి తగిన సూచన లు లేకుండా LMO తరలించే వాహనాలను మళ్ళించడం ఆపడం వంటివి చేయకూడదు. LMO ను జిల్లా స్థాయి లో రవాణా చేయుట కొరకు తగినన్ని ఆక్సిజన్ రవాణా వాహనాలను సిద్దంగా ఉన్నాయని నిర్ధారించాలి. ఉత్పత్తి కేంద్రాల నుండి జిల్లాలకు LMO ను రవాణా చేసే వాహనాలకు జిల్లాలో రెండు కంటే ఎక్కువ దిగుమతి  పాయింట్ల ను కేటాయించకూడదు. ఈ కార్యక్రమాలు సవ్యముగా నిర్వహించుటకు గాను  రవాణా శాఖ నుండి ఒక నోడల్ అధికారిని నియమించి సంబంధిత వివరాలు SOWR కు ది. 10.05.2021 లోపు పంపించవలసి ఉంటుంది. 
*రెవెన్యూ శాఖ*
LMO రీఫిల్లర్స్ మరియు హాస్పిటల్స్ వంటి తుది వినియోగ పాయింట్లలో వినియోగించే ఆక్సిజన్ అవసరాలకు అనుగుణముగా ఆరోగ్య శాఖ నుండి వచ్చిన డిమాండ్ ను అనుసరించి LMO సిలిండర్లు కేటాయింపులకు సంబందించి రెవెన్యూ శాఖ బాధ్యత వహిస్తుంది. జిల్లాల పరిధిలో తిరిగే  వాహనం నింపు కోవడం, దిగుమతి చేయడం వంటి కార్యక్రమాలు గరిష్టం గా  4 గంటలు లోపు జరిగేలా జిల్లా లోపల దిగుమతి కేంద్రాలను రెండుకు పరిమితం చేయడం, తగినన్ని లాజిస్టిక్స్ కేటాయింపుల ప్రణాళికకు  రెవెన్యూ శాఖ బాధ్యత వహిస్తుంది.జిల్లాలోకి  వచ్చే LMO సరియైన వినియోగదారుడికి  చేరుకునేలా చూడవలసిన  బాధ్యత రెవెన్యూ శాఖకు ఉంటుంది. అలాగే LMO ను ఉత్పత్తి చేసే  యాజమాన్యంతో సంబంధం లేకుండా జిల్లాలో ఆక్సిజన్ అవసర పడిన ఆసుపత్రులకు, రీ ఫిల్లింగ్ కేంద్రాలకు రేషన్ ప్రకారం అందచేయవలసి ఉంటుంది. రెవెన్యూ శాఖ లో ఈ కార్యక్రమాల నిర్వహణకు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని  నియమించి సంబంధిత వివరాలను SOWR కు ది. 10.05.2021 లోపు పంపించవలసి ఉంటుంది.
*పోలీసు శాఖ*
పోలీసు శాఖ LMO ను రవాణా చేసే వాహనాలు  జిల్లా లోపల మరియు వెలుపల చేసే  ప్రయాణానికి ఎట్టి ఆటంకాలు కలుగ కుండ బాధ్యత వహిస్తారు. విశాఖపట్నం,  కర్నాటక లోని బళ్ళారి, తమిళనాడు లోని చెన్నై  వద్ద గల ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల నుండి జిల్లాలకు వాహనాల ద్వారా సజావుగా తరలింపు కోసం తగిన ఎస్కార్ట్ కల్పించి బాధ్యత వహిస్తారు.
ఈ కార్యకలాపాలు అన్నింటినీ సమర్ధవంతంగా నిర్వహించుటకు గాను  డిఎస్పీ ర్యాంక్ అధికారిని  నోడల్ అధికారిగా నియమించి సంబంధిత వివరాలను SOWR కు ది. 10.05.2021 లోపు పంపించవలసి ఉంటుంది జిల్లా యొక్క జిల్లా సమాచార కేంద్రం ఆక్సిజన్ మేనేజ్‌మెంట్ మాడ్యూల్ కు సంబందించి  SOWR తీసుకునే నిర్ణయాలు, చేపట్టే చర్యలు ఎప్పటికప్పుడు గ్రహించడం సంబంధిత  సమాచారాన్ని పంచుకోవడం,మరియు  జిల్లా  స్థాయిలో నిర్వహించే కార్యక్రమాలు ఎప్పటికప్పుడు SOWR కు  నివేదించడానికి బాధ్యత వహిస్తుంది. 
*ఆక్సిజన్ నిర్వహణ కోసం సూచించబడిన ప్రామాణిక కార్యనిర్వాహక విధానాలు*
స్టేట్ ఆక్సిజన్ వార్ రూమ్ (SOWR) జిల్లాలకు పంపించే  అన్ని వాహనాల యొక్క ట్రాకింగ్‌ కొరకు GPS సిస్టమ్ లాగిన్‌ వివరాలను సకాలంలో పంచుకుంటుంది. వైజాగ్ / బళ్లారి వద్ద నుండి జిల్లాలకు వెళ్ళే వాహనాలకు తగిన పోలీసు ఎస్కార్ట్ ఖచ్చితముగా కల్పించాలి. అవసరమైన సందర్భాల్లో సు శిక్షితుడైన  ఒక వ్యక్తిని మాత్రమే డ్రైవర్‌గా నియమించి  నామినేట్ చేయండి. ఏ జిల్లా అయినా డ్రైవర్‌ను బహుళ సంఖ్యలో పిలవకూడదు నామినేట్ చేయకూడదు. SOWR నుండి అందిన అభ్యర్థన మేరకు సంబంధిత జిల్లాలు LMO రవాణా చేసే వాహనాలకు గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలి. SOWR నుండి సరైన సూచన మరియు ఆదేశాలు లేకుండా LMO రవాణా చేసే వాహనాలను మళ్ళించడం, ఆపడము వంటివి ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. LMO రవాణా చేసే వాహనాల డ్రైవర్లు తో పోలీసులను చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని మరియు వాళ్ళని బెదిరించడం వంటి పనులు చేయకూడదని అభ్యర్దించడమైనది.
