హైద్రాబాద్, మే 12,
తెలంగాణ రాష్ట్రంలో అబ్కారీ శాఖకు వచ్చే ఆదాయం గురించి తెలిసి ఈ దేశమే షాక్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మందుబాబులు తెలంగాణలో కోట్లలో ఆదాయాన్ని తీసుకుని వస్తున్నారు. తాజాగా తెలంగాణలో 10 రోజుల పాటూ లాక్ డౌన్ ను అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా మద్యం షాపుల ముందు భారీగా క్యూ కట్టేశారు. వైన్స్ షాపుల వద్ద మద్యం బాబులు బారులు తీరారు. మద్యం దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్ విధించినట్లు ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే మందు బాబులు ముందస్తుగానే మద్యం కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. మద్యం దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. అటు వ్యాపారులు, ఇటు కొనుగోలుదారులు కోవిడ్ నిబంధ నలు పాటించడం లేదు. అధికారులు ఆంక్షలు విధించినప్పటికి షాపుల వద్ద వీటిని ఎవరూ పట్టించుకోవడంలేదు.తెలంగాణలో లాక్‌డౌన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పదిరోజుల పాటు ఈ లాక్‌డౌన్ కొనసాగనుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రం లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. నిత్యవసరాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు ఈ సమయంలో వెసులుబాటు కల్పించారు. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్ అమలు కానుంది. ఈ సమయంలో దాదాపు అన్ని కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. అత్యవసర సేవలను మాత్రమే అనుమతించనున్నారు. హఠాత్తుగా లాక్ డౌన్ విధించడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్కసారిగా రేపటి నుంచి లాక్ డౌన్ అని ప్రకటిస్తే... ఇంత తక్కువ సమయంలో ఇతర రాష్ట్రాల ప్రజలు వారి స్వస్థలాలకు ఎలా వెళ్తారని హైకోర్టు ప్రశ్నించింది. గత ఏడాది లాక్ డౌన్ వల్ల లక్షలాది మంది వలస కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడగా.. ఈసారి అలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రోజువారీ కూలీ చేసుకుంటూ బతుకుతున్న వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించగా.. దీనికి సమాధానంగా ఇప్పటికే 50 శాతం మంది వలస కార్మికులు వాళ్ల సొంతూళ్లకు వెళ్లిపోయారని కోర్టుకు ఏజీ తెలిపారు. లాక్ డౌన్ సమయంలో సాయంత్రం వేళల్లో ఎలాంటి సడలింపులు ఉండవని ఏజీ చెప్పారు.