కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ దేశభక్తి నకిలీదని తనకు అనిపిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వ్యాఖ్యానించారు. వందేమాతరం గీతాన్ని త్వరగా పూర్తి చేయాలంటూ రాహుల్‌గాంధీ సూచించినట్లు వాట్సాప్‌లో వచ్చిన వీడియోను చూసి తాను విస్తుపోయానన్నారు. ఇవి తనకు షాక్ ఇచ్చాయన్నారు. ఇదేనా రాహుల్ దేశభక్తి అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా కొప్పళ జిల్లాలోని కుకనూరు జరిగిన భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రసంగించారు.పీకల్లోతు అవినీతిఅక్రమాల పర్వంలో కూరుకున్న కాంగ్రెస్‌కు చరమగీతం పాడడం ద్వారా సమర్థవంతమైన బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు ఎన్నుకోవాలని షా పిలుపునిచ్చారు. మే 15 తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ దుష్టపాలననుంచి ప్రజలకు విముక్తి లభించబోతున్నదని అమిత్‌షా జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌ను తరిమికొట్టాలని తీర్మానించారన్నారు. ఇప్పటికే దేశంలోని 21 రాష్ట్రాలలో బీజేపీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయన్నారు. దక్షిణాదిన కర్ణాటకలో కమల వికాసంతో బీజేపీ విజయపర్వం ప్రారంభం కానుందన్నారు. మే 15న మధ్యాహ్నం 2గంటల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదన్నారు. ఆ క్షణం నుంచే రాష్ట్రంలో యడ్యూరప్ప నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి పర్వం ప్రారంభమవుతుందన్నారు.బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఇవ్వాలని ఆయన పదేపదే పిలుపు నిచ్చారు.