విశాఖపట్నం
దేశంలో విజృంభిస్తున్న కోవిడ్–19 సెకండ్ వేవ్పై జరుగుతున్న సమరంలో భారత నౌకాదళం ఓ అడుగు ముందు కేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని పట్టి పీడిస్తున్న ఆక్సిజన్ కొరతని అధిగమించేందుకు తన వంతు ప్రయత్నం ప్రారంభించింది. సముద్రసేతు–2లో భాగంగా సింగపూర్ నుంచి ఆక్సిజన్ని తీసుకొచ్చింది. ఈ నెల 2న సింగపూర్ చేరుకున్న ఐఎన్ ఎస్ ఐరావత్, ఐఎన్ఎస్ తల్వార్ యుద్ధ నౌకల ద్వారా పెద్ద ఎత్తున మెడికల్ ఆక్సిజన్ నిల్వల్ని తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరం విశాఖకు తీసుకొచ్చాయి. ముందుగా ఐఎన్ఎస్ తల్వార్ 54 టన్నుల ద్రవపు ఆక్సిజన్ తో విశాఖ తీరానికి చేరుకుంది. అనంతరం.. అతి పెద్ద ల్యాండింగ్ షిప్ ఐఎన్ఎస్ ఐరావత్ భారీ స్థాయిలో ఆక్సిజన్ని సింగపూర్ నుంచి తీసుకొచ్చింది. 27 టన్నుల సామర్థ్యం ఉన్న 8 ఆక్సిజన్ ట్యాంకర్లతో పాటు 3,600 ఆక్సిజన్ సిలిండర్లు, పెద్ద ఎత్తున కోవిడ్–19కి సంబంధించిన మెడికల్ సామగ్రిని తీసుకొచ్చింది.