- సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది.
కురువృద్ధుడు భీష్ముడు అంపశయ్యమీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు ఆగి ఆ పుణ్యకాలం వచ్చాకే మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది.
సూర్యుడు ప్రతినెలా ఒక్కోరాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. సూర్యాది గ్రహాల అంతర గమనాన్ని సంక్రాంతి అంటారు. ఇలా సూర్యుడు పుష్యమాసంలో మకరరాశిలోకి సంక్రమణం చెందుతాడు. దీన్నే మకర సంక్రాంతి అంటారు. ఇదేవిధంగా సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి మకరరాశిలోకి ప్రవేశించే వరకు ఉన్న కాలాన్నే "ధనుర్మాసం" అంటారు.
ఈ ధనుర్మాసంలోనే శ్రీవిల్లిపుత్తూరులో ఆళ్వార్ కుమార్తెగా పెరిగిన లక్ష్మీదేవి అవతారమైన ఆండాళ్ మాత విష్ణుమూర్తిని పెళ్ళాడాలని సంకల్పించి నోము ఆచరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
ఈ నోము ఫలితంగా ఆండాళ్ దేవి కృష్ణభగవానుడినే భర్తగా పొందిన విషయం అందరికీ తెలిసిందే. అందుచేత ఈ ధనుర్మాసంలో నోమును ఆచరించే కన్యలు వారి మనస్సు మెచ్చిన వ్యక్తినే భర్తగా పొందుతారని పండితులు అంటున్నారు.
అట్టి మహిమాన్వితమైన ఈ మాసంలో ఇళ్ళముందు.. పేడతో కళ్లాపుచల్లి రంగవల్లులు తీర్చిదిద్ది వాటి మీద ఆవుపేడతో చేసిన గొబ్బిళ్ళను పెడతారు. గొబ్బిళ్ళమీద, ఈ కాలంలో పూసే రకరకాల పూలను అలంకరిస్తారు. ఇలా సంక్రాంతి పండుగ వచ్చేంతవరకు అందరూ తమ తమ ఇళ్లముందు రంగవల్లులతో అలంకరించి.. లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతారు.
ఇంకా దేవతా పూజలకు ధనుర్మాసం విశిష్టమైంది. అందుకే ఈ మాసంలో ధనుర్మాసంలో శుభకార్యాలను పక్కన బెట్టి దేవతలను పూజించాలని పండితులు అంటున్నారు. దేవతలతో పాటు కృష్ణభగవానుడికి ప్రీతికరమైన ఈ ధనుర్మాసం పూర్తిగా ఆ భగవానుడిని స్మరిస్తూ పూజ చేసే వారి అభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం.
ఇంకా పెళ్లికాని కన్యలు ధనుర్మాసంలోని 30 రోజులు దీక్షతో ఆ దేవదేవుడిని ప్రార్థిస్తే గుణవంతుడైన భర్తను పొందవచ్చునని పురోహితులు చెబుతున్నారు. అందుచేత ఈ మాసం పూర్తిగా విష్ణుమూర్తిని ప్రార్థించి ఆయన అనుగ్రహం పొందుదుము గాక..!