హైదరాబాద్ మే 16,
రోజురోజుకూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మనదేశంలో రోజుకు సగటను 3 లక్షల కేసులు 4 వేలు మరణాలు నమోదవుతున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందట. కరోనా మరణాలను ప్రభుత్వాలు దాస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కరోనా సెకండ్ ఫస్ట్వేవ్ టైంలో ఆ ఆరోపణలు ఎక్కువగా వినిపించాయి. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కరోనా మరణాలను తక్కువ చేసి చూపించాయని ఓ సంస్థ ఆధారాలతో సహా బయటపెట్టింది.యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ) పరిశోధకులు ఇందుకు సంబంధించిన లెక్కలు బయటపెట్టారు. కరోనా మరణాలు దాచిన దేశాల్లో భారత్ కూడా ఉంది. భారతదేశంలో ఇప్పటివరకు 4.3 లక్షల మేర కరోనా మరణాలను తగ్గించినట్టు సదరు సంస్థ తేల్చిచెప్పింది. ‘కోవిడ్ 19 మరణాల అంచనా’ పేరిట ఐహెచ్ఎంఈ ఓ నివేదికను విడుదల చేసింది. అమెరికా 3.4 లక్షల మరణాలను తగ్గించి చూపించిందని సదరు సంస్థ తెలిపింది. భారతదేశం 4.3 లక్షల మరణాలను తక్కువ చేసి చూపించిందని.. రష్యా దాదాపు 5.93 లక్షలు తగ్గించిందని అధ్యయనం తెలిపింది.కోవిడ్ మరణాలపై గుజరాత్ మధ్యప్రదేశ్ ఢిల్లీ తమిళనాడు మహారాష్ట్ర తెలంగాణ ఉత్తర ప్రదేశ్ అస్సాం ఒడిశా కర్ణాటక బిహార్ హర్యానా ఛత్తీస్గడ్ వంటి రాష్ట్రాలు తప్పుడు లెక్కలు చూపించాయని సదరు నివేదిక చెప్పింది. మీడియాలో కూడా ఇందుకు సంబంధించి అనేక కథనాలు వచ్చాయని పేర్కొన్నది.అంతేకాక.. ఆయా రాష్ట్రాల్లో హైకోర్టులు కూడా ఈ విషయంపై సీరియస్ అయినట్టు ఐహెచ్ఏంఈ గుర్తుచేసింది. మే 3 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా 6.93 మిలియన్లు చనిపోతే.. అధికారికంగా 3.24 మిలియన్ల మరణాలను మాత్రమే చూపించాయిన ఐహెచ్ఎంఈ తెలిపింది.