న్యూఢిల్లీ మే 10
కేంద్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఉంటే.. ప్రస్తుతం విదేశాల నుంచి భారత్ సాయం పొందే అవసరం వచ్చేది కాదన్నారు. విదేశాల నుంచి సాయం పొందుతూ కూడా కేంద్రం తన చర్యలను సమర్థించుకోవడం బాధాకరమని రాహుల్ ట్వీట్ చేశారు. ‘విదేశాల సాయం తీసుకోవడాన్ని భారత ప్రభుత్వం పదేపదే గొప్పగా చెప్పుకోవడం బాధాకరం. ప్రభుత్వం తన బాధ్యతను సరిగా నిర్వర్తించి ఉంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదు’ అని పేర్కొన్నారు.వివిధ దేశాల నుంచి అందుతున్న సాయంపై కేంద్రం పారదర్శకత పాటించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన సహాయక సామగ్రి వివరాలను చెప్పాలని కోరుతోంది. మహమ్మారిపై పోరాడుతున్న భారత్‌కు పెద్ద ఎత్తున వివిధ దేశాల నుంచి సాయం అందుతోంది. ఇప్పటికే అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, ఐర్లాండ్, రొమేనియా, సింగపూర్, స్వీడన్, కువైట్ దేశాలు టెస్ట్ కిట్లు, ఆక్సిజన్ ఉత్పత్తి పరికరాలు, మందులతో పాటు అవసరమైన సామగ్రిని అందజేసిన విషయం తెలిసిందే.