*LMO రవాణా వాహనం నుండి దిగుమతి కార్యక్రమం నిర్వహణ.*
నింపు కోవడం జిల్లాల్లో కేటాయించిన కేంద్రాల్లో దిగుమతి చేయడం తిరిగి నింపు కోవడానికి సిద్ధపడడం ఇదంతా జిల్లాలో నిర్వహించడానికి సంబంధిత వాహనానికి    గరిష్టంగా 4 గంటలు నిర్దేశించడం జరిగింది. జిల్లాలో ఒక LMO రవాణా వాహనం నుండి దిగుమతి చేసుకునే కేంద్రాలు కనిష్టం గా అనగా రెండుకు మించి ఉండకుండా నిర్వహించాలి. దానికి సంబంధించిన  సమాచారం కొంత క్లిష్టమైన దిగా భావించవచ్చు. జిల్లాలో ఏర్పాటు చేయబడిన DOWR కు  జిల్లాలోకి వచ్చిన MLO  సరైన వినియోగదారుని చేరేలా  చూడవలసిన  బాధ్యత ఉంది LMO ను ఉత్పత్తి చేసే యాజమాన్యంతో సంబంధం లేకుండా జిల్లాలో ఆక్సిజన్ అవసర పడిన ఆసుపత్రులకు, రీ ఫిల్లింగ్ కేంద్రాలకు రేషన్ ప్రకారం అందచేయవలసి ఉంటుంది. 
*హాస్పిటల్ స్థాయిలో ఆక్సిజన్ సరైన నిర్వహణకు  సూచించిన సలహాలు.*
ఆక్సిజన్ యొక్క సరఫరాను అంచనా వేసిన తరువాత మాత్రమే ఆసుపత్రిలో పడకలు పెంచబడాలి. ఆసుపత్రిలో అవసరమైన పడకల పెరుగుదల గురించి SOWR కు సమాచారం ఇవ్వడం అనేది అత్యవసరము. ప్రతి కోవిడ్ కేంద్రములో  తగు  శిక్షణ పొందిన వ్యక్తిని  ఏర్పాటు  చేయాలి. ఇతను ఆసుపత్రి, వార్డ్ మరియు రోగి స్థాయిలో ఆక్సిజన్ యొక్క వినియోగ పర్యవేక్షణను నిర్వహించవలసి ఉంటుంది. ఈ కార్యక్రమం నిర్వహణకు ఇతర నర్సు లేదా సాంకేతిక నిపుణుడు ను ఉపయోగించకూడదు. ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యతను అనుసరించి దాని యొక్క సరియైన వినియోగము పరిరక్షణ కార్యాచరణ నిర్వహణ  కోసం తగు  శిక్షణ పొందిన వ్యక్తిని  తప్పనిసరిగా ప్రతి కోవిడ్ కేంద్రము లో ఏర్పాటు చేయాలి. జిల్లాలో ఉన్న ప్రతి ఆసుపత్రి యొక్క సామర్ధ్యాన్ని నిర్ధారించడానికి రోజు వారిగా అది సేకరించే  ఆక్సిజన్,రోజువారీ మరియు బెడ్ వారీగా వాడకము మరియు  మిగులు వంటి విషయాలను సంబంధిత ఇన్ చార్జ్ జేసీ తో సమీక్షించబడుతుంది. జిల్లాలలోని ప్రతి ఆసుపత్రి నిమిషానికి 20 లీటర్లు  కంటే తక్కువ వినియోగాన్ని సూచించడము జరిగినది. ఈ సగటును మించి  ఏ ఆసుపత్రి నిర్వహించినా అది దుర్వినియోగముగా పరిగణించడం జరుగుతుంది. ఆసుపత్రుల యందు ఉన్న స్టోరేజ్ ట్యాంకు లలో ఉన్న LMO స్థాయిలను, సిలిండర్ల లభ్యత, సిలిండర్ల తిరిగి నింపడం వంటి కార్యక్రమాలు  తనిఖీ చేయడానికి, DOWR ద్వారా  నిరంతర పర్యవేక్షణలో ఉంచడానికి  ఒక నోడల్ అధికారి ని నియమించాలి. రాష్ట్ర ప్రభుత్వము చాలా పకడ్బందీ గా ఆక్సిజన్ సరఫరాకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. మన భాద్యతగా ఇంట్లో ఉందాము .
కుటుంబాన్ని సురక్షితం గా ఉంచుకొందాము!!!
డాక్టర్ శ్రీకాంత్ అర్జా
ఏపీ స్టేట్ covid నోడల్ అధికారి

Related Posts