YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

గురు రాఘవేంద్రస్వామి

గురు రాఘవేంద్రస్వామి

కుంభకోణం శ్రీ మఠం లో రాఘవేంద్రస్వామి , తన ధ్యానము  ముగించి కనులు తెరవగ తెరవగానే మఠంలో పనిచేసే  ఇద్దరు వ్యక్తుల సంభాషణ ఆయన చెవినపడింది. " ఈ వార్త విన్నావా! యాదవేంద్ర స్వామి ఆగ్రహంతో కుంభకోణం వస్తున్నారుట " ఓ , అలాగా.. ఎందుకట ఆగ్రహం ? "ఎందుకంటే , యీ మఠ  ఆధిపత్య భాధ్యతలు ఆయనకే కదా చేరాలి. తన  తరువాత సన్యాసం తీసుకున్న రాఘవేంద్రస్వామికి మఠాధిపత్యం ఎలా లభిస్తుంది..? అందుకే యాదవేంద్రులవారికి కోపంవచ్చిందట. రేపు ఏం జరుగుతుందో? ఈ సమస్య ఎలా తీరుతుందో ?" వారి మాటలు విన్న రాఘవేంద్ర స్వామి తనలో తానే నవ్వుకున్నారు. శ్రీ యాదవేంద్రస్వామికి శ్రీ సుధీంద్ర తీర్ధులవారు  సన్యాసం యిచ్చి పీఠాధిపతిని చేశారు. తరువాత, యాదవేంద్రస్వామి తీర్ధ యాత్రలకి బయలుదేరినప్పుడు, తను స్వయంగా ములా రామునికి పూజలు చేయడం వీలుపడదని బాధపడుతూ వేంకటనాధునికి సన్యాసాశ్రమం యిచ్చారు.  సరస్వతీదేవి అనుగ్రహం లభించిన శ్రీ రాఘవేంద్రస్వామి తన పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకుని యీ జన్మలో తను చేయవలసిన సత్కార్యములు పాటిస్తూ అందరి ఆదరాభిమానాలు పొందగలిగారు. కాని ఇప్పుడు యాదవేంద్రస్వామి శ్రీమఠానికి తిరిగి వస్తే మఠాధిపత్యం ఎవరికి చెందుతుందని  ఊరిలో వారంతా చర్చించుకోసాగారు. మరునాడు ఎదురు చూసినట్టుగానే యాదవేంద్రస్వామి మఠానికి వచ్చారు. వారిని ఆనందంగా సగౌరవంగా ఆహ్వానించారు రాఘవేంద్ర స్వామి. ఏం జరగబోతున్నదోనని అందరూ ఉత్కంఠ గా చూస్తున్నారు.   శ్రీ రాఘవేంద్రస్వామి యాదవేంద్రస్వామివారిని  అధిపతిపీఠం మీద ఆశీనులవమని కోరారు. అందుకు యాదవేంద్రస్వామి పరమశాంతంగా "రాఘవేంద్రా..ఈ శ్రీపీఠానికి మఠాధిపతులు మీరే. మీరు అనుమతి యిస్తే, నేను మూలారాముని పూజించి వెళ్ళి పోతాను.అందుకోసమే ఇక్కడకు వచ్చాను "
అని తెలిపారు. యాదవేంద్రస్వామి కోరికను వినయపూర్వకంగా అంగీకరించిన రాఘవేంద్రస్వామి " స్వామీ ! మీరు శ్రీరాముని పూజ చేయగా  నేను చూడగలగడం నా భాగ్యం" అన్నారు. రామునికి రాజ్యాన్ని అప్పగిద్దామని వచ్చిన భరతుని సౌశీల్యాన్ని సందేహపడినట్లు లౌకిక విషయాలకు అతీతులైన  యాదవేంద్రస్వామివారి ఔన్నత్యాన్ని శంకించినవారందరికీ కనువిప్పు కలిగింది. సిగ్గుతో తలదించుకున్నారు. మనోపరిపక్వత చెందిన పరిశుధ్ధ ఆత్మే భగవంతుని చేరుకుంటుంది. శ్రీయాదవేంద్రస్వామి, శ్రీ రాఘవేంద్రస్వామి బ్రహ్మ జ్ఞానులు. సామాన్యులు ఎవరూ అలాటి మహనీయులను అర్ధం చేసుకోలేరు. 

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts