అదిలాబాద్. మే 14,
మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లుగా తయారైంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పరిస్థితి.. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి గత ఏడాది మార్చి నుంచి అసలేమాత్రం కాలం కలిసి రావటం లేదు.. గత ఏడాది మార్చిలో కరోనా వ్యాప్తి ప్రారంభం కావటంతో లాక్‌డౌన్ అమలు చేసిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమయ్యాక.. కాస్తా బస్సులు రోడ్డెక్కినా అంతగా ఆదాయం మాత్రం సమకూరలేదు.. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆర్టీసీ ఆదాయం పడిపోగా.. తాజాగా లాక్‌డౌన్ కారణంగా పూర్తిగా ఆదాయానికి గండి పడింది.. నాలుగు గంటలు మాత్రమే నడిపేందుకు వెసులుబాటు ఉండగా.. దూరప్రాంతాలకు రద్దు చేసి సమీప ప్రాంతాలకే సేవలు పరిమితవ్వటంతో కేవలం 15శాతానికి ఆదాయం పడిపోయింది.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఉట్నూరు, ఆసిఫాబాద్, మంచిర్యాలలో ఆర్టీసీ బస్సు డిపోలున్నాయి. ఈ ఆరు ఆర్టీసీ డిపోల పరిధిలో మొత్తం 600లకుపైగా ఆర్టీసీ బస్సులున్నాయి. సాధారణంగా లాక్డౌనుకు ముందు అన్ని బస్సులు రోజుకు 2.5లక్షల కిలోమీటర్లు బస్సులు తిరిగేవి. దీంతో సగటున రోజుకు 70-80లక్షల ఆదాయం సమకూరేది. తాజాగా రెండు రోజుల నుంచి లాక్‌డౌన్ అమలు కావటంతో.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకు 70బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. రోజుకు 45వేల కిలోమీటర్లు మాత్రమే తిరుగుతున్నాయి. దీంతో సగటున రోజుకు రూ.12లక్షల ఆదాయం మాత్రమే వస్తోంది. ఈ లెక్కన రెగ్యులర్‌గా వచ్చే ఆదాయంలో కేవలం 15శాతం ఆదాయం కూడా రావటం లేదు. ఆర్టీసీ బస్సులను రోజూ శానిటైజేషన్ చేస్తున్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారమే ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుపుతున్నారు.లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం ఉదయం 6-10గంటల మధ్య నడిపిస్తున్నారు. నాలుగు గంటలే బస్సులు నడిపేందుకు వెసులుబాటు మాత్రమే ఉంది. దీంతో సుదూర ప్రాంతాలు, ఇతర జిల్లాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు రద్దు చేశారు. కేవలం 60-70కి.మి. దూరం మధ్యనే ఆర్టీసీ సేవలు అందిస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, వరంగల్ లాంటి ప్రాంతాలకు బస్సు సర్వీసులు రద్దు చేశారు. పూర్వ జిల్లా కేంద్రం నుంచి ఇతర జిల్లాలకు సర్వీసులు లేవు. ఆదిలాబాద్-భైంసా, ఆదిలాబాద్-మంచిర్యాల, ఆదిలాబాద్-ఆసిఫాబాద్ మధ్య బస్సులు తిరగటం లేదు. డిపో నుంచి వెళ్లి రావటానికి 4గంటలు మించకుండా షెడ్యూల్ పెట్టారు. ఉదయం 6గంటలకు డిపో నుంచి బయలు దేరిన బస్సు రెండు గంటల్లోపు సంబంధిత ప్రాంతానికి చేరుకుని.. మరో రెండు గంటల్లోగా అంటే 10గంటల లోపు డిపోకు తిరిగి చేరుకునేలా షెడ్యూల్ పెట్టారు.లాక్‌డౌన్ తొలి రోజైన బుధవారం కొంత రద్దీ ఉన్నా.. రెండో రోజు పెద్దగా జనం లేరు. వ్యాపార పరమైన ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోవటం, వ్యక్తిగత, సామూహిక కార్యక్రమాలు, పనులు లేకపోవటంతో జనాలు బస్సుల్లో తిరిగే పరిస్థితి లేదు. కేవలం తమ సొంత ఊర్లకు, వైద్యం కోసం ఆస్పత్రులకు వెళ్లేవారు మాత్రమే ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి గత ఏడాది మార్చి నెలలో కరోనా రూపంలో పిడుగు పడగా.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంస్థకు సెకండ్ వేవ్ దెబ్బ కొట్టింది. తాజాగా లాక్‌డౌన్ వల్ల కేవలం 4గంటలే నడుపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 21వరకు ఇదే పరిస్థితి ఉంటుందని.. తర్వాత లాక్‌డౌన్ పరిస్థితి బట్టి మార్పు ఉంటుందని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. లాక్డౌన్ పొడగించినా.. కరోనా కేసులు మరింత పెరిగినా.. ఇక ఆర్టీసీ ఆదాయపరంగా గట్టెక్కడం, కోలుకోవటం కష్ట‘మే’