న్యూఢిల్లీ, మే 11,
కరోనా మహమ్మారి ప్రపంచం మీదకు చైనా వదిలిన జీవాయుధమేనన్న అనుమానాలకు బలం చేకూర్చేలా ఆ దేశ అధికారిక డాక్యుమెంట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. కరోనాను జీవాయుధంగా మార్చి ప్రపంచంపైకి వదిలితే ఎలా ఉంటుందని చైనా శాస్త్రవేత్తలు ఆరేండ్ల క్రితమే చర్చించుకొన్నట్టు ఆ డాక్యుమెంట్ పేర్కొన్నది. మూడో ప్రపంచయుద్ధం వస్తే వైరస్‌ను జీవాయుధంగా ఉపయోగించుకోవాలని సూచించింది. డాక్యుమెంట్‌లోని వివరాలపై వీకెండ్ ఆస్ట్రేలియా మ్యాగజైన్ ఒక కథనాన్ని ప్రచురించింది.‘ప్రపంచం మీదకు చైనా వదిలిన జీవాయుధం కరోనా మహమ్మారి. లేకపోతే అన్ని దేశాల్లో మళ్లీమళ్లీ విజృంభించిన వైరస్ తన పుట్టినిైల్లెన చైనాలో మాత్రం ఒక్క నగరానికే ఎందుకు పరిమితమైంది. ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంటే చైనా ఒక్కటే ఎలా అంత వేగంగా వైరస్‌ను అడ్డుకోగలిగింది..’ కరోనా వ్యాప్తి మొదలైన కొన్ని రోజుల నుంచి ఇప్పటివరకు ప్రపంచం మదిని తొలిచేస్తున్న అనుమానం ఇది. ఈ అనుమానానికి బలం చేకూర్చే చైనా అధికారిక డాక్యుమెంట్ ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. వీకెండ్ ఆస్ట్రేలియన్ అనే మ్యాగజైన్ దానిని బయటపెట్టింది. కథనం ప్రసారం చేసింది. ఈ కథనం ప్రకారం.. కరోనా వైరస్‌ను జీవాయుధంగా మార్చి ప్రపంచ దేశాలపై ప్రయోగిస్తే ఎలా ఉంటుందని ఆరేండ్ల క్రితం 2015లో చైనా శాస్త్రవేత్తలు చర్చించుకొన్నారు. మూడో ప్రపంచ యుద్ధం వస్తే కరోనా వైరస్‌ను జీవాయుధంగా ప్రయోగించాలని సూచించారు. జీవాయుధాల్లో కరోనా వైరస్‌ను ఓ కొత్త శకంగా వారు అభివర్ణించారు.కరోనా మహమ్మారి వూహాన్‌లోని ఓ మార్కెట్‌లో బయటపడిందని చైనా తొలి నుంచి చెప్తున్నది. అందరూ నిజమనే నమ్మారు. అయితే చైనా చెప్పిన సమయం కన్నా ముందే కరోనా కేసులు వచ్చినట్టు బయటపడటం, వైరస్ గురించి చైనా ప్రపంచానికి ముందే సమాచారం ఇవ్వకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. వైరస్ పుట్టుకపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తునకు చైనా అనుమతినివ్వకపోవడం అనుమానాలను మరింత పెంచింది. అదే సమయంలో చైనా నుంచి పాకిన వైరస్ పశ్చిమదేశాల్లో మరణమృదంగం మోగిస్తుంటే చైనాలో కేసులు ఒక్కసారిగా పడిపోవడం అందరినీ విస్మయపర్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరితో ఆ దేశం ఆత్మరక్షణలో పడిన వేళ ప్రపంచంపై ఆధిపత్యం సాధించేందుకు చైనా ఈ జీవాయుధాన్ని వదిలిందని ఆరోపణలు ఉన్నాయి.