హైదరాబాద్, మే 13,
విడ్ నుంచి కోలుకున్న వారిలో కొందరికి బ్లాక్ ఫంగస్ వ్యాప్తి చెందుతున్న విషయం విదితమే. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులను గుర్తించారు. అయితే బ్లాక్ ఫంగస్‌కు సంబంధించి 3 కేసులు హైదరాబాద్‌లో బయట పడడం కలకలం సృష్టిస్తోంది. నగరంలోని నిజాంపేటకు చెందిన ఎస్ఎల్‌జీ హాస్పిటల్ వైద్యులు తమ వద్ద చికిత్స తీసుకుని కోవిడ్ నుంచి కోలుకున్న ముగ్గురు పేషెంట్లకు బ్లాక్ ఫంగస్ వచ్చినట్లు నిర్దారించారు.కాగా సదరు పేషెంట్ల వయస్సు 25, 42, 63 ఏళ్లని ఆ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత నాసికా రంధ్రాల్లో అడ్డంకులు ఏర్పడ్డాయని, కంటికి సంబంధించిన సమస్యలు వచ్చాయని అన్నారు. కాగా కోవిడ్‌తో బాధపడుతున్న సమయంలో వారికి స్టెరాయిడ్స్ ద్వారా చికిత్సను అందించామని, వారు ఆక్సిజన్ సపోర్ట్‌పై కూడా ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలోనే వారిలో మ్యుకొర్‌మైకోసిస్ ను గుర్తించామని తెలిపారు.అయితే సదరు పేషెంట్లకు చికిత్సను అందిస్తున్నామని, ప్రస్తుతం వారి కండిషన్ బాగానే ఉందని తెలిపారు. శరీరంలో ఇన్ఫెక్షన్ ఇతర భాగాలకు వ్యాప్తి చెందకుండా ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేశామని వివరించారు. కాగా అనియంత్రిత మధుమేహం, ఐసీయూలో ఎక్కువ రోజులు ఉండడం, స్టెరాయిడ్స్ ను ఎక్కువగా వాడడం, అవయవ మార్పిడి జరిగిన వారిలో, ట్యూమర్లు ఉన్నవారిలో బ్లాక్ ఫంగస్ వస్తుందని, వారు కోవిడ్ బారిన పడి కోలుకుంటే బ్లాక్ ఫంగస్ వచ్చేందుకు అవకాశం ఉంటుందని, కనుక వారు కోవిడ్ నుంచి కోలుకున్నాక ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